అమాత్యులు.. అయ్యేదెవరో?
ABN , Publish Date - Jun 07 , 2024 | 01:08 AM
గతంలో ఎన్నడూ లేనట్లుగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. 17 నియోజకవర్గాల్లోనూ కూటమి అభ్యర్థులు గెలుపొందారు. టీడీపీ సీనియర్లు అందరూ విజేతలుగా నిలిచారు. దీంతో కూటమి ప్రభుత్వంలో మంత్రి పదవులపై అందరూ ఆశపడుతున్నారు.

జనసేన కోటాలో మనోహర్‌కి ఛాన్స దక్కే అవకాశం
ఆశావహుల్లో ఆరోసారి గెలుపొందిన కన్నా, నరేంద్ర
ఎస్సీ కోటాలో ఆ ముగ్గురిలో ఎవరి ప్రయత్నాలు ఫలించేనో
గుంటూరు, జూన 6 (ఆంధ్రజ్యోతి): గతంలో ఎన్నడూ లేనట్లుగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. 17 నియోజకవర్గాల్లోనూ కూటమి అభ్యర్థులు గెలుపొందారు. టీడీపీ సీనియర్లు అందరూ విజేతలుగా నిలిచారు. దీంతో కూటమి ప్రభుత్వంలో మంత్రి పదవులపై అందరూ ఆశపడుతున్నారు. రాఽజధాని ప్రాంతమైన ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఈ పర్యాయం చాలామంది మంత్రి పదవులు ఆశిస్తూ ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించారు. 2014లో టీడీపీ గెలుపొందిన సమయంలో ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి ప్రత్తిపాటి పుల్లారావు(చిలకలూరిపేట) మంత్రి పదవిని చేపట్టి ఐదేళ్లు కొనసాగారు. అయితే ఎస్సీ కోటాలో తొలుత మంత్రి పదవి దక్కించుకున్న రావెల కిశోర్‌బాబు(ప్రత్తిపాడు) రెండున్నరేళ్లే ఉన్నారు. ఆ తర్వాత ఆయన్ను తప్పించగా నక్కా ఆనందబాబు(వేమూరు)ను అమాత్య పదవి వరించింది. రాబోయే ప్రభుత్వంలో ప్రత్తిపాటితో పాటు ఆనందబాబులు ఇద్దరూ రేసులో ఉన్నారు. ఇక పొన్నూరు నుంచి ఆరో సారి గెలిచిన ధూళిపాళ్ల నరేంద్రకుమార్ కూడా మంత్రి పదవి రేసులో ఉన్నారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో మంత్రి అంబటి రాంబాబును ఓడించిన సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ కూడా మంత్రి పదవి రేసులో ఉన్నారు. ఆయనకు గతంలో వివిధ శాఖల మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. అలాగే రేపల్లె నుంచి మూడో సారి విజయం సాధించిన అనగాని సత్యప్రసాద్ కూడా బీసీ కోటాలో మంత్రి పదవిని ఆశిస్తున్నారు. కాగా ఈ పర్యాయం తాడికొండ, ప్రత్తిపాడు ఎస్సీ నియోజకవర్గాల నుంచి గెలుపొందిన తెనాలి శ్రావణ్‌కుమార్, బూర్ల రామాంజనేయులు కూడా మంత్రి పదవులను ఆశిస్తున్నారు. శ్రావణ్‌కుమార్ రాజధాని ప్రాంత ఎమ్మెల్యే కావడమే కాకుండా రెండో సారి గెలిచిన సీనియార్టీ కూడా తనకుందనే భావనలో ఉన్నారు. ఇక ప్రత్తిపాడు నుంచి గెలుపొందిన రామాంజనేయులు సీనియర్ ఐఏఎస్ అధికారిగా తనకున్న అనుభవం మూలంగా గెలిచింది మొదటి సారే అయినా తన పేరు కూడా పరిశీలనలో ఉంటుందనే భావనలో ఉన్నారు. ఇక గుంటూరులో తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల నుంచి గెలుపొందిన ఇద్దరు ఎమ్మెల్యేలు తొలి సారే అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నప్పటికీ వారు కూడా మంత్రి పదవులు ఆశిస్తున్నారు. మంత్రి విడదల రజినీని ఓడించి 51 వేలకు పైగా మెజార్టీతో ప్రతిష్టాత్మకమైన విజయం సాధించడం మూలంగా తన పేరు కూడా పరిశీలనలో ఉంటుందని గళ్ళా మాధవి ఆశలో ఉన్నారు. తూర్పు నుంచి గెలిచిన ఎండీ నసీర్ అహ్మద్ రెండు దశాబ్ధాల తర్వాత నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరవేసిన తన పేరును సామాజిక అంశం కోణంలో పరిశీలించే అవకాశం ఉందనే ఆశలో ఉన్నారు. ఇక పల్నాడు జిల్లాలో మంత్రి పదవుల రేసులో మరికొందరు సీనియర్లు ఉన్నారు. నిన్న మొన్నటి దాకా పల్నాడు జిల్లా అధ్యక్షుడుగా పనిచేసి మూడో సారి అసెంబ్లీలోకి అడుగు పెడుతున్న వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు కూడా అమాత్య పదవి తనను వరిస్తుందనే ఆశలో ఉన్నారు. అలాగే గురజాల నియోజకవర్గం నుంచి నాలుగో సారి విజయఢంకా మోగించిన యరపతినేని శ్రీనివాసరావు తాను తప్పనిసరిగా సీఎం చంద్రబాబు కేబినెట్‌లో ఉంటాననే ధీమాతో ఉన్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరాచకాలకు అడ్డుకట్ట వేసి ప్రతిష్టాత్మకమైన విజయం సాధించిన మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి కూడా తాను గెలిచింది మొదటి సారే అయినప్పటికీ అక్కడి పరిస్థితుల దృష్ట్యా మంత్రి పదవిని చేపట్టాల్సిన ఆవశ్యకత ఉందనే భావనలో ఉన్నారు. పైగా పల్నాడు జిల్లాలో బ్రహ్మారెడ్డే అత్యధిక మెజార్టీతో విజయం సాధించారు.