వికటించిన వైద్యం.. ఒకరి మృతి
ABN , Publish Date - Jul 28 , 2024 | 12:44 AM
వైద్యం వికటించి ఓ రైతుకూలీ మృతి చెందిన సంఘటన వినుకొండలో శనివారం చోటు చేసుకుంది.

వినుకొండటౌన్, నూజండ్ల, జూలై 27: వైద్యం వికటించి ఓ రైతుకూలీ మృతి చెందిన సంఘటన వినుకొండలో శనివారం చోటు చేసుకుంది. మృతుడి బంధువులు సమాచారం మేరకు వివరాలు.. నూజండ్ల మండలం బుర్రిపాలెం గ్రామానికి చెందిన తాటి శ్రీను (30) గొర్రెలు కాసుకునేవాడు. ఈ క్రమంలో కాలి బొటన వేలుకు గాయం కాగా బుర్రిపాలెం సమీపంలోని రవ్వారంలోని ఆర్‌ఎంపీ సిహెచ్.మల్లికార్జునరెడ్డి వద్దకు చికిత్సకు వెళ్లాడు. గాయానికి వైద్యం చేసి, అనంతరం నొప్పికి ఇంజక్షను చేశాడు. కొద్ది సేపటికి శ్రీనుకు ఒళ్ళంతా మంటలు రావడంతో పాటు, ఒంటిపై బొబ్బలు వచ్చి, ఒక్కసారిగా స్పృహతప్పి పడిపోయాడు. దీంతో ఆర్‌ఎంపీ వెంటనే శ్రీనును ఆటోలో వినుకొండ వైద్యశాలకు తరలించాడు. అప్పటికే శ్రీను మృతి చెందాడని వైద్యులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న గ్రామస్తులు, శ్రీను బంధువులు పెద్ద సంఖ్యలో వినుకొండ వైద్యశాల వద్దకు చేరుకున్నారు. శ్రీనుకి భార్య ఆదిలక్ష్మి, ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఆర్‌ఎంపీపై చర్యలు తీసుకోవాలని శ్రీను కుటుంబ సభ్యులు నూజండ్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పరారీలో ఆర్‌ఎంపీ
శ్రీను మృతి చెందాడని సమాచారం మేరకు బంధువులు పెద్ద సంఖ్యలో వినుకొండ ఆస్పత్రి వద్దకు చేరుకోవడంతో ఆర్‌ఎంపీ అక్కడ నుంచి పరారయ్యాడు. తన బావమరిది సాయంతో రాజీకి ప్రయత్నించినప్పటికీ శ్రీను బంధువులు ససేమిరా అన్నారు. ఆర్‌ఎంపీ మల్లికార్జునరెడ్డి నరసరావురాపేట పార్లమెంట్ వైసీపీ వైద్యవిభాగం జనరల్ సెక్రటరీ.
ఆర్‌ఎంపీని కఠినంగా శిక్షించాలి : ఎమ్మెల్యే జీవీ
తెలిసీతెలియని వైద్యంతో పేద రైతు కూలీని బలితీసుకున్న ఆర్‌ఎంపీ మల్లికార్జునరెడ్డిని కఠినంగా శిక్షించాలని ఎమ్మెల్యే జీవీ ఆంజినేయులు డిమాండ్ చేశారు. జీవీ మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావుతో కలిసి శ్రీను మృతదేహాన్ని సందర్శించి కుటుంబసభ్యులను పరామర్శించారు. న్యాయం చేస్తామని వారికి హామీ ఇచ్చారు. అనంతరం వారు విలేకర్లతో మాట్లాడుతూ ఎక్స్పైరీడేట్ ఇంజక్షన్ చేయడంతో అది వికటించి చనిపోయాడన్నారు. జనసేన పార్టీ నాయకులు కొణిజేటి నాగశ్రీను, మండల అధ్యక్షుడు మురళీకృష్ణయాదవ్, మీసాల ఆంజనేయులు, గరునాఽథం, సోమేపల్లి బ్రహ్మయ్య, రోడ్డా వీరాంజనేయరెడ్డి, గంగినేని బాబు, ఎర్రయ్య తదితరులు వారి వెంట ఉన్నారు.