Share News

ప్రశాంతగా.. పారదర్శకంగా లెక్కింపు

ABN , Publish Date - May 25 , 2024 | 12:05 AM

ప్రశాంత వాతావరణంలో.. పారదర్శకంగా.. పకడ్బందీగా ఓట్ల లెక్కింపు నిర్వహించడమే లక్ష్యం అని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ శ్రీకేష్‌బాలాజీలత్కర్‌ తెలిపారు. ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియపై కలెక్టరేట్‌లో శుక్రవారం రిటర్నింగ్‌ అధికారులు, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌, జిల్లా స్థాయి మాస్టర్‌ ట్రైనర్లు, పోస్టల్‌ బ్యాలెట్‌ నోడల్‌ అధికారులతో జరిగిన అవగాహన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.

ప్రశాంతగా.. పారదర్శకంగా లెక్కింపు
కౌంటింగ్‌ కేంద్రంలో ఏర్పాట్లు పరిశీలిస్తున్న జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ

ఈసారి పోస్టల్‌ బ్యాలట్లకే అధిక సమయం

తొలి ఫలితం చిలకలూరిపేట.. చివరి ఫలితం గురజాల

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ శ్రీకేశ్‌ బాలాజీ లత్కర్‌

(నరసరావుపేట, ఆంధ్రజ్యోతి)

ప్రశాంత వాతావరణంలో.. పారదర్శకంగా.. పకడ్బందీగా ఓట్ల లెక్కింపు నిర్వహించడమే లక్ష్యం అని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ శ్రీకేష్‌బాలాజీలత్కర్‌ తెలిపారు. ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియపై కలెక్టరేట్‌లో శుక్రవారం రిటర్నింగ్‌ అధికారులు, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌, జిల్లా స్థాయి మాస్టర్‌ ట్రైనర్లు, పోస్టల్‌ బ్యాలెట్‌ నోడల్‌ అధికారులతో జరిగిన అవగాహన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. సంబంధిత రిటర్నింగ్‌ అధికారులు కౌంటింగ్‌ సెంటర్లోని సా్ట్రంగ్‌ రూంలకు ఒకటి రెండు రోజుల్లో పోస్టల్‌ బ్యాలెట్లను తరలించాలన్నారు. నియోజిక వర్గాల వారీగా 7 ముఖ ద్వారాలను ఏర్పాటు చేశామన్నారు. కౌంటింగ్‌ సిబ్బంది ర్యాండమైజేషన్‌ ప్రక్రియ ఈ నెల 27న తొలిసారి, ఎన్నికల పరిశీలకుల సమక్షంలో 3న రెండో సారి, కౌంటింగ్‌ రోజు 4న ఉదయం 5 గంటలకు చివరిసారి చేపడతామన్నారు. రిటర్నింగ్‌ అధికారులు కౌంటింగ్‌ హాలుకు ఈవీఎంల తరలింపునకు సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలన్నారు. నిబంధనల మేరకు విధులు నిర్వహించాలని, ఏమైనా అవకతవకలు జరిగితే సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకుంటామన్నారు. జాయింట్‌ కలెక్టర్‌ ఏ.శ్యాంప్రసాద్‌, డీఆర్‌వో వినాయకం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నేతల భవితవ్యం తేలేందుకు ఇక పది రోజులే గడువు. ఈ నెల 13న జరిగిన పోలింగ్‌లో ఓటర్లు తీర్పు ఇచ్చారు. వారి తీర్పు ఈవీఎంలలో భద్రంగా ఉంది. ఈవీఎంలను వచ్చే నెల 4న అనగా మరో పది రోజుల్లో తెరవనున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలైన ఓట్ల లెక్కింపునకు జిల్లా యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. నరసరావుపేట మండలంలోని కాకాని వద్ద ఉన్న జేఎన్‌టీయూ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఇక్కడే ఈవీఎం, వీవీప్యాట్లను భద్రపరిచారు. జిల్లాలో అన్నింటి కంటే తక్కువ పోలింగ్‌ కేంద్రాలు ఉన్న చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి జిల్లాలో తొలి ఫలితం వెలువడే అవకాశం ఉంది. చివరి ఫలితం గురజాలది. జిల్లా వ్యాప్తంగా 1929 పోలింగ్‌ కేంద్రాల్లో 14,85,909 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 85 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులు, అత్యవసర ేసవల ఉద్యోగులు కలిపి 1204 మంది హోం ఓటింగ్‌ ద్వారా ఓటు వేశారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఎన్నికల విధులకు హాజరైన మరో 18,086 మంది ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.

700 మంది సిబ్బంది నియామకం..

