Share News

వెలుగుచూస్తోన్న అరాచకాలు.. అరెస్టులు

ABN , Publish Date - May 24 , 2024 | 12:25 AM

పోలింగ్‌ రోజు వైసీపీ అరాచకాలు తాజాగా వెలుగుచూస్తోన్నాయి. రెండు రోజుల క్రితం పోలింగ్‌ బూతలో ఈవీఎంను పగలకొట్టిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి దుశ్చర్య వెలుగు చూసిన విషయం తెలిసిందే.

వెలుగుచూస్తోన్న అరాచకాలు.. అరెస్టులు
రాయవరంలో పోలింగ్‌ బూత టెంట్లు పీకేసీ కర్రలతో దాడికి తెగబడుతున్న వైసీపీ మూకలు

నరసరావుపేటలో పోలీసుల సమక్షంలోనే దాడులు

మాచర్లలో దాడులు.. హత్యాయత్నాలు

నరసరావుపేట, మాచర్ల టౌన, మాచర్ల రూరల్‌, రెంటచింతల, కారంపూడి, దాచేపల్లి, పిడుగురాళ్ల, నరసరావుపేట లీగల్‌, సత్తెనపల్లి, మే 23: పోలింగ్‌ రోజు వైసీపీ అరాచకాలు తాజాగా వెలుగుచూస్తోన్నాయి. రెండు రోజుల క్రితం పోలింగ్‌ బూతలో ఈవీఎంను పగలకొట్టిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి దుశ్చర్య వెలుగు చూసిన విషయం తెలిసిందే. తాజాగా నరసరావుపేటలో పోలింగ్‌ రోజు వైసీపీ మూకల హింసాకాండ వెలుగులోకి వచ్చింది. ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి ఆధ్వర్యంలో పోలీసుల సమక్షంలోనే టీడీపీ కార్యకర్తలు, నేతలపై వైసీపీ రౌడీలు దాడి చేసిన వీడియో దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. పట్టణంలోని పల్నాడు రోడ్డు మున్సిపల్‌ హైస్కూల్‌ పోలింగ్‌ బూత వద్ద వైసీపీ మూకలు కర్రలు, రాడ్లతో టీడీపీ శ్రేణులపై దాడులకు తెగబడ్డాయి. టీడీపీ నేతలకు చెందిన కార్లను ధ్వంసం చేశారు. టీడీపీ అభ్యర్థిపై కూడా దాడికి యత్నించారు. ఆయన ఉన్న కారును కూడా ధ్వంసం చేశారు. దాడిలో టీడీపీ నేతలు గాయపడ్డారు. ఈ దాడుల వీడియో దృశ్యాలను సిట్‌ బృందానికి కూడా టీడీపీ నేతలు ఇచ్చారు.

వెలుగులోకి పిన్నెల్లి అకృత్యాలు..

ఎమ్మెల్యే పిన్నెల్లి అరాచకాలు కూడా ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. పాలువాయిగేటులోని 202 పోలింగ్‌ బూతలోకి రామకృష్ణారెడ్డి దూరి ఈవీఎం ధ్వంసం చేసి అడ్డుకునేందుకు ప్రయత్నించిన టీడీపీ ఏజెంట్‌ శేషగిరిరావు తల పగలకొట్టి, ఓ మహిళను హెచ్చరించిన సంఘటన ఇటీవల వెలుగుచూసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పిన్నెల్లి అకృత్యాలు మరికొన్ని ఆయన సొంత మండలమైన వెల్దుర్తి పరిధిలోని కొత్తపుల్లారెడ్డిగూడెంలో జరిగిన సంఘటనలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. పిన్నెల్లి ఆదేశాలతో కొత్తపుల్లారెడ్డిగూడెం 118, 119, 120 పోలింగ్‌ బూతలలో, రాయవరం పోలింగ్‌ బూత్‌లపై వైసీపీ మూకలు దాడులు చేశారు. పోలింగ్‌ కేంద్రంలో ఉన్న టీడీపీ ఏజెంట్లపై హత్యాయత్నం చేశారు. ఆ బూతల్లో టీడీపీ ఏజెంట్లుగా ఉన్న కేతావత రేఖ్యానాయక్‌, హనుమంతునాయక్‌, బాణావత చిన మంత్రియానాయక్‌, మల్లునాయక్‌, మూఢావత అంజినాయక్‌, తులస్యానాయక్‌, సంతోష్‌నాయక్‌లపై అక్కడ వేసిన టెంట్లు పడేసి ఆ కర్రలతోనే దాడికి పాల్పడ్డారు. ఈ లోగా ఎమ్మెల్యే పీఆర్కే తన రౌడీ గ్యాంగ్‌తో అక్కడకు చేరుకుని టీడీపీ ఏజెంట్లను బలవంతంగా కార్లో ఎక్కిస్తుండగా రేఖ్యానాయక్‌ పారిపోగా మాజీ సర్పంచ కేతావత పాండు, జడ్పీటీసీ రూప్లీబాయి భర్త బాలు, వైసీపీ రౌడీ మూకలు వెంటపడి దాడి చేసి గాయపరిచారు. రేఖ్యానాయక్‌ మినహా మిగిలిన టీడీపీ ఏజెంట్లను పీఆర్కే తన వాహనంలో మాచర్ల పట్టణానికి తీసుకొచ్చి వదిలివేశారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రేఖ్యానాయక్‌ను బంఽధువులు మాచర్ల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ ఘటనపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. మాపైనే ఫిర్యాదు చేస్తారా.. అంటూ వైసీపీ గూండాలు టీడీపీ వర్గీయులపై బరిసెలతో మూకుమ్మడి దాడులు చేశారు. ఈ వీడియోలను టీడీపీ వర్గీయులు బయటపెట్టారు. పోలింగ్‌ రోజున మాచర్ల మండలం రాయవరం గ్రామంలో 51వ పోలింగ్‌ బూతలో టీడీపీ ఏజెంట్లు గాలి చంద్రశేఖర్‌, జాజుల నాగేశ్వరరావు, గాజుల కొండలు ఏజెంట్లుగా కూర్చున్నారు. వైసీపీ రౌడీ

