Share News

జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు

ABN , Publish Date - May 15 , 2024 | 12:17 AM

సార్వత్రిక ఎన్నికలు జిల్లాలో ప్రశాంతంగా ముగిసినట్లు ఎస్పీ వకుల్‌ జిందాల్‌ తెలిపారు.

జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు

బాపట్ల, మే 14 : సార్వత్రిక ఎన్నికలు జిల్లాలో ప్రశాంతంగా ముగిసినట్లు ఎస్పీ వకుల్‌ జిందాల్‌ తెలిపారు. ఈ విషయమై మంగళవారం ఆయన మాట్లాడుతూ నిష్పక్షపాతంగా, సమర్దవంతంగా విధులు నిర్వహించిన పోలీసుసిబ్బంది, విశ్రాంత ఆర్మీ ఉద్యోగులు, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులను అభినందిస్తున్నట్లు తెలిపారు. అక్కడక్కడ చెదురుమదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయన్నారు. ఈవీఎం బాక్స్‌లను, ఎన్నికల సామగ్రిని, పోలింగ్‌ కేంద్రాలలో ఎన్నికల విధులు నిర్వహించిన అధికారులను, సాయుధబలగాల ఎస్కార్ట్‌తో బాపట్ల ఇంజనీరింగ్‌ కళాశాలలోని స్ర్టాంగ్‌రూమ్‌లకు చేర్చటం జరిగిందన్నారు. పోలీసులు, అధికారులతోపాటు కేంద్ర సాయుధబలగాలు, తమిళనాడు పోలీసులు సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తూ నిష్పక్షపాతంగా నిబద్దతతో ఎన్నికల విధులు నిర్వహించటం వల్ల జిల్లాలో పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసిందన్నారు. అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటున్న ప్రదేశాలకు 5 నిమిషాల వ్యవధిలో పోలీసు బలగాలు చేరుకొని శాంతిభద్రతలను పరిరక్షించటం జరిగిందన్నారు. పోలీస్‌సిబ్బంది వేగంగా స్పందించటానికి, సమర్దవంతంగా శాంతిభద్రతలను పరిరక్షించటానికి సమర్ద్‌మొబైల్‌ యాప్‌ ఎంతగానో దోహదపడిందన్నారు. జిల్లాలోని కొన్ని ప్రదేశాలలో వివాదాలు, ఘర్షణలు చోటు చేసుకున్నాయని, ఆ ప్రదేశాలలో పికెట్స్‌ ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. గొడవలకు కారణమైన వారిపై, ఘర్షణలో పాల్గొన్న వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవటం జరుగుతుందని తెలిపారు. సమర్దవంతంగా ఎన్నికల విధులు నిర్వహించిన ప్రతి ఒక్కరికి ఎస్పీ అభినందనలు తెలిపారు.

Updated Date - May 15 , 2024 | 12:17 AM