Share News

సిఫార్సు బదిలీలకు చెక్‌

ABN , Publish Date - Jun 07 , 2024 | 01:09 AM

ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన ఉపాధ్యాయ బదిలీలను నిలిపివేస్తూ కొత్త ప్రభుత్వం బ్రేక్‌ వేసింది. దీంతో సిఫార్సులతో ముడుపులు ఇచ్చి బదిలీలు చేయించుకున్న ఉపాధ్యాయుల నోట్లో పచ్చివెలక్కాయ పడింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో సిఫార్సు బదిలీలు దాదాపు 70పైగానే ఉన్నట్లు ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి.

సిఫార్సు బదిలీలకు చెక్‌

ఒక్కో బదిలీకి రూ.4 లక్షల వరకు ముడుపులు వసూలు

పల్నాడు జిల్లా నుంచి గుంటూరుకు 40 మంది బదిలీ

తాడేపల్లి ఎమార్సీలో చక్రం తిప్పిన ఓ ఉపాధ్యాయుడు

అక్రమ బదిలీలపై ఆందోళలను పట్టించుకోని అప్పటి ప్రభుత్వం

కూటమి ప్రభుత్వం అధికారం.. అక్రమ బదిలీల రద్దుకు ఆదేశాలు

గుంటూరు(విద్య), జూన 6: ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన ఉపాధ్యాయ బదిలీలను నిలిపివేస్తూ కొత్త ప్రభుత్వం బ్రేక్‌ వేసింది. దీంతో సిఫార్సులతో ముడుపులు ఇచ్చి బదిలీలు చేయించుకున్న ఉపాధ్యాయుల నోట్లో పచ్చివెలక్కాయ పడింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో సిఫార్సు బదిలీలు దాదాపు 70పైగానే ఉన్నట్లు ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి. ఇందులో అత్యధిక మంది పల్నాడు తదితర ప్రాంతాల నుంచి గుంటూరు జిల్లాలోని నాలుగు మున్సిపల్‌ కేంద్రాల్లోకి బదిలీలు తెచ్చుకున్నారు. ఇలా సిఫార్సు బదిలీ కోసం ఒక్కో ఉపాధ్యాయుడు రూ.2.50 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు చెల్లించుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలో దాదాపు 14 వేల మంది ఉపాధ్యాయులు ఉన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యారంగాన్ని అస్తవ్యస్తం చేసింది. నాలుగేళ్లలో ఒకసారి ఎదో తూతూమంత్రంగా బదిలీలు చేసి ప్రభుత్వం చేతులు దులుపుకుంది. మరోవైపు యాప్‌ల పేరుతో ఉపాధ్యాయులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకువచ్చింది. దీంతో అనేక మంది స్వచ్చంధ ఉద్యోగ విరమణతో బడికి దూరమయ్యారు. దీంతో అనేక ప్రాంతాల్లో ఉపాధ్యాయుల కొరత తీవ్రస్థాయిలో ఏర్పడింది. అనేక పాఠశాలల్లో పదో తరగతి పరీక్షల సమయంలో కూడా సబ్జెక్టు టీచర్లు లేక విద్యార్థులు ఇబ్బందులు పడాల్సిన వచ్చింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్‌లో విడతల వారీగా దాదాపు 70పైగా సిఫార్సు బదిలీలు జరిగాయి. దీనిపై ఉపాధ్యాయ సంఘాలు తీవ్రస్థాయిలో ఆందోళన చేసినా ఫలితం లేకుండా పోయింది. ఇదే సమయంలో ఎన్నికల నోటిఫికేషన రావడంతో ఈ బదిలీలకు తాత్కలికంగా బ్రేక్‌ పడింది. ఒక్కో బదిలీకి భారీ మొత్తంలో ముడుపులు తీసుకుని ఉత్తర్వులు ఇచ్చినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలో అక్రమ బదిలీలు, పరస్పర ఒప్పంద(మ్యూచువల్‌ బదిలీలు) తాడపల్లిలోని ఓ ఎమ్మార్సీ నుంచి ప్రారంభమయ్యాయనే ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ దాదాపు 15 ఏళ్లుగా ఉన్న ఓ ఉపాధ్యాయుడు ఇటువంటి అక్రమాలు చేయడంతో సిద్ధహస్తుడనే ఆరోపణ ఉంది. ఆయన నేరుగా విద్యాశాఖ పేషీలో చక్రం తిప్ప అక్రమ బదిలీలకు గ్రీనసిగ్నల్‌ ఇప్పించేవాడని ప్రచారం ఉంది. ఈ నెల 12న పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. ఈలోగా కొత్త ప్రభుత్వం కొలువు దీరనుంది. ఈ క్రమంలో సిఫార్సు బదిలీలు రద్దయ్యే పరిస్థితి నెలకొంది. ఈ చర్యపై ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

Updated Date - Jun 07 , 2024 | 01:09 AM