Share News

అరాచకాలపై ఆరా.. ఆగ్రహం

ABN , Publish Date - May 20 , 2024 | 12:27 AM

పోలింగ్‌ విధ్వంసాలు, ఆ తర్వాత జరిగిన హింసలపై సిట్‌ బృందం రెండో రోజు ఆదివారం జిల్లాలో విచారణ కొనసాగించింది. అరాచకాలు జరిగిన తీరు.. నమోదైన కేసులు.. అరెస్టుల వివరాలు తెలుసుకున్న సిట్‌ ఆయా ఘటనలను ఎందువల్ల కట్టడి చేయలేకపోయారని స్థానిక అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.

అరాచకాలపై ఆరా.. ఆగ్రహం
దాచేపల్లిలో స్థానిక పోలీసులతో మాట్లాడుతున్న సిట్‌ అధికారులు

హింసాత్మక కేసులు, సెక్షన్లపై పరిశీలన

పరారీలో ఉన్న వారందరినీ పట్టుకు రావాలి

నరసరావుపేట, కారంపుడి, దాచేపల్లిలో దర్యాప్తు

నరసరావుపేట, కారంపూడి, దాచేపల్లి, రెంటచింతల, మే 19: పోలింగ్‌ విధ్వంసాలు, ఆ తర్వాత జరిగిన హింసలపై సిట్‌ బృందం రెండో రోజు ఆదివారం జిల్లాలో విచారణ కొనసాగించింది. అరాచకాలు జరిగిన తీరు.. నమోదైన కేసులు.. అరెస్టుల వివరాలు తెలుసుకున్న సిట్‌ ఆయా ఘటనలను ఎందువల్ల కట్టడి చేయలేకపోయారని స్థానిక అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. స్పెషల్‌ బ్రాంచ, ఇంటెలిజెన్స విభాగాల పనితీరులో చోటుచేసుకున్న లోపం కూడా అల్లర్లకు కారణమని సిట్‌ గుర్తించినట్లు సమాచారం. జిల్లాలో పోలింగ్‌ రోజు, తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై సిట్‌ విచారణ రెండో రోజు ఆదివారం కొనసాగింది. స్థానిక పోలీసు అధికారుల వైఫల్యాన్ని గుర్తించడంతో పాటు కేసుల నమోదులో అవసరమైన మార్పులు.. చేర్పులు, సెక్షన్ల మార్పుపై చర్యలు చేపడుతున్నారు. రెంటచింతల, నరసరావుపేట రెండో పట్టణ పోలీసు స్టేషన్లలో విచారణ శనివారం అర్ధరాత్రి వరకు కొనసాగింది. ఆదివారం ఉదయం తిరిగి దర్యాప్తును ప్రారంభించింది. నరసరావుపేట ఒకటో పట్టణ, రూరల్‌ పోలీసు స్టేషన్లలో సిట్‌ అధికారి సౌమ్యలత విచారణ చేశారు. నరసరావుపేటలో జరిగిన అరాచకాలపై వీడియో ఫుటేజ్‌ను పరిశీలించారు. కార్లు ధ్వంసం, కారు దహనం, మున్సిపల్‌ ఉన్నత పాఠశాల వద్ద వైసీపీ మూకల దాడులు, గుంటూరు రోడ్డులో జరిగిన పరస్పర దాడులకు సంబంధించిన వివరాలను సేకరించారు. ఈ సంఘటలను జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడంలో పోలీసుల వైఫల్యాన్ని గుర్తించినట్లు సమాచారం. నమోదైన ఎఫ్‌ఐఆర్‌లపై పోలీసు అధికారులను ప్రశ్నించారు. ఆయా కేసులను పునః సమీక్షించనున్నారు. నరసరావుపేటలో రబ్బరు బుల్లెట్లతో కాల్పులు జరపడానికి కారణాలపై సదరు పోలీసు అధికారులను ప్రశ్నించారు.

