Share News

బ్రోకర్లకే.. ఉచితం

ABN , Publish Date - Jul 28 , 2024 | 12:45 AM

వైసీపీ హయాంలో ఇసుకను బంగారంగా మార్చి బొక్కేశారు. ఇసుక పాలసీల పేరుతో నిర్మాణదారులకు చుక్కలు చూపారు. భవన నిర్మాణ కూలీలకు పనులు లేకుండా చేశారు. పాలకులేమో రూ.కోట్లు కొట్టేశారు. ఇసుక అక్రమాలకు చెక్‌ చెప్తూ.. అందరికీ అందుబాటులోకి తెస్తూ.. నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించేలా.. కూలీల ఉపాధికి ఢోకా లేకుండా.. కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుకను ప్రవేశపెట్టింది. అయితే ప్రభుత్వ పాలసీ ప్రకారం ఎక్కడా కూడా ఇసుక సరఫరా జరగడంలేదని క్షేత్రస్థాయి పరిస్థితులు తెలియజేస్తున్నాయి. గతంలో ఏవిధంగా అయితే వసూలు చేశారో ఆ ప్రకారంగానే ప్రస్తుతం కూడా ఇసుకను అమ్ముకుంటున్నారు. ప్రభుత్వ ఉచిత ఇసుకతో బ్రోకర్లు సొమ్ము చేసుకుంటున్నారు. అధికారుల పర్యవేక్షణ, నియంత్రణ లేకపోవడంతో ఉచిత ఇసుక లబ్ధి నిర్మాణదారులకు అందడంలేదని తెలుస్తోంది. స్టాక్‌ యార్డుల్లో కూడా బ్రోకర్ల హవానే కొనసాగుతోంది. దీంతో ఉచిత ఇసుక కోసం వెళ్లిన సామాన్యులకు సక్రమంగా అందడంలేదని సమాచారం. అధికారులు కూడా బ్రోకర్లకు సహకరిస్తున్నారు. దీంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరడంలేదు. ఈ క్రమంలో నిర్మాణదారులు ఇసుక రూపంలో దోపిడీకి గురవడం పరిపాటిగా మారింది. అధికారులు కలగ చేసుకొని ఉచిత ఇసుక విధానం సక్రమంగా జరిగేటట్లు చూడాలని పలువురు కోరుతున్నారు.

బ్రోకర్లకే.. ఉచితం
కోనూరులో ఇసుక డంపింగ్‌ యార్డులో లారీలకు లోడు చేస్తున్న దృశ్యం

ప్రభుత్వం మారినా ఆగని దందా

రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం పోయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వైసీపీ ఇసుక పాలసీని రద్దు చేస్తూ చంద్రబాబు ఉచిత ఇసుకను ప్రవేశపెట్టారు. అయినా ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఇసుక అక్రమాలకు అడ్డుకట్ట పడలేదు. ఐదేళ్లు ఇష్టారీతిన అక్రమాలకు పాల్పడిన ఇసుకాసురులు కొత్త ప్రభుత్వంలోనూ ఇసుక దందా కొనసాగిస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఉచిత ఇసుక విధానం ప్రకటనలకే పరిమితమైందన్న విమర్శలు వస్తున్నాయి. బినామీ పేర్లతో ఉచిత ఇసుకను బ్లాక్‌ చేసి గతంలోలానే విక్రయిస్తున్నారు. ఇదిలా ఉంటే చాలా చోట్ల ఇంకా నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరుగుతూనే ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో గత ప్రభుత్వంలో ఇసుక మాఫియాను నడిపించిన నేతలే నేటికీ అదే రీతిలో దందా నడిపించడం గమనార్హం.

