Share News

సిట్‌.. స్పీడ్‌

ABN , Publish Date - May 24 , 2024 | 11:44 PM

జిల్లాలో పోలింగ్‌ రోజు, ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటలనపై సిట్‌ దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. నరసరావుపేట పోలీసు స్టేషన్లలో నమోదైన కేసుల రికార్డులను మరోసారి సిట్‌ అధికారి సౌమ్యలత శుక్రవారం పరిశీలించారు.

సిట్‌.. స్పీడ్‌

నరసరావుపేట, రెంటచింతల్లో విచారణ

వీడియో ఫుటేజ్‌లో కనిపిస్తే కేసులు నమోదు

ఎమ్మెల్యేలు పిన్నెల్లి, గోపిరెడ్డిలపై 307 కేసులు

నరసరావుపేట, మే 24: జిల్లాలో పోలింగ్‌ రోజు, ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటలనపై సిట్‌ దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. నరసరావుపేట పోలీసు స్టేషన్లలో నమోదైన కేసుల రికార్డులను మరోసారి సిట్‌ అధికారి సౌమ్యలత శుక్రవారం పరిశీలించారు. రెంటచింతల మండలంలో జరిగిన ఘటనలపై మరో సారి సిట్‌ అధికారి రమణమూర్తి రికార్డులను పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో ఘటనలకు సంబంధించిన వీడియోలను అధికారులు నిశితంగా పరిశీలించారు. దాడులకు తెగబడుతున్నట్లు వీడియోల్లో కనిపిస్తున్న వ్యక్తులపై కేసులు నమోదు చేశారా లేదా అని స్థానిక పోలీసులను ప్రశ్నించారు. దృశ్యాల్లో ఉన్న వారి పేర్లు నమోదు చేసుకుని ఎఫ్‌ఐఆర్‌లలో ఆ పేర్లు ఉన్నయా లేదా అని కూడా పరిశీలించారు. మాచర్ల నియోజకర్గం పాల్వాయిగేటు పోలింగ్‌ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం చేసి, టీడీపీ ఏజెంట్‌ నంబూరు శేషగిరిరావుపై దాడి చేసిన కేసులో ఎమ్మెల్యే పిన్నెల్లిపై రెంటచింతల పోలీసు స్టేషన్‌లో 307 సెక్షన్‌ కింద హత్యాయత్నం కేసు నమోదు చేశారు. నరసరావుపేటలో మున్సిపల్‌ హైస్కూల్‌ పోలింగ్‌ బూత వద్ద కార్లు ధ్వంసం చేసి, టీడీపీ నేతలపై హత్యాయత్నానికి పాల్పడిన సంఘటనలో నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై కూడా 307 సెక్షన్‌ కింద కేసు నమోదు చేశారు. ఈ కేసుల్లో పిన్నెల్లి, డాక్టర్‌ గోపిరెడ్డి హైకోర్టులో ముందస్తు బెయిల్‌ పొందారు. సిట్‌ దర్యాప్తుతో హింసకు పాల్పడిన వారు ఇతర రాషా్ట్రలకు పారిపోగా వారిని అరెస్టు చేయాలని పోలీసులపై సిట్‌ బృందం ఒత్తిడి తీసుకువస్తున్నది.

పిన్నెల్లికి హైకోర్టు ఆంక్షలు

ఈవీఎం ధ్వంసం కేసులో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మంజూరు చేసిన బెయిల్‌లో హైకోర్టు పలు షరతులు పెట్టింది. ఆయన కదలికలపై ఆంక్షలు విధించింది. మాచర్లకు వెళ్లకూడదని, లోక్‌సభ నియోజకవర్గ కేంద్రంలో వచ్చే నెల ఆరో తేదీ వరకు ఉండాలని పిన్నెల్లిని ఆదేశించింది. ఈ మేరకు పిన్నెల్లి ఆరో తేదీ వరకు నరసరావుపేటలోనే ఉండాలి. ఓట్ల లెక్కింపు రోజు మాత్రమే కౌంటింగ్‌ కేంద్రానికి వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. పిన్నెల్లి కదలికలపై పూర్తి స్థాయి నిఘా విధించాలని సీఈవో, పోలీసు అధికారులకు ఉత్తర్వులు జారీచేసింది. ఆయన ఈ కేసుకు సంబంధించి మీడియాకు ఇంటర్వ్యూ ఇవ్వకూడదని సూచించింది. సాక్షులతో మాట్లాడేందుకు కూడా వీలు లేదని పేర్కొంది. ఎటువంటి నేరపూరిత చర్యలో పాల్గొనకూడదని, నమోదైన నేరాలను పునరావృతం చేయకూడదని, జిల్లాలో ఎలాంటి శాంతిభద్రతల సమస్యను సృష్టించకూడదని పేర్కొంది. ఈ షరతుల్లో ఏదైనా ఉల్లంఘించిన సందర్భంలో చట్టానికి అనుగుణంగా అవసరమైన చర్యలు తీసుకుంటామని హైకోర్టు హెచ్చరించింది.

Updated Date - May 24 , 2024 | 11:44 PM