Share News

పీహెచ్‌సీని సందర్శించిన జిల్లా వైద్యాధికారి

ABN , Publish Date - May 30 , 2024 | 12:33 AM

మండల కేంద్రం భట్టిప్రోలు పీహెచ్‌సీలో ఇరువురు వైద్యాధికారుల గైర్హాజరుపై జిల్లా వైద్యాధికారిణి టి.విజయమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు.

  పీహెచ్‌సీని సందర్శించిన జిల్లా వైద్యాధికారి
రికార్డులు పరిశీలిస్తున్న జిల్లా వైద్యాధికారిణి విజయమ్మ

భట్టిప్రోలు, మే 29 : మండల కేంద్రం భట్టిప్రోలు పీహెచ్‌సీలో ఇరువురు వైద్యాధికారుల గైర్హాజరుపై జిల్లా వైద్యాధికారిణి టి.విజయమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక పీహెచ్‌సీని బుధవారం ఆమె సందర్శించి రికార్డులను పరిశీలించారు. ఆమె విచ్చేసిన సమయంలో సిబ్బంది మాత్రమే ఉండడం వైద్యులు లేకపోవడంతో ఫోన్‌ చేసి ఎందుకు అందుబాటులో లేరని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విజయమ్మ మాట్లాడుతూ వైద్యశాలల్లో నిర్ధేశించిన సమయం ప్రకారం వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండాలని లేకుంటే శాఖాపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మాతా శిశు మరణాల నిరోధమే లక్ష్యంగా ప్రభుత్వ వైద్యశాలలు పని చేయాలన్నారు. గర్భిణుల నమో దు ఖచ్చితంగా ఉండాలన్నారు. ప్రసవాలు ప్రభుత్వ వైద్యశాలలోనే జరిగేలా అవగాహన కల్పించాల్సిన బాధ్యత సిబ్బందిపై ఉందన్నారు. ప్రభుత్వ వైద్యశాలలో సకల సౌకర్యాలు అందుబాటులో ఉన్నందున వాటిని సద్వినియోగపరచుకునేలా రోగులను చైతన్యపరచాలన్నారు. ప్రభుత్వ వైద్యశాలల పట్ల నమ్మకం కలిగేలా బాధ్యతాయుతంగా పని చేయాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో సీహెచ్‌ఓ మంగరాజు, హెల్త్‌ ఎడ్యుకేటర్‌ పద్మావతి, హెల్త్‌ విజిటర్‌ రుసుమాలు, ఫార్మసిస్టు నాగకన్యకాదేవి, ఏఎన్‌ఎంలు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - May 30 , 2024 | 12:33 AM