వెంకట్రామిరెడ్డిపై కేసుల నమోదు పరిశీలన

కారంపూడిలో పోలీస్‌స్టేషనలో ఆదివారం సిట్‌ బృందం విచారణ చేపట్టింది. ఇరువర్గాలు చేసిన విధ్వంస కాండపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ఫైల్స్‌ను బృందంలోని అధికారులు పరిశీలించారు. దాడులకు సంబంధించి ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారు.. ఎందరిని కోర్టులో హాజరుపరిచారు అనే అంశాలను పరిశీలించారు. ఘర్షణలో పాల్గొని ప్రస్తుతం పరారీలో ఉన్న వారి వివరాలను నమోదు చేసుకున్నారు. వారందరినీ అదుపులోకి తీసుకోవాల్సిందేనని స్థానిక అధికారులకు సిట్‌ బృందం సూచించింది. వైసీపీ మూకలు మారణాయుధాలతో స్వైరవిహారం చేయడం, టీడీపీ కార్యాలయం ధ్వంసం, దాడుల వీడియో దృశ్యాలను కూడా పరిశీలించినట్లు తెలిసింది. దాడుల్లో స్వయంగా పాల్గొన్న ఎమ్మెల్యే సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిపై కేసుల నమోదు అంశం కూడా ప్రస్తావించినట్లు సమాచారం. దాచేపల్లి పోలీస్‌స్టేషనలో ఆదివారం సిట్‌ అధికారులు రికార్డులను పరిశీలించారు. తంగెడ పోలింగ్‌ కేంద్రంపై వైసీపీ మూకలు పెట్రో బాంబులతో దాడిపై సిట్‌ స్థానిక పోలీసు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. బాంబు దాడులకు పాల్పడితే బందోబస్తులో ఉన్న సిబ్బంది ఏం చేస్తున్నారని నిలదీసినట్లు సమాచారం. దాచేపల్లిలో కనిశెట్టి నరేంద్ర, కేశానుపల్లిలో నెల్లూరి రామకోటయ్యపై దాడి చేసి గాయపరచడం, ఇరికేపల్లిలో వైసీపీ, టీడీపీ పరస్పర దాడులకు సంబంధించి వివరాలు తీసుకున్నారు. గాయపడిన వ్యక్తులను విచారించారు. దాచేపల్లి సీఐ సురేంద్రబాబు, ఎస్‌ఐలు శివనాగరాజు, అమీవుద్దీనలను విచారించారు. ఆయా గ్రామాలకు చెందిన బాధితులు స్టేషనకు చేరుకుని జరిగిన సంఘటనలపై అధికారులకు వివరాలు అందజేశారు. సిట్‌ బృందంలో ఓ డీఎస్పీ, ముగ్గురు సీఐలు ఉన్నారు. శనివారం రాత్రి రెంటచింతలకు చేరుకున్న సిట్‌ బృందం కొన్నిగంటల పాటు దాడుల ఘటనలకు సంబంధించి సీసీ ఫుటేజ్‌ను పరిశీలించి ఎవరెవరూ ఎలాంటి హడావుడి చేశారనే దానిపై పేర్లతో సహా ఒక నిర్ధారణకు వచ్చింది. నిందితుల ఆనవాళ్లు గుర్తించడంతో పాటు వారి ఆధారాలను సేకరించింది.

అధికారుల పాత్రపై విచారణ..

కొన్ని చోట్ల పోలీసు అధికారుల సాయంతోనే అల్లర్లు, విధ్వంసాలు జరిగాయన్న ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో సదరు అధికారుల కాల్‌ డేటా ఆధారంగా సిట్‌ సమాచారం సేకరిస్తోంది. ఇటువంటి అధికారులపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సిట్‌ బృంద సభ్యులు శనివారం రాత్రి రెంటచింతలకు చేరుకుని స్పెషల్‌ బ్రాంచ్‌, ఇంటెలిజెన్స్‌ విభాగాల పనితీరును పరిశీలించినట్లు తెలిసింది. ఎన్నికల సమయంలో జరిగే ఘర్షణలు, నేతల కదలికలు, ఎత్తుగడలను పసిగట్టి అధికారులకు తెలియచేయాల్సిన స్పెషల్‌ బ్రాంచ్‌ విభాగం ఆ పని చేయలేదని జరిగిన సంఘటనలు బలపరుస్తున్నాయని సిట్‌ బృందం అంచనా వేసినట్లు సమాచారం. ఇక స్వతంత్రంగా పనిచేసే ఇంటెలిజెన్సు పనితీరు లోపాలపై సిట్‌ అధికారులు దృష్టి పెట్టారు.

Updated Date - May 20 , 2024 | 12:27 AM