Share News

రేషన్‌ బియ్యం కేజీ.. రూ.22

ABN , Publish Date - May 31 , 2024 | 12:58 AM

పేదల కోసం ప్రభుత్వం బియ్యాన్ని ఉచితంగా సరఫరా చేస్తుండగా దానిని ఎండీయూ ఆపరేటర్లు, మిల్లర్లు, రేషన మాఫియా సొమ్ము చేసుకుంటుంది. కేజీ రేషన్‌ బియ్యానికి రూ.22 ఇస్తే నేరుగా తెచ్చి మిల్లులో డెలివరీ చేస్తామని ఒప్పందాలు చేసుకుని పేదల బియ్యాన్ని పక్కదారి పట్టించి ప్రతీ నెలా రూ.లక్షలు వెనకేసుకొంటున్నారు.

రేషన్‌ బియ్యం కేజీ.. రూ.22

గతంలో ఇదే పాత్ర పోషించిన రేషన్‌ మాఫియా

ఆపరేటర్లంతా వైసీపీ కార్యకర్తలు, రేషన్‌ డీలర్ల బినామీలే

గుంటూరు, మే 30 (ఆంధ్రజ్యోతి): పేదల కోసం ప్రభుత్వం బియ్యాన్ని ఉచితంగా సరఫరా చేస్తుండగా దానిని ఎండీయూ ఆపరేటర్లు, మిల్లర్లు, రేషన మాఫియా సొమ్ము చేసుకుంటుంది. కేజీ రేషన్‌ బియ్యానికి రూ.22 ఇస్తే నేరుగా తెచ్చి మిల్లులో డెలివరీ చేస్తామని ఒప్పందాలు చేసుకుని పేదల బియ్యాన్ని పక్కదారి పట్టించి ప్రతీ నెలా రూ.లక్షలు వెనకేసుకొంటున్నారు. జిల్లాలో మొబైల్‌ డిస్పెన్సింగ్‌ యూనిట్‌(ఎండీయూ) ఆపరేటర్లు రేషన్‌ మాఫియాని మించిపోయారు. ఎవరితో సంబంధం లేకుండా నేరుగా మిల్లర్లతోనే రాయబేరాలు నడుపుతున్నారు. ఎన్నికల కోడ్‌ అమలులోకి రాక ముందు వరకు పౌరసరఫరాల శాఖ అధికారులపై వైసీపీ నేతల ఒత్తిళ్లు ఉండటంతో ఎండీయూలపై ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయారు. కనీసం కోడ్‌ అమలులోకి వచ్చిన తర్వాతనైనా కఠినంగా వ్యవహరిస్తారేమోనని అనుకుంటే తమకేమి పట్టనట్లుగా అధికారులు వ్యవహరిస్తున్నారు. దీంతో ఎండీయూలు బహిరంగంగానే రేషన్‌కార్డుదారులకు బియ్యానికి బదులుగా నగదు చేతిలో పెట్టి బియ్యాన్ని మిల్లర్లకు చేరవేసి భారీగా లబ్ధి పొందుతున్నారు. ఎండీయూల వ్యవస్థ రాక ముందు రేషన్‌డీలర్లలో కొందరు, మాఫియా నియమించిన వ్యక్తులు కేజీకి రూ.8 నుంచి రూ.10 మాత్రమే ఇచ్చేవారు. దాంతో చాలామంది వారికి బియ్యం విక్రయించకుండా ఇళ్లకు తీసుకెళ్లి వాటితో వంటకాలు చేసుకోవడం, సన్నబియ్యంలో కలుపుకుని వండుకోవడం వంటివి చేసేవారు. ఎప్పుడైతే ఎండీయూలు వచ్చారో వారు నేరుగా మిల్లర్లతో ఒప్పందాలు చేసుకున్నారు. మిల్లర్‌ కేజీకి రూ.22 ఇస్తుండటంతో ఎండీయూలు కేజీకి రూ.15 నుంచి రూ.18 వరకు కార్డుదారులకు చెల్లిస్తున్నారు. దీని వలన ఐదుగురున్న కుటుంబ సభ్యులకు 25 కేజీల బియ్యానికి బదులుగా రూ.450 వరకు ఇస్తున్నారు. దాంతో కార్డుదారులు కూడా ఎండీయూలకు బియ్యం ఇచ్చేస్తున్నారు. ఇలా సేకరించిన బియ్యంపై కేజీకి రూ.4 మార్జిన్‌ చూసుకుని మిల్లర్లకు ఇచ్చేస్తున్నారు. రూ.15కే బియ్యాన్ని సేకరించిన ఎండీయూలకు అయితే కేజీకి రూ.7 వరకు లాభం వస్తున్నది. పౌరసరఫరాల చట్టానికి విరుద్ధంగా ప్రజలకు తామేదో మేలు చేస్తున్నట్లుగా కలరింగ్‌ ఇచ్చి డోర్‌ డెలివరీ పేరుతో వైసీపీ ప్రభుత్వం ఎండీయూ ఆపరేటర్ల వ్యవస్థని తీసుకొచ్చింది. అయితే ఏ ఒక్క ఎండీయూ ఆపరేటర్‌ డోర్‌ డెలివరీ చేసిన దాఖలాలు లేవు. తనకు కేటాయించిన ఏరియాలో ఏదో ఒక చోట బండి ఆపి అక్కడికి కార్డుదారులను రమ్మని సరుకులు సరఫరా చేస్తున్నారు. వీళ్లకు బదులు మరికొన్ని రేషన్‌ డిపోల సంఖ్య పెంచితే కార్డుదారులే నేరుగా వెళ్లి సరుకులు తెచ్చుకునే పరిస్థితి ఉంటుంది. తద్వార ప్రభుత్వంపై ఆర్థికభారం చాలా తగ్గుతుంది. ఒక్కో వాహనం రూపంలో నెలకు రూ.21 వేల భారం తగ్గుతుంది. జిల్లాలో 353 మంది ఎండీయూ ఆపరేటర్లున్నారు. దీనిని పరిగణనలోకి తీసుకుంటే నెలకు రూ.75 లక్షల వరకు ఖర్చు తగ్గుతుంది. డోర్‌ డెలివరీ లక్ష్యం నెరవేర్చలేకపోయినా ఈ వ్యవస్థని రద్దు చేయడమే మేలన్న అభిప్రాయం సర్వత్రా

వ్యక్తమౌతున్నది.

Updated Date - May 31 , 2024 | 12:58 AM