Share News

తాడిగిరిపాడు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ నిర్మాణం పనులు పూర్తి చేస్తా

ABN , Publish Date - Jun 17 , 2024 | 12:41 AM

తాడిగిరిపాడు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ నిర్మాణం పనులను పూర్తి చేస్తామని వేమూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఆ ప్రాంత రైతులకు హామీ ఇచ్చారు.

తాడిగిరిపాడు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ నిర్మాణం పనులు పూర్తి చేస్తా
ఆనందబాబుకు అభినందనలు తెలిపి రైతాంగ సమస్యలు వివరిస్తున్న టీడీపీ నాయకులు

వేమూరు, జూన్‌ 16 : తాడిగిరిపాడు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ నిర్మాణం పనులను పూర్తి చేస్తామని వేమూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఆ ప్రాంత రైతులకు హామీ ఇచ్చారు. మండలంలోని అబ్బనగూడవల్లి గ్రామ మాజీ సర్పంచ్‌ అల్లంశెట్టి భాగ్యలక్ష్మి, నియోజకవర్గ తెలుగు యువత కార్యదర్శి శోభిల రాజేష్‌ ఆధ్వర్యంలో ఆరు గ్రామాలకు చెందిన రైతులు ఆదివారం గుంటూరులోని క్యాంపు కార్యాలయంలో ఆనందబాబును కలుసుకున్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన ఆయనను సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంలో 6 గ్రామాల రైతుల భూములకు సాగునీరు అందించేందుకు ప్రారంభించిన లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పథకం నిర్మాణం పనులను జగన్‌ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా పని చేసిన నాగార్జున పూర్తి చేయకుండా వదిలేశారని దానిని ప్రారంభించిన తమరే నిర్మాణాన్ని కూడా పూర్తి చేయించాలని కోరారు. అలాగే పట్టిసీమ నీటిని కూడా డెల్టా ప్రాంతానికి అందించి సహకరించాలని, అందుకు చంద్రబాబునాయుడుతో చర్చించాలని కోరారు. స్పందించిన ఆనందబాబు లిప్ట్‌ ఇరిగేషన్‌ పనులను పూర్తి చేసి సహకరిస్తామని హామీ ఇచ్చారు. పట్టిసీమ నీటి విషయంపై కూడా ముఖ్యమంత్రితో చర్చిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో కె.శ్రీనివాసరావు, టి.వీరమోహన్‌రావు, కోటేశ్వరరావు, బి.శ్రీనివాసరావు, పోతురాజు, సాయికృష్ణ, లావు శంకరరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 17 , 2024 | 12:42 AM