Share News

వైసీపీ పాలనలో నీటిపారుదల శాఖపై చిన్నచూపు

ABN , Publish Date - Jun 03 , 2024 | 12:38 AM

ఐదేళ్ల వైసీపీపాలనలో రైతులకు సాగునీటిని అందించే నీటిపారుదల శాఖపై ప్రభుత్వం చిన్నచూపు చూడడంతో అభివృద్ధి పూర్తిస్థాయిలో కుంటుపడింది.

వైసీపీ పాలనలో నీటిపారుదల శాఖపై చిన్నచూపు
అద్దంకి బ్రాంచ్‌ కెనాల్‌కు ఇరువైపులా అల్లుకుపోయిన చెట్లు

శావల్యాపురం, జూన్‌ 2: ఐదేళ్ల వైసీపీపాలనలో రైతులకు సాగునీటిని అందించే నీటిపారుదల శాఖపై ప్రభుత్వం చిన్నచూపు చూడడంతో అభివృద్ధి పూర్తిస్థాయిలో కుంటుపడింది. ఐదేళ్ళపాటు కెనాల్‌లు, మేజరు కాలువలు బాగు చేయకపోవడంతో నీటిప్రవాహానికి అడ్డుగా కాలువ కట్టలపై పిచ్చిచెట్లు అల్లుకుపోవడంతో చివరి పొలాల వరకు సాగునీరు అందే పరిస్థితి లేకుండా పోయింది. వైసీపీప్రభుత్వం ఐదేళ్ళపాటు నీటిపారుదలశాఖకు ఎటువంటి నిధులు కేటాయించకపోవడంతో కనీస వసతులు కల్పించలేని దుస్థితి నెలకొంది. గంటవారిపాలెం సమీపంలోని అద్దంకి బ్రాంచ్‌ కెనాల్‌కు ఇరువైపులా కాలువ కట్టలపై పిచ్చిచెట్టు భారీగా పెరిగి కెనాల్‌లోకి అల్లుకుపోవడంతో నీటిప్రవాహానికి అడ్డుగా మారాయి. దానికితోడు పిచ్చిచెట్లు భారీగా పెరిగిపోవడంతో కాలువకట్టలు బలహీనంగా మారుతున్నాయి. టీడీపీ ప్రభుత్వ హయాంలో అద్దంకి బ్రాంచ్‌ కెనాల్‌లో సిమెంట్‌తో కెనాల్‌కు ఇరువైపులా లైనింగ్‌ వేయడంతో పాటు కెనాల్‌ లోపల సిమెంట్‌తో చదును చేయడంతో నీటిప్రవాహానికి ఆటంకం లేకుండా చివరిభూముల వరకు సాగునీరందించారు. కెనాల్‌ నుంచి గ్రామాలకు వెళ్ళే మేజర్‌ కాలువలు కూడా ఎప్పటికప్పుడు బాగుచేయించి పూడిక తీయించి శుభ్రం చేయించారు. కానీ వైసీపీ ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో కెనాల్‌కు మరమ్మతులు పెరిగిపోయి నీరువిడుదలైన ప్రతీసారి లీకులతో నీరు వృథా అవుతోంది. ఉపాధి హామీ కూలీలతో మేజర్‌ కాలువల్లో గడ్డిని మాత్రం కోయించడం తప్ప పూడిక తీయించకపోవడంతో రోజుల వ్యవధిలోనే గడ్డి మరలా పెరిగిపోంది. త్వరలో ఖరీప్‌ సీజన్‌ ప్రారంభం అవుతున్నందున సాగునీటి కోసం రైతులు అవస్థలు పడే పరిస్థితి నెలకొనియుంది. గంటవారిపాలెంలో 60ఏళ్ళ క్రితం నిర్మించిన ఎన్నెస్పీ భవనం శిఽథిలావస్థకు చేరుకొంది. ఏళ్ళతరబడి భవనానికి కనీస మరమ్మతులు చేయకపోవడంతో ప్రమాదాలకు నిలయంగా మారింది. ఎన్నెస్పీ కార్యాలయంలో కనీస వసతులు లేక సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దానికితోడు సిబ్బంది కొరత ఆ శాఖను వేధిస్తోంది. గంటవారిపాలెం సెక్షన్‌ కింద ఐదుగురు వర్క్‌ ఇన్‌స్పెక్టర్లు, 23మంది లస్కర్‌లు ఉండాల్సి ఉండగా ప్రస్తుతం ఇద్దరు వర్క్‌ఇన్‌పెక్టర్లు, నలుగురు లస్కర్‌లు మాత్రమే ఉన్నారు. కెనాల్‌ పరిధిలోని రైతులు చెల్లించే నీటితీరువా పన్నులను రెవెన్యూ శాఖాధికారులు 2014నుంచి నీటిపారుదల శాఖకు చెల్లించకపోవడంతో సుమారు రూ.కోటి వరకు బకాయిలు నిలిచిపోయాయి. ఎన్నెస్పీ అధికారులు ఎన్నిసార్లు అడిగినా రెవెన్యూ శాఖాధికారులు స్పందించకపోవడంతో మిన్నకుండి పోయారు. కనీసం నీటితీరువా బకాయిలు చెల్లించినా కాలువ కట్టలపై పిచ్చిచెట్లు పీకించి చిన్నపాటి మరమ్మతుతో ఉపయోగపడతాయని ఎన్నెస్పీ అధికారులు చెబుతున్నారు. అద్దంకి కెనాల్‌ పరిధిలో మరమ్మతుల నిమిత్తం 60లక్షలకు ఎస్టిమేషన్‌లు వేసి ప్రభుత్వానికి నివేదిక పంపామని, ప్రభుత్వం నిధులు విడుదలచేస్తే కెనాల్‌కు నీరు విడుదలయ్యేలోపు మరమ్మతులు పూర్తిచేసేందుకు తమవంతు కృషి చేస్తామని ఎన్నెస్పీ అధికారులు చెబుతున్నారు.

Updated Date - Jun 03 , 2024 | 12:39 AM