ఓట్ల లెక్కింపునకు ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 14 చొప్పున ఏడు నియోజకవర్గాలకు 98 టేబుళ్లు, లోక్‌సభకు 98 టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నారు. లోక్‌సభ, అసెంబ్లీలకు పోలైన ఓట్లను వేర్వేరుగా లెక్కిస్తారు. పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపునకు లోక్‌సభకు 18 టేబుళ్లు, అసెంబ్లీ నియోజకవర్గానికి రెండు చొప్పున టేబుళ్లు, మాచర్లకి మూడు, సత్తెనపల్లికి మూడు టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్‌కు సూక్ష్మ పరిశీలకుడితో కలిపి ముగ్గురు ఉద్యోగులను నియమించనున్నారు. ఈ లెక్కన రిజర్వ్‌ సిబ్బంది సహా 700 మంది ఉద్యోగులను ఓట్ల లెక్కింపునకు నియమించనున్నారు. వీరికి రెండు విడతల్లో శిక్షణ ఇవ్వనున్నారు. ఈ సారి పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపునకు అధిక సమయం పట్టే అవకాశం ఉందని యంత్రాంగం అంచనా వేస్తోంది. హోం ఓటింగ్‌ బ్యాలెట్లను కూడా పోస్టల్‌ బ్యాలెట్‌ టేబుళ్లపైనే లెక్కిస్తారు. 2019 ఎన్నికల కంటే ఈ సారి పోస్టల్‌ బ్యాలెట్‌లు ఎక్కువుగా పోలయ్యాయి. ఈ కారణంగా టేబుళ్ల సంఖ్యను పెంచారు. పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపునకు 18 టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నారు. తొలుత పోస్టల్‌ బ్యాలెట్లు భద్రపర్చిన కవర్‌ తెరుస్తారు. అందులో 13 ఏ ధ్రువీకరణపత్రం, ఓటరు, గెజిటెడ్‌ అధికారి సంతకం, ప్రధాన కవర్‌పై ఉన్న సంఖ్య, బ్యాలట్‌ కవర్‌పై ఉన్న సంఖ్యను సరిచూసి అంతా పక్కాగా ఉంటేనే చెల్లిన ఓటుగా పరిగణిస్తారు. లేకుంటే తిరస్కరిస్తారు. ఈ కసరత్తుకి ఎక్కువ సమయం పడుతుంది. రెండో దశలో చెల్లిన చెల్లిన ఓట్లను కట్టలుగా కడతారు. మూడో దశలో చెల్లిన బ్యాలెట్‌ కట్టలను లెక్కిస్తారు. ఈ దశలో ఎవరికి ఎన్ని ఓట్లు పడ్డాయో తేలుతుంది.

ఓట్ల లెక్కింపు సాగేదిలా..

అసెంబీ,్ల లోక్‌సభ నియోజకవర్గాల వారీగా ఓట్ల లెక్కింపు పోలింగ్‌ కేంద్రాల సంఖ్యను బట్టి రౌండ్లగా విభజించారు. అసెంబ్లీ తరహాలోనే లోక్‌సభ ఓట్ల లెక్కింపు కూడా ఏడు కౌంటింగ్‌ హాళ్లలో సమాంతరంగా జరుగుతుంది. పెదకూరపాడు నియోజకవర్గంలో 266 పోలింగ్‌ కేంద్రాలు ఉండగా ఓట్ల లెక్కింపు 19 రౌండ్లలో పూర్తవుతుంది. చిలకలూరిపేటలో 241, నరసరావుపేటలో 246 పోలింగ్‌ కేంద్రాలకు 18 రౌండ్లలో, సత్తెనపల్లిలో 274 పోలింగ్‌ కేంద్రాలకు 20 రౌండ్లలో, వినుకొండలో 299, గురజాలలో 304, మాచర్లలో 299 పోలింగ్‌ కేంద్రాలకు 22 రౌండ్లలో ఓట్లను లెక్కిస్తారు.

పోస్టల్‌ బ్యాలెట్ల భద్రత ఇలా..

పెదకూరపాడు, చిలకలూరిపేట, గురజాల, మాచర్ల నియోజకవర్గాలకు సంబంధించిన పోస్టల్‌ బ్యాలెట్లను ఆయా పోలీస్‌స్టేషన్లలో భద్రపరిచారు. వినుకొండ, నరసరావుపేటవి స్థానిక ట్రెజరీల్లో భద్రపరచగా సత్తెనపల్లివి రిటర్నింగ్‌ ఆఫీసర్‌ ఆధీనంలో ఉన్నాయి. పోస్టల్‌ బ్యాలెట్లన్నింటిని 3న సాయంత్రం నాలుగు గంటలకు కట్టుదిట్టమైన భద్రత నడుమ జేఎన్టీయూ కౌంటింగ్‌ సెంటర్‌కు తరలిస్తారు.

Updated Date - May 25 , 2024 | 12:05 AM