Share News

విజయోత్సవ ర్యాలీలకు.. అనుమతి లేదు

ABN , Publish Date - May 22 , 2024 | 01:00 AM

జిల్లాలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌కు సంబంధించి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ప్రాంగణంలో, చుట్టుపక్కల ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ తుషార్‌ డూడి తెలిపారు.

విజయోత్సవ ర్యాలీలకు.. అనుమతి లేదు
జిల్లా ఎస్పీ తుషార్‌ డూడీ

గుంటూరు, మే 21: జిల్లాలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌కు సంబంధించి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ప్రాంగణంలో, చుట్టుపక్కల ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ తుషార్‌ డూడి తెలిపారు. అదే విధంగా ఎలక్షన్‌ కౌంటింగ్‌కు సంబంధించి జిల్లాలో ఎలాంటి ఊరేగింపులు, విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని ఆయన స్పష్టం చేశారు. జిల్లాలో ఎవరైనా శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. జిల్లాలో పోస్టల్‌ బ్యాలెట్‌ కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు, 24/7 సీసీ కెమెరాలు పనిచేస్తూ అధికారుల నిరంతరం తనిఖీలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికల కోడ్‌, సెక్షన్‌ 144 సీఆర్పీసీ, సెక్షన్‌ 30 పోలీస్‌ యాక్ట్‌ అమలులో ఉన్నందున, ఏ ప్రాంతంలో కూడా నలుగురు కన్నా ఎక్కువ మంది ఒకచోట గుమికూడి ఉండరాదని, బహిరంగ సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించరాదన్నారు. ఎలక్షన్‌ కమిషన్‌ ఆదేశాల మేరకు పెట్రోల్‌ బంక్‌లలో పెట్రోల్‌, డీజిల్‌లను వాహనాలలో మాత్రమే నింపాలని, విడిగా బాటిల్స్‌లో పొయ్యరాదని ఆదేశించారు. బాణసంచా కాల్చడానికి అనుమతి లేదని అన్నారు. బహిరంగ ప్రదేశాలలో మద్యం ేసవిస్తే అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గ్రామాలలో ఎవరైనా అనుమానంగా తిరిగినా, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన పోలీస్‌ వారికి వెంటనే సమాచారం అందించాలన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. పోలీస్‌ వారికి సహకరించి, వారి ముందస్తు సూచనలు, సలహాలు పాటించాలని జిల్లా ఎస్పీ తుషార్‌ డూడి తెలిపారు.

Updated Date - May 22 , 2024 | 01:00 AM