మూకలు దొంతగాని జగపతి, ఎంపీటీసీ మట్టా శైలజ భర్త వెంకటేశ్వర్లు, అమరేష్‌ శ్రీనివాస్‌లు పోలింగ్‌ బూతుల్లో దూరి తలుపులు వేసి మరీ బెదిరించి, దౌర్జన్యానికి దిగారు. స్పందించిన పోలీసులపై కూడా ఆ ముగ్గురు దుర్భాషలకు దిగి పోలింగ్‌ ప్రక్రియకు ఆటంకం కలిగించారు. పోలీసులు బలవంతంగా వైసీపీ మూకలను అక్కడి నుంచి పంపివేశారు.

84 మందికి రిమాండ్‌

ఎన్నికల సందర్భంగా జిల్లాలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలకు సంబంధించి గురువారం 84 మందికి రిమాండ్‌ విధిస్తూ స్థానిక ప్రధాన జూనియర్‌ సివిల్‌ కోర్టు న్యాయాధికారి ఆర్‌ ఆశీర్వాదంపాల్‌ ఉత్తర్వులు జారీ చేశారు. దాచేపల్లి పోలీసుస్టేషన పరిధిలో ఇరుపక్షాలకు చెందిన 33 మంది, పిడుగురాళ్లలో 50 మంది, నరసరావుపేట మొదటి పట్టణ పోలీసు స్టేషన పరిధిలో ఒక్కరిని అరెస్టు చేసి గురువారం గురజాల జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు, పిడుగురాళ్ళ జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టుల ఇనచార్జ్‌ న్యాయమూర్తి ఆశీర్వాదం పాల్‌ ఎదుట హాజరు పరచగా రిమాండ్‌ విధించారు. కోర్టు ఆవరణలో మొదటి పట్టణ సీఐ సీహెచ కృష్ణారెడ్డి, పిడుగురాళ్ల సీఐ ఆంజనేయులు, ఎస్‌ఐలు సంధ్యారాణి, పఠానరబ్బానీ ఖాన ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఐదు వందలమంది బైండోవర్‌

సత్తెనపల్లి రూరల్‌ సర్కిల్‌ పరిధిలో ఐదు వందల మందిపై బైండోవర్‌ కేసులు నమోదు చేసినట్టు రూరల్‌ సీఐ రాంబాబు గురువారం తెలిపారు. రాజుపాలెం, నకరికల్లు, ముప్పాళ్ళ, సత్తెనపల్లి రూరల్‌ పరిధిలో కేసులు నమోదు చేశామన్నారు. రాజుపాలెంలో ఐదుగురికి నోటీసులు జారీ చేశామన్నారు. ముప్పాళ్ళలో 11 మందికి బాండ్స్‌ ఎమౌంట్‌ చెల్లించాలని తహసీల్దార్‌ నోటీసులు జారీ చేశారన్నారు. వారి పై అవసరమైతే రౌడీ షీట్లు ఓపెన చేస్తామన్నారు. మరి కొందరిపై పీడీ యాక్ట్‌ కింద కేసు నమోదుకు ప్రతిపాదనలు పంపిస్తున్నట్లు తెలిపారు.

కొట్టించుకున్న మాపైనే కేసులా?

పోలింగ్‌ రోజు తంగెడ గ్రామంలో జరిగిన పెట్రో బాంబుల దాడి కేసులో 32 మందిపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరిచినట్లు ఎస్‌ఐ శివనాగరాజు తెలిపారు. గ్రామంలోని మెయిన స్కూల్‌ వద్ద పెట్రో బాంబులు, రాళ్లు, కర్రలతో జరిగిన దాడికి సంబంధించి వైసీపీకి చెందిన 22 మందిపై టీడీపీకి చెందిన 11 మందిపై కేసులు నమోదు చేశామన్నారు. వైసీపీ మూకల దాడిలో టీడీపీకి చెందిన ఇద్దరు దివ్యాంగుల దుకాణాలు కాలిపోయాయని, పలువురు గాయపడ్డారని అయినా తమను అరెస్టు చేయడంపై టీడీపీ నాయకులు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దెబ్బలు తిన్నది మేమే.. బాంబులు వేయించుకుంది మేమే.. కేసులు కూడా మాపై పెట్టడం ఎంతవరకు సబబు అంటూ మండిపడ్డారు.

Updated Date - May 24 , 2024 | 12:25 AM