నాడు నేడు.. నొక్కుడు
ABN , Publish Date - Jun 09 , 2024 | 12:55 AM
విద్యావ్యవస్థలో సంస్కరణలు పేదలకు కూడా కార్పొరేట్ తరహ విద్య అంటూ వైసీపీ ప్రభుత్వం ఊదరగొట్టింది. నాడు నేడు పేరుతో శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల రూపురేకలు మారుస్తామని, విద్యార్థులకు అత్యాధునిక వసతులు, సమగ్ర సౌకర్యాలు కల్పిస్తామని ప్రకటించింది.
అరకొర సాగిన పనులు.. యథేచ్ఛగా బిల్లులు చెల్లింపు
ఉమ్మడి గుంటూరు జిల్లాలో రూ.600 కోట్లకుపైగా వ్యయం
ఐదేళ్లు గడుస్తున్నా పాఠశాలల్లో కొలిక్కిరాని పనులు
మొదటి దశలో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్లు మూలకు
పనులపై విచారణకు ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్
గుంటూరు(విద్య), జూన 8: విద్యావ్యవస్థలో సంస్కరణలు పేదలకు కూడా కార్పొరేట్ తరహ విద్య అంటూ వైసీపీ ప్రభుత్వం ఊదరగొట్టింది. నాడు నేడు పేరుతో శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల రూపురేకలు మారుస్తామని, విద్యార్థులకు అత్యాధునిక వసతులు, సమగ్ర సౌకర్యాలు కల్పిస్తామని ప్రకటించింది. నాడు- నేడు పేరుతో పెద్దఎత్తున పనులు చేపట్టింది. ఆయా పనులను పాఠశాలల వారీగా గుర్తించి తల్లిదండ్రుల కమిటీలతో చేయించాలే వైసీపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే తల్లిదండ్రుల కమిటీల ముసుగులో వైసీపీ నాయకులు చాలా దగ్గర్ల ఆయా పనులను దక్కించుకున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో నాడు నేడు తొలి దశలో 1149 పాఠశాలలను ఎంపిక చేసి దాదాపు రూ.325 కోట్లకుపైగా ఖర్చు చేసినట్లు సమాచారం. రెండో దశలో 1344 పాఠశాలలను ఎంపిక చేసి మరో 340 కోట్లు వెచ్చించి ఆధునికీకరణ పనులు చేపట్టారు. అయితే రంగులేసి.. తూతూమంత్రపు పనులతో మమ అనిపించి రూ.లక్షల్లో జేబుల్లో వేసుకున్నారన్న విమర్శలు వచ్చాయి. అయితే ప్రభుత్వం వారిదే కావడం.. ఇష్టారీతిన పనులు చేసినా అటు ఉపాధ్యాయులు, ఇటు అధికారులు ప్రశ్నించలేకపోయారు. నాణ్యతా లోపంతో ఆయా పనులు జరిగినట్లు ఫిర్యాదులు వచ్చినా ఇంతకాలం ఎవరూ నోరుమెదపలేదు. ఇక ఉమ్మడి గుంటూరు జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో మౌళిక వసతుల కల్పనే లక్ష్యంగా సాగిన పనులు ఐదేళ్లు కావస్తున్నా కొలిక్కిరాలేదు. శిఽథిలమైన పాఠశాలను అభివృద్థి చేసి సుందరంగా తీర్చిదిద్దుతున్నామనే ముసుగుతో తల్లిదండ్రుల కమిటీల మాటును చేసిన పనులతో వైసీపీ నాయకులు పెద్దఎత్తున దోచుకున్నారనే ఆరోపణలు మొదటి నుంచి ఉన్నాయి. తాగునీరు, టాయిలెట్, ఫర్నీచర్, కాంపౌండ్ వాల్, రంగులు, మరమ్మతులు, ఫ్యాన్లు, లైట్లు, వంటగది, ఇంగ్లీషు మీడియం ల్యాబ్‌ల ఏర్పాటు పేరుతో పెద్ద మొత్తంలో కమీషన్లు దండుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. గుంటూరు సహా పల్నాడు, బాపట్ల జిల్లా కేంద్రాల నుంచి మారుమూల గ్రామాల్లోని పాఠశాలల వరకు సక్రమంగా పనులు చేయలేదు. కార్పొరేట్ కట్టడాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్ది విద్యా వికాసానికి బాటలు వేస్తున్నామని నమ్మించిన వారు పనులను మాత్రం పూర్తిచేయలేదు.
నిర్మాణ దశలోనే పనులు
ఉమ్మడి గుంటూరు జిల్లాలో నాడు నేడు పనులు 2021లో ప్రారంభించారు. దాదాపు ఐదేళ్లు పూర్తి కావస్తున్నా పనులు ఇంకా పూర్తికాలేదు. గుంటూరులోనే అనేక పాఠశాలల్లో నిర్మాణ పనులు వెక్కిరిస్తున్నాయి. ప్రతి దగ్గర వైసీపీ వారే ఆయా పనులు చేపట్టారు. అనేక చోట్లు పనుల్లో నాణ్యత లోపం కనిస్తున్నా బిల్లులు చెల్లింపు మాత్రం యఽథేచ్చగా సాగింది. మొదటి విడతలో పాఠశాలల్లో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంటు ఇప్పడు దాదాపు మూత పడ్డాయి. కాంట్రాక్టు ఏజన్సీ ఐదేళ్లపాటు మరమ్మతులు చేయాల్సి ఉన్నా ఆ దిశగా చర్యలు తీసుకున్న దాఖాలలు లేవు. రెండో దశలో కూడా సంవత్సరం క్రితం అనేక పాఠశాలలకు వాటర్ ప్లాంట్లు వచ్చాయి. వీటిని ఇంత వరకు వినియోగం లోకి తీసుకురాలేదు. పనుల పర్యవేక్షణను విద్యాశాఖ అధికారులు అసలు పట్టించుకోలేదు. పనుల పురోగతిని యాప్స్‌లో నమోదు చేయమని ఉపాధ్యాయలకు ఆదేశాలు ఇవ్వడం తప్ప క్షేత్రస్థాయిలో నాణ్యత, పనుల వేగం గురించి ప్రశ్నించిన దాఖలాలు లేవు. దీంతో నాడు నేడు పనులు ఇష్టారాజ్యంగా సాగాయి. కొంతమంది అధికారులు ఇందుకు ఇతోధికంగా సహకారం అందించి బిల్లుల మంజూరులో భారీ స్థాయిలో కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు దండుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పల్నాడు జిల్లాలో నాడు నేడు పనులు చేసే కాంట్రాక్టర్లను బెదిరించి నరసరావుపేటలో విద్యాశాఖ కార్యాలయం నిర్మాణం కోసం అప్పటి ఇనచార్జి డీఈవో మేకతోటి వెంకటప్పయ్య నిధులు వసూలు చేసిన విషయం బహిర్గతమైన విషయం తెలిసిందే. ఇలా నాడు నేడు పేరుతో జరిగిన అక్రమాలపై విచారణ జరపాలని అటు విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయ సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.