బాపట్ల, అచ్చంపేట, తుళ్లూరు, అమరావతి, కొల్లిపర/ బాపట్ల(ఆంధ్రజ్యోతి), జూలై 27: ఇసుకను ఉచితంగా అందిస్తున్నాం. నిర్దేశించిన ప్రకారమే లోడింగ్‌, రవాణా చార్జీలు వసూలు చేయాలి. గత ప్రభుత్వంలో జరిగినట్లు అక్రమాలు జరగడానికి వీల్లేదు. వినియోగదారులు దోపిడీకి గురికాకూడదు. ప్రజాప్రతినిధులు, వారి బంధువులు, అనుచరులు ఇసుక విషయంలో జోక్యం వద్దు.. ప్రభుత్వానికి అప్రతిష్ఠ రాకూడదు. సామాన్యులకు ఉచిత ఇసుక అందాలి. నిర్మాణదారులకు లబ్ధి చేకూరాలి. కూలీలకు పుష్కలంగా పనులు ఉండాలి.. అని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్తున్నారు. అయితే ఎక్కడా కూడా చంద్రబాబు చెప్పినట్లు జరగడంలేదు. ఉచిత ఇసుకలో అక్రమాలు జరగకుండా ప్రభుత్వం నిబంధనలు విధించింది. అయితే ఆ ప్రకారం డంపింగ్‌ యార్డుల వద్ద ఇసుక లోడింగ్‌ కానీ, రవాణా కానీ జరగడంలేదు. డంపింగ్‌ యార్డుల వద్ద ఇసుక బ్రోకర్లదే రాజ్యమన్నట్లుగా పరిస్థితి ఉంది. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఉచిత ఇసుక పాలసీ అభాసు పాలవుతుంది. కొందరు బ్రోకర్లు నిర్దేశించిన ప్రకారమే లోడింగ్‌, రవాణా జరుగుతుంది. వందలాది లారీల ద్వారా కొందరు జేబులు నింపుకుంటున్నారు.

బుసక ముసుగులో ఇసుక

బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెంలో బుసక ముసుగులో ఇసుకను పెద్దఎత్తున తరలిస్తున్నారు. తాను అధికారపార్టీ నాయకుడ్ని అడ్డుకునే వారెవరంటూ ఓ నేత చెలరేగిపోతున్నాడు. కర్లపాలెం మండలం నల్లమోతు వారిపాలెం గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా పదుల సంఖ్యలో ట్రాక్టర్లలో ఇసుకను తరలించారు. ప్రభుత్వం మారినా వైసీపీ ద్వితీయశ్రేణి నేతల కనుసన్నల్లో వెస్ట్‌ బాపట్ల మహాత్మాజీపురం శివారుల్లో రాత్రిపూట ఇసుక తరలి పోతోంది. దరివాద కొత్తపాలెం వైసీపీ నాయకులు కూడా ఇసుక దందాలో ఇంకా కీలకంగా వ్యహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. బాపట్ల, చీరాల మండలాల సరిహద్దుల్లోని అడవి గ్రామ పంచాయతీ పరిధి ఈపూరుపాలెం స్ట్రెయిట్‌కట్‌ వద్ద బుసక పేరిట తవ్వి లే అవుట్లలో మెరకలకు ఉపయోగిస్తున్నారు. బాపట్ల, కర్లపాలెం, పిట్టలవానిపాలెం మండలాల్లో పొలాలను సైతం తవ్వి తరలిస్తున్నారు. కొన్నిచోట్ల కాల్వకట్టలను సైతం తవ్వేస్తున్నారు. బాపట్లకి చెందిన ఓ వైసీపీ నేత బినామీల ద్వారా ఉచిత ఇసుకను అక్రమంగా తెప్పించుకుని అధిక ధరకు విక్రయిస్తుండగా ఇటీవల అధికారులు దాడులు చేశారు. ఇసుక దందాలో బాపట్లరూరల్‌ పరిధిలోని ఓ వైసీపీ నేతే ఇప్పుడు కూడా కీలకంగా ఉంటున్నాడు. ఇతడికి అధికారపార్టీలోని ద్వితీయశ్రేణి నేతల్లో కొందరు సహకరిస్తున్నారు. కర్లపాలెం మండలం నల్లమోతువారిపాలెం, గణపవరం పరిసరప్రాంతాల్లో యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. నల్లమోతువారిపాలెంలో జాతీయ రహదారి పక్కనే రెండు ఎకరాల భూమిని 8 అడుగుల ఎత్తున ఇసుకతో మెరక చేసి చుట్టూ ప్రహరీ కట్టి రియల్‌ఎస్టేట్‌ వ్యాపారానికి సిద్ధమయ్యారు. హైవేపై రాకపోకలు సాగించే అధికారులకు ఇది కనిపించకపోవడం విచిత్రం. పిట్టలవానిపాలెం మండలం చందోలు, రెడ్డిపాలెం, జీఎన్‌పాలెం, అల్లూరు పరిసరప్రాంతాల్లో ఇసుక అక్రమ విక్రయాలు జరుగుతున్నాయి. ఇసుకతోపాటు నల్లమట్టిని కూడా తరలిస్తున్నారు. చీరాల మండలం దేవినూతల గ్రామం నుంచి ఇసుకను తరలిస్తూ ఓ దళారి యథేచ్ఛగా వ్యాపారం చేస్తున్నాడు. బాపట్ల పరిసరప్రాంతాల్లో స్థలాల మెరక చేయాలంటే కాంట్రాక్ట్‌ తీసుకుని జేబులు నింపుకుంటున్నాడు. గత వైసీపీ పాలనలో ఇష్టానుసారంగా ఇసుక విక్రయాలు జరిపిన ఇతడే ప్రస్తుతం ఉన్న పాలకులను ప్రసన్నం చేసుకుని ఇసుక వ్యాపారం జోరుగా సాగిస్తున్నాడు.

