Share News

లీజుకు ‘కర్మ’ భూమి?

ABN , Publish Date - May 19 , 2024 | 01:43 AM

నిరుపేదల కర్మకాండల కోసం దశాబ్దాల క్రితం పేరం గురుడాచలనాయుడు అనే వ్యక్తి బాపట్ల పరిసరప్రాంతాల్లో 92 ఎకరాల స్థలాన్ని దానంగా ఇచ్చారు. అందులో కొంత భాగంలో బాపట్ల పట్టణ నడిబొడ్డున తూర్పు సత్రం పేరిట ఓ భవనాన్ని నిర్మించి కర్మకాండలకు ఉపయోగిస్తున్నారు.

లీజుకు ‘కర్మ’ భూమి?
పేరం గరుడాచలంనాయుడు తూర్పుసత్రం భవనం

కోడ్‌ అమల్లో ఉండగా.. కిరికిరి నిర్ణయాలు!

బాపట్ల తూర్పుసత్రం భూమిలో కొంత భాగం ఐవోసీకి

రాష్ట్రస్థాయిలో తీసుకున్న నిర్ణయమన్న దేవదాయశాఖ అధికారులు

బాపట్ల, మే 18 (ఆంధ్రజ్యోతి): నిరుపేదల కర్మకాండల కోసం దశాబ్దాల క్రితం పేరం గురుడాచలనాయుడు అనే వ్యక్తి బాపట్ల పరిసరప్రాంతాల్లో 92 ఎకరాల స్థలాన్ని దానంగా ఇచ్చారు. అందులో కొంత భాగంలో బాపట్ల పట్టణ నడిబొడ్డున తూర్పు సత్రం పేరిట ఓ భవనాన్ని నిర్మించి కర్మకాండలకు ఉపయోగిస్తున్నారు. అక్కడే ఖాళీగా ఉన్న స్థలంపై గతంలోనే పాలకపార్టీ నేతల కన్ను పడింది. 216 ఏ జాతీయ రహదారి విస్తరణ పనులు చేపడుతున్న కాంట్రాక్టర్‌కు గుంభనంగా అతితక్కువకు లీజుకు ఇచ్చిన అంశం 2022 నవంబరులో వెలుగుచూసింది. ఈ లీజు అంశాన్ని కాపు సంఘాలతో పాటు టీడీపీ, జనసేన పార్టీలు సైతం అప్పట్లో వ్యతిరేకించాయి. తాజాగా అదే స్థలంలో 78 సెంట్లు ఐవోసీ(ఇండియన ఆయిల్‌ కంపెనీ)కి పెట్రోల్‌ బంకు కోసం లీజుకివ్వడం అది కూడా ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న నెల వ్యవధిలోనే ఇదంతా జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ అంశంపై యంత్రాంగాన్ని వివరణ కోరగా ఐవోసీ ప్రతినిధులు రాష్ట్ర స్థాయిలో ఉన్న దేవదాయశాఖ కమిషనర్‌ను ఆశ్రయించారని, అక్కడ నుంచి వచ్చిన ఆదేశాలనే తాము అమలు చేస్తున్నామని చెప్పారు.

గడచిన నెల 1న లెటర్‌...

బాపట్ల పట్టణ నడిబొడ్డులో ఉన్న పేరం గరుడాచలనాయుడు సత్రం(తూర్పు సత్రం) రోడ్డు పక్కన ఖాళీగా ఉన్న భూమిని పెట్రోలు బంకు కోసం లీజుకు ఇవ్వాలని ఏప్రిల్‌ 1న ఐవోసీ ప్రతినిధులు రాష్ట్ర దేవదాయశాఖ కమిషనర్‌ను ఆశ్రయించినట్లు చెబుతున్నారు. ఆ తర్వాత సీఎస్‌ స్థాయిలో నిర్ణయం జరిగి ఈ నెల 7న లీజుకు సంబంధించి ఆర్డర్‌ ఉత్తర్వులను జిల్లా అధికారులకు పంపించి అమలు చేయనున్నట్లు సమాచారం. 78 సెంట్ల భూమిని నెలకు 46 వేలకు లీజుకు ఐవోసీకి ఇచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. మొత్తం వ్యవహారం అంతా ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండగా జరగడం, అంతా కలిపి నెల వ్యవధిలోనే లీజు అంశాన్ని ఒక కొలిక్కి తేవడం వెనక రాజకీయ ప్రమేయం పైనా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి

గతంలోనూ ఒకసారి ఇలానే...

2022 నవంబరులో ఈ సత్రం భూమినే ఎలాంటి వేలం లేకుండా జాతీయ రహదారి నిర్మాణం చేపడుతున్న కాంట్రాక్టర్‌కు అప్పగించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. అప్పటి కలెక్టర్‌ విజయకృష్ణన ఆదేశాలను సైతం లెక్క చేయకుండా అధికార పార్టీ నేతలు చక్రం తిప్పడంతో నామమాత్రపు ధరకు లీజుకిచ్చారు. అనుమతులు రాకముందే అక్కడ స్థలాన్ని వాడుకోవడంతో అడుగడుగునా అధికార దుర్వినియోగం పాల్పడడంపై విమర్శలు వెల్లువెత్తాయి

సున్నితమైన అంశంలో ఏకపక్షంగా...

పేరం గరుడాచలంనాయుడు అనే వ్యక్తి బాపట్ల ప్రజల మేలు కోసం విరాళంగా ఇచ్చిన భూమి అది. దాని నిర్వహణ దేవాదాయశాఖే చూస్తున్నప్పటికీ అత్తసొమ్మ అల్లుడుదానం చేసిన చందాన సదరు భూమిని ఐవోసీకి లీజుకివ్వడంపై కాపు సంఘాలతో పాటు టీడీపీ, జనసేన పార్టీలు కూడా మండిపడుతున్నాయి. స్థలాన్ని లీజుకు ఇచ్చేటప్పుడు స్థానికంగా ఉండే అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోకుండా నిబంధనల ప్రకారమే లీజుకు ఇచ్చామని ప్రభుత్వం చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోంది

ఆదరాబాదరాగా తీసుకోవాల్సిన అవసరమేమిటి...

బాపట్లలోని తూర్పు సత్రం భూముల విషయం గతంలోనూ వివాదస్పదమైంది. తాజాగా ఇప్పుడు ఐవోసికీ లీజుకివ్వాలనే నిర్ణయం తీసుకోవడంపై బాపట్లవాసులు మండిపడుతున్నారు. యంత్రాంగం ఎన్నికల ప్రకియ్రలో నిమగ్నమై ఉన్న సమయంలో ఈ లీజు నిర్ణయం తీసుకోవడం ఒక ఎత్తయితే బాపట్లలో సత్రం భూములు ఖాళీగా ఉన్న విషయం సదరు కంపెనీ ప్రతినిధులకు తెలియడం, వెంటవెంటనే నిర్ణయాలు జరిగిపోవడంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పైగా జిల్లాకు సంబంధించిన దేవదాయ శాఖ యంత్రాంగాన్ని ఆ స్థలం విషయంలో కనీసం సంప్రదించకుండా రాష్ట్రస్థాయిలో నిర్ణయం తీసుకున్నామని చెప్పడం వెనుక రాజకీయ శక్తుల ప్రమేయం పనిచేసిందనే వ్యాఖ్యానాలు జోరుగా వినిపిస్తున్నాయి.

Updated Date - May 19 , 2024 | 01:43 AM