Share News

పోలీసుల అత్యుత్సాహం

ABN , Publish Date - Jun 07 , 2024 | 01:25 AM

పోలింగ్‌, తదుపరి జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో కలెక్టర్‌ నిరవధికంగా జిల్లా అంతటా 144 సెక్షన్‌ విధించారు. ఎన్నికల కోడ్‌తో పాటు 144 సెక్షన్‌ గురువారం ముగిసింది.

పోలీసుల అత్యుత్సాహం
నరసరావుపేటలో మూతపడ్డ దుకాణాలు

- ఉపాధి కోల్పోయి పేదలు విలవిల

- 144 సెక్షన్‌ అంటే షాపులు మూసివేయాలా ?

- ఇదెక్కడి పోలీసు రాజ్యాంగం అంటూ బాధితుల ఆగ్రహం

- 10 వరకు 144 సెక్షన్‌ జిల్లాలో కొనసాగింపు

నరసరావుపేట, జూన్‌ 6: పోలింగ్‌, తదుపరి జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో కలెక్టర్‌ నిరవధికంగా జిల్లా అంతటా 144 సెక్షన్‌ విధించారు. ఎన్నికల కోడ్‌తో పాటు 144 సెక్షన్‌ గురువారం ముగిసింది. అయితే ఓట్ల లెక్కింపు సందర్భంగా జిల్లాలో పలుచోట్ల ఘర్షణనలు జరిగాయి. దీంతో ఈ నెల 10 వరకు 144 సెక్షన్‌ పొడింగించినట్టు కలెక్టర్‌ కార్యాలయ వర్గాలు తెలిపాయి. 144 సెక్షన్‌కు బదులు పోలీసు అప్రకటిత కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. దుకాణాలను బలవంతంగా మూయిస్తున్నారు. మరో నాలుగు రోజులు దుకాణాలు మూయించనున్నట్టు పోలీసు అధికారులు తెలిపారు. 144 సెక్షన్‌ అంటే షాపులు మూయించాలని లేదు. అయితే ప్రజల స్వేచ్ఛకు భంగం కలిగించేలా పోలీసులు వ్యవహరిస్తుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల అత్యుత్సాహం వలన ఉపాధికి గండి పడి పేదలు విలవిలాడుతున్నారు. మానవతా కోణంలో కూడా పోలీసులు వ్యవహరించడంలేదన్న వాదన వినిపిస్తోంది. శాంతి భద్రతలను కాపాడాలంటే దుకాణాల మూసివేత ఒక్కటే మార్గం కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 1నుంచి దుకాణాలను మూసివేయిస్తున్నారు. చిరు వ్యాపారులు, చేతి వృత్తులవారు, రోజు వారి కూలీ పనులకు వెళ్లే కార్మికులు ఇలా జిల్లాలో వేలాది మంది ఉపాధి కోల్పోతున్నారు. పూట గడవని పరిస్థితిని వందలాది కుటుంబాలు ఎదర్కొంటున్నాయి. అయినా తన పంతం నెగ్గాలన్న రీతిలో బలవంతంగా దుకాణాలను పోలీసులు మూయివేయిస్తూ పేదల పొట్టకొడుతున్నారన్న అవేదన అయా వర్గాల నుంచి వ్యక్తమవుతోంది. 25 రోజుల వ్యవధిలో దాదాపు 15 రోజులుకు పైగా వ్యాపారాలు లేక వ్యాపారులు ఇక్కట్లు పడుతున్నారు. ఎప్పటికి దుకాణాలు తెరవనిస్తారో తెలియక అల్లాడుతున్నారు. అంక్షల విషయంలో పోలీసులు పునరాలోచన చేయాలని తమకు ఉపాధి కల్పించాలని పేదలు కోరుతున్నారు.

Updated Date - Jun 07 , 2024 | 01:25 AM