Share News

పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు అన్ని చెల్లుబాటయ్యే అవకాశం

ABN , Publish Date - May 31 , 2024 | 01:16 AM

పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు ఎలాగైనా చెల్లకుండా పోవాలని ఆశలు పెట్టుకొన్న వైసీపీకి కేంద్ర ఎన్నికల సంఘం ఝలక్‌ ఇచ్చింది

పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు అన్ని చెల్లుబాటయ్యే అవకాశం

గుంటూరు, మే 30(ఆంధ్రజ్యోతి): పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు ఎలాగైనా చెల్లకుండా పోవాలని ఆశలు పెట్టుకొన్న వైసీపీకి కేంద్ర ఎన్నికల సంఘం ఝలక్‌ ఇచ్చింది. ఉద్యోగులంతా తమకు వ్యతిరేకంగా ఓటువేశారనే నిర్ణయానికి వచ్చిన ఆ పార్టీ జిల్లాలో సాధ్యమైనంత వరకు ఈ ఓట్లు చెల్లుబాటు కాకుండా పోతే తమకు మేలు జరుగుతుందని ఆశలు పెట్టుకొంది. అటెస్టింగ్‌ అధికారి సంతకం, పేరు, హోదా, సీలు విషయంలో గత ఆదివారం చీఫ్‌ ఎలక్టోరల్‌ అధికారి ఎంకే మీనా జారీ చేసిన మెమోపై వైసీపీ పెద్ద రాద్ధాంతమే చేస్తోంది. దేశం అంతా ఒక నిబంధన, ఇక్కడో రూల్‌ అంటూ గత మూడు, నాలుగు రోజుల నుంచి ఆ పార్టీ నేతలు నానా యాగీ చేస్తోన్నారు. ఈ నేపథ్యంలో సీఈవో మెమోని సమర్థిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం గురువారం లేఖ పంపడంతో వైసీపీకి ఏమాత్రం మింగుడు పడటం లేదు.

జిల్లాలో హోం ఓటింగ్‌ ద్వారా 2,292 మంది ఓటు హక్కు వినియోగించుకొన్నారు. అలానే ఉద్యోగులు, అత్యవసర సేవల్లో ఉన్న వారు 20397 మంది పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారానే ఓటు వేశారు. వీరు కాకుండా సర్వీసు ఓటర్లు ఈటీపీబీఎస్‌ ద్వారా ఇప్పటివరకు సుమారు 500 మంది తమ ఓట్లను తపాల శాఖ ద్వారా పంపించారు. ఈ ఓట్లు కౌంటింగ్‌ సందర్భంగా ఎంతో కీలకం కానున్నాయి. అభ్యర్థుల గెలుపు, ఓటమిలను శాసించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇందుకు కారణం ఉద్యోగులంతా ఒక తాటిపైన నిలబడి తమను ముప్పతిప్పలకు గురి చేసిన పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని నిర్ణయించి ఆచరణలో పెట్టారు. ఈ ఓట్లపై ఆశలు వదులుకొన్న వైసీపీ అవి చెల్లుబాటు కాకుండా పోతేనే తమకు మేలు జరుగుతుందన్న అభిప్రాయానికి వచ్చింది.

కౌంటింగ్‌ సందర్భంగా ఏదో ఒక సాంకేతిక అంశాన్ని లేవనెత్తి ఓటు చెల్లుబాటు కాకుండా చూడాలని పక్కాగా వ్యూహం పన్నింది. ఇందుకోసం కౌంటింగ్‌ హాల్స్‌లో గొడవకు దిగాలని కూడా ఏజంట్లకు దిశా నిర్దేశం చేసింది. పోస్టల్‌బ్యాలెట్‌ ఓట్ల డిక్లరేషన్‌ ఫారంలపై అటెస్టింగ్‌ అధికారులు కేవలం సంతకాలు మాత్రమే చేశారు. తమని ఆర్‌వో నియమించినందున సీలు, పేరు, హోదా అవసరం లేదని భావించారు. దీనిని పట్టుకొని పేరు, హోదా, సీలు లేకపోతే ఆ ఓటుని పరిగణనలోకి తీసుకోవద్దని వైసీపీ కొత్తరాగం అందుకొన్నది. ఈ నేపథ్యంలో అటెస్టింగ్‌ అధికారిని ఆర్‌వో నియమించినందున సంతకం ఉంటే చాలు, పేరు, హోదా, సీలు అవసరం లేదని కేంద్ర ఎన్నికల సంఘం తన లేఖలో గురువారం స్పష్టం చేసింది. దీంతో పోలింగ్‌ అయిన ఓట్లలో సింహభాగం చెల్లుబాటు అవుతాయన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమౌతున్నది. ఏ ప్రభుత్వమైనా తమని వేధిస్తే దాని ఫలితం ఎలా ఉంటుందో ఈ ఎన్నికల్లో ప్రతిబింబిస్తుందని ఉద్యోగ సంఘాల నాయకులు చెబుతున్నారు.

Updated Date - May 31 , 2024 | 01:16 AM