Share News

పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపునకు.. అదనపు టేబుళ్లు

ABN , Publish Date - May 20 , 2024 | 12:36 AM

జిల్లాలో ఈ దఫా భారీ సంఖ్యలో పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఉద్యోగులు, అత్యవసర సేవల్లో విధులు నిర్వహించే వారు ఓటుహక్కుని వినియోగించుకున్నారు.

పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపునకు.. అదనపు టేబుళ్లు

గుంటూరు, మే 19 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఈ దఫా భారీ సంఖ్యలో పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఉద్యోగులు, అత్యవసర సేవల్లో విధులు నిర్వహించే వారు ఓటుహక్కుని వినియోగించుకున్నారు. ఈ దృష్ట్యా ఓట్ల లెక్కింపు కోసం ఎక్కువ టేబుళ్లు ఏర్పాటు చేయాలని అధికార యంత్రాంగం నిర్ణయించింది. ఎన్నికల యంత్రాంగంతో పాటు హోం ఓటింగ్‌ విధానంలో పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా పలువురు ఓటు వేశారు. సర్వీసు ఓటర్లు ఎలకా్ట్రనిక్‌ విధానంలో ఓటు వేసి ఆ కవర్లను తపాల శాఖ ద్వారా పంపించారు. 24 వేల పైచిలుకు ఓటర్లు పోస్టల్‌ బ్యాలెట్‌ విధానంలో ఓటు వేశారు. ఈ దృష్ట్యా ఓట్ల లెక్కింపు ఆలస్యం కాకుండా ఉండేందుకు ఎక్కువ సంఖ్యలో కౌంటింగ్‌ టేబుళ్లు ఏర్పాటు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి వేణుగోపాల్‌రెడ్డి ఆర్‌వోలను ఆదేశించారు. గతంలో ఆర్‌వో టేబుల్‌ వద్ద కేవలం ఒకే టేబుల్‌పై పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు లెక్కించేవారు. ఈ దఫా అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్‌ అయిన ఓట్లని బట్టి 4 నుంచి 5 టేబుల్స్‌, లోక్‌సభ స్థానం కౌంటింగ్‌ హాల్‌లో 14 టేబుల్స్‌ ఏర్పాటు చేయనున్నారు. జిల్లాలో ఈ దఫా కొత్తగా అమలులోకి వచ్చిన హోం ఓటింగ్‌ విధానంలో 2,292 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌కు సంబంధించి ఉద్యోగులు, అత్యవసర సేవల్లో ఉన్న వారు 20,397 మంది ఓటుహక్కు వినియోగించుకొన్నారు. సైన్యంలో విధులు నిర్వహిస్తున్న సర్వీసు ఓటర్లు 1781 మంది ఎలకా్ట్రనిక్‌ విధానంలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటుహక్కుని వినియోగించుకొని ఆ కవర్లను పోస్టల్‌ డిపార్టుమెంట్‌ ద్వారా పంపిస్తున్నారు. వాటిని ఎప్పటికప్పుడు స్ట్రాంగ్‌రూంలలోకి చేర్చి ఏజంట్ల సమక్షంలో సీలు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో సుమారుగా 24 వేల పైచిలుకు వరకు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను లెక్కించాల్సి ఉన్నది.

అత్యధికంగా గుంటూరు పశ్చిమలో 4,156 మంది పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు వేసిన దృష్ట్యా ఈ నియోజకవర్గం ఓట్ల లెక్కింపు కేంద్రంలో ఐదు టేబుళ్లు ఏర్పాటు చేయనున్నట్లు ఆర్‌వో రాజ్యలక్ష్మి జిల్లా ఎన్నికల అధికారికి నివేదించారు. తాడికొండ కౌంటింగ్‌ హాల్‌ చిన్నదిగా ఉండటం వల్ల పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు పక్కనే ఉన్న ఆర్‌వో రూంలో చేపడతారు. మిగతా అసెంబ్లీ నియోజకవర్గాల్లో నాలుగు టేబుళ్లని పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాటు చేయనున్నట్లు ఆర్‌వోలు ప్లానింగ్‌ ఇచ్చారు. గుంటూరు లోక్‌సభకు మాత్రం 14 టేబుళ్లని ఏర్పాటు చేస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు. వీటికి సంబంధించి అన్ని వివరాలను సోమవారం రాజకీయ పార్టీల అభ్యర్థులకు వివరించనున్నట్లు తెలిపారు.

Updated Date - May 20 , 2024 | 12:36 AM