Share News

గడువు.. పది రోజులే

ABN , Publish Date - May 24 , 2024 | 11:48 PM

నేతల భవితవ్యం తేలేందుకు ఇక పది రోజులే గడువు. ఈ నెల 13న జరిగిన పోలింగ్‌లో ఓటర్లు తీర్పు ఇచ్చారు. వారి తీర్పు ఈవీఎంలలో భద్రంగా ఉంది. ఈవీఎంలను వచ్చే నెల 4న అనగా మరో పది రోజుల్లో తెరవనున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలైన ఓట్ల లెక్కింపునకు జిల్లా యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది.

గడువు.. పది రోజులే
గుంటూరులో తనిఖీలు చేస్తున్న పోలీసులు

ఓట్ల లెక్కింపునకు అధికారుల కసరత్తు

గుంటూరు, మే 24 (ఆంధ్రజ్యోతి): నేతల భవితవ్యం తేలేందుకు ఇక పది రోజులే గడువు. ఈ నెల 13న జరిగిన పోలింగ్‌లో ఓటర్లు తీర్పు ఇచ్చారు. వారి తీర్పు ఈవీఎంలలో భద్రంగా ఉంది. ఈవీఎంలను వచ్చే నెల 4న అనగా మరో పది రోజుల్లో తెరవనున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలైన ఓట్ల లెక్కింపునకు జిల్లా యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. ఈవీఎంల భద్రపరిచిన ఆచార్య నాగార్జున యూనివర్సిటీలోనే ప్రత్యేకంగా ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఓట్ల లెక్కింపులో భాగంగా తొలుత పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు జరిపేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఓట్ల లెక్కింపునకు సంబంధించిన సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు కూడా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈసారి పెద్దసంఖ్యలో పోస్టల్‌బ్యాలెట్లు రాగా వాటి లెక్కింపునకు ప్రత్యేక టేబుళ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పోస్టల్‌బ్యాలెట్లకు తోడు హోంఓటింగ్‌ బ్యాలెట్లు కూడా వచ్చాయి. హోం ఓటింగ్‌ బ్యాలెట్లను కూడా పోస్టల్‌ బ్యాలెట్‌ టేబుళ్లపైనే లెక్కిస్తారు. ఈ సారి పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపునకు అధిక సమయం పట్టే అవకాశం ఉందని యంత్రాంగం అంచనా వేస్తోంది. తొలుత పోస్టల్‌ బ్యాలెట్లు భద్రపర్చిన కవర్‌ తెరుస్తారు. అందులో 13 ఏ ధ్రువీకరణపత్రం, ఓటరు, గెజిటెడ్‌ అధికారి సంతకం, ప్రధాన కవర్‌పై ఉన్న సంఖ్య, బ్యాలట్‌ కవర్‌పై ఉన్న సంఖ్యను సరిచూసి అంతా పక్కాగా ఉంటేనే చెల్లిన ఓటుగా పరిగణిస్తారు. లేకుంటే తిరస్కరిస్తారు. ఈ కసరత్తుకి ఎక్కువ సమయం పడుతుంది. రెండో దశలో చెల్లిన చెల్లిన ఓట్లను కట్టలుగా కడతారు. మూడో దశలో చెల్లిన బ్యాలెట్‌ కట్టలను లెక్కిస్తారు. ఈ దశలో ఎవరికి ఎన్ని ఓట్లు పడ్డాయో తేలుతుంది. అసెంబీ,్ల లోక్‌సభ నియోజకవర్గాల వారీగా ఓట్ల లెక్కింపు పోలింగ్‌ కేంద్రాల సంఖ్యను బట్టి రౌండ్లగా విభజించారు. అసెంబ్లీ తరహాలోనే లోక్‌సభ ఓట్ల లెక్కింపు కూడా కౌంటింగ్‌ హాళ్లలో సమాంతరంగా జరుగుతుంది. నియోజకవర్గ కేంద్రాల్లో భద్రపరిచిన పోస్టల్‌ బ్యాలెట్లను 3న సాయంత్రం నాలుగు గంటలకు కట్టుదిట్టమైన భద్రత నడుమ కౌంటింగ్‌ సెంటర్‌కు తరలిస్తారు.

పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపునకు ఏఆర్‌వోలు

పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపునకు ఏఆర్‌వోలను నియమిస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. తాడికొండకు ఎంపీడీవో తుళ్లూరు, వేమూరుకు కొల్లూరు, వేమూరు ఎంపీడీవోలు, రేపల్లెకు రేపల్లె, చెరుకుపల్లి ఎంపీడీవోలు, తెనాలికి కొల్లిపర, తెనాలి ఎంపీడీవోలు, బాపట్లకు పిట్టలవానిపాలెం, బాపట్ల ఎంపీడీవోలు, గుంటూరు పశ్చిమకు నగర పాలక సంస్థ డిప్యూటీ సిటీ ప్లానర్‌, ఏఈ, డ్వామా పీడీ, గుంటూరు తూర్పునకు హౌసింగ్‌ పీడీ, పర్చూరుకు ఎంపీడీవో పర్చూరు, అద్దంకికి మున్సిపల్‌ కమిషనర్‌, చీరాలకు మున్సిపల్‌ కమిషనర్‌, ఎంపీడీవోలను నియమించింది.

కార్డెన్‌సెర్చ్‌.. తనిఖీలు

గుంటూరు: ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియ దృష్ట్యా జిల్లా వ్యాప్తంగా పోలీసులు కార్డెన్‌ సెర్చ్‌తో పాటు విస్తృతంగా తనిఖీలు ముమ్మరం చేశారు. రౌడీషీటర్లు, ట్రబుల్‌ మాంగర్లు, అనుమానితులను నిలువరిస్తూ ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్‌ ప్రక్రియ జరిగేలా చూస్తున్నారు. పోలీస్‌ ేస్టషన్ల పరిధిలో డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు కార్డెన్‌ సెర్చ్‌, కేంద్ర బలగాల మధ్య ఫ్లాగ్‌ మార్చ్‌ నిర్వహిస్తున్నారు. అనుమానితుల ఇళ్లలో తనిఖీలు చేసి, రికార్డులు లేని వాహనాలను సీజ్‌ చేశారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్‌తో పాటు పోలీస్‌ 30 యాక్ట్‌ అమలులో ఉంటుందని, దానిని అతిక్రమించిన వారిపై క్రిమినల్‌ కేసులు పెడతామని ఎస్పీ తుషార్‌డూడీ హెచ్చరించారు. ప్రజలు ప్రశాంతంగా జీవిస్తూ శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులకు సహకరించాలని కోరారు.

Updated Date - May 24 , 2024 | 11:49 PM