Share News

ఎన్నికలు సజావుగా సాగేందుకు సమన్వయంగా పనిచేయాలి

ABN , Publish Date - May 12 , 2024 | 01:23 AM

నియోజకవర్గంలో ఎన్నికలు సజావుగా సాగేందుకు సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఎన్నికల అధికారి సబ్‌కలెక్టర్‌ ప్రఖర్‌జైన్‌ చెప్పారు.

ఎన్నికలు సజావుగా సాగేందుకు సమన్వయంగా పనిచేయాలి
సెక్టార్‌ అధికారులతో మాట్లాడుతున్న సబ్‌ కలెక్టర్‌ ప్రఖర్‌జైన్‌

తెనాలి అర్బన్‌, మే 11: నియోజకవర్గంలో ఎన్నికలు సజావుగా సాగేందుకు సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఎన్నికల అధికారి సబ్‌కలెక్టర్‌ ప్రఖర్‌జైన్‌ చెప్పారు. జేఎంజే మహిళా కళాశాలలో శనివారం సెక్టార్‌ అధికారులతో సమావేశం నిర్వహించారు. సెక్టార్‌ అధికారులు, రూట్‌ అధికారులను తమ పోలింగ్‌ స్టేషన్‌లలో అన్ని సదుపాయాలు ఉన్నదీ లేనిది విచారించారు. ఎన్నికల సామగ్రి పంపిణీ, రిసీవ్‌ కేంద్రాల్లో బాధ్యత కేటాయించిన సిబ్బంది తప్పనిసరిగా హాజరు కావాలని లేనిపక్షంలో చర్యలు తీసుకుంటామన్నారు. నియోజకవర్గంలో పోలింగ్‌ స్టేషన్‌ల వారీగా పంపిణీ చేయాల్సిన ఈవీఎంలు, జనరల్‌ మెటీరియల్‌ను సిద్ధం చేయాలన్నారు. రాజకీయ పార్టీలు కూడా ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు సహకారం అందించాలని కోరారు. మున్సిపల్‌ కమిషనర్‌ శేషన్న, తహసీల్దార్‌ శ్రీనివాసరెడ్డి, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - May 12 , 2024 | 01:23 AM