- అచ్చంపేట మండలం కోనూరులో యార్డులో దూర ప్రాంతాల నుంచి వచ్చిన లారీలకు సకాలంలో లోడింగ్‌ జరగడంలేదు. ఆలస్యంగా వచ్చిన లారీలకు బ్రోకర్లు ముందుగా స్లిప్పులు రాయించి లోడు చేయిస్తున్నారు. ఈ విషయంలో రెండు రోజుల క్రితం గొడవలు కూడా చోటుచేసుకున్నాయి. ఓ పార్టీకి చెందిన నాయకులు బెదిరించి ఇసుక తీసుకెళ్తున్నారని తెలిసింది.

- తుళ్లూరు మండలం లింగాయపాలెం స్టాక్‌ పాయింట్‌లో స్థానికత పేరుతో ఓ వైసీపీ నేత అనుచరుల హవా సాగుతుంది. అడ్డదారులలో వచ్చి వాహనాలను ముందు సీరియల్‌లో పెట్టి లోడింగ్‌ స్లిప్‌లు ఇవ్వాలని దౌర్జన్యం చేస్తున్నారు. గతంలో ఇసుక దందాలు చేసిన ఉద్దండ్రాయుపాలెంలో వైసీపీ మాజీ ప్రజాప్రతినిధి అనుచరులు ఇప్పుడు కూడా వాహనాల్లో వచ్చి బెదిరించి టోకెన్లు తీసుకుని ఇసుకను తరలించుకుపోతున్నారు.

- కొల్లిపర ఇసుక స్టాక్‌ పాయింట్‌లో గందరగోళం కొనసాగుతోంది. నాయకులు తమకు ఇష్టం వచ్చిన వారికి టోకెన్లు ఇస్తున్నట్లు ఇసుక కోసం వచ్చిన వాహనదారులు శుక్రవారం తనిఖీలకు వచ్చిన జేసీ భారగ్వతేజ ఎదుటే వాపోయారు. ఉచిత ఇసుక విధానం బాగున్నా స్టాక్‌ పాయింట్లలో నాయకులు, బినామీల కారణంగా సక్రమంగా అమలు కావడంలేదన్నారు.

- అమరావతి మండలం వైకుంఠపురం రీచ్‌లో నేతల బంధువులు, వారి అనుచరులు ఇసుక లోడింగ్‌కు వాహనాలు రాకముందే వేర్వేరు ఆధార్‌ నెంబర్లతో బుక్‌ చేసుకుంటున్నారు. అదనంగా రూ.వెయ్యి ఇచ్చిన వారికి ఇసుకను విక్రయిస్తున్నారు. ఇలా కొనుగోలు చేసి గుంటూరుకు తీసుకెళ్లిన ఇసుకను రూ.16 వేల వరకు విక్రయిస్తున్నారు. 20 టన్నుల ఇసుక గుంటూరుకు 12 వేలకు చేర్చాల్సి ఉండగా వాహన యజమానులు అధికంగా వసూలు చేస్తున్నారు. నిబంధనల ప్రకారం వచ్చిన వాహనాలు సరియైున సమయంలో లోడింగ్‌ కాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వైసీపీ హయాంలో ఇసుక మాఫియాలో పాలుపంచుకున్న వారు ప్రస్తుతం పార్టీ మారి రీచ్‌ల్లో తిష్ఠ వేసి ఇసుక దందా కొనసాగిస్తున్నారు.

Updated Date - Jul 28 , 2024 | 12:45 AM