Share News

మంత్రి లోకేశ్‌ ప్రత్యేక చొరవతో దివ్యాంగ విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా

ABN , Publish Date - Jul 08 , 2024 | 12:46 AM

వాట్సాప్‌ ద్వారా అందిన సమాచారంతో తక్షణమే స్పందించిన రాష్ట్ర విద్య, ఐటీ శాఖా మంత్రి నారా లోకేశ్‌ 25మంది దివ్యాంగ విద్యార్థుల భవి ష్యత్తును కాపాడారు.

మంత్రి లోకేశ్‌ ప్రత్యేక చొరవతో దివ్యాంగ విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా

మంగళగిరి సిటీ, జూలై 7: వాట్సాప్‌ ద్వారా అందిన సమాచారంతో తక్షణమే స్పందించిన రాష్ట్ర విద్య, ఐటీ శాఖా మంత్రి నారా లోకేశ్‌ 25మంది దివ్యాంగ విద్యార్థుల భవి ష్యత్తును కాపాడారు. మంత్రి లోకేశ్‌ చొరవతో ఆ విద్యార్థులు దేశ వ్యాపితంగా పేరుగాంచిన ఐఐటీ, ఎన్‌ఐటీ విద్యా సంస్థల్లో ప్రవేశం పొందగలిగారు. విజయవాడకు చెందిన దివ్యాంగ విద్యార్థి మారుతీ పృథ్వీ సత్యదేవ్‌ ఈ ఏడాది నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్‌ పరీక్షల్లో దివ్యాంగుల కోటాలో 170వ ర్యాంకు సాధించాడు. ఈ ర్యాంకు ప్రకారం సత్యదేవ్‌కు చెన్నయ్‌ ఐఐటీలో సీటు రావలసి వుంది. అయితే దివ్యాంగ విద్యార్థులకు ఇచ్చే మార్కుల మెమో విషయంలో రాష్ట్ర ఇంటర్‌ అధికారులు ఎప్పటినుంచో చేస్తున్న ఓ పొరపాటు దివ్యాంగ విద్యార్థులను ఇబ్బందుల్లోకి నెట్టింది. సత్యదేవ్‌కు తాను సాధించిన ర్యాంకు ప్రకారం జోసా కౌన్సెలింగ్‌ రౌండ్‌-1లో ఐఐటీ మద్రాసులో సీటు కేటాయించారు. డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ప్రక్రియలో భాగంగా ఇంటర్మీడియట్‌ మెమో సర్టిఫికెట్‌ను అప్‌లోడ్‌ చేయాలని కోరారు. ఏపీ ఇంటర్‌ బోర్డు నిబంధనల ప్రకారం దివ్యాంగులకు లాంగ్వేజ్‌ సబ్జెక్టుల్లో రెండింటిలో ఒకదానికి మినహాయింపు వుంటుంది. దీని ప్రకారం సత్యదేవ్‌ సెకండ్‌ లాంగ్వేజ్‌ పరీక్ష రాయలేదు. ఇంటర్‌ పరీక్షల్లో ఏ-గ్రేడ్‌ ఉత్తీర్ణత సాధించాడు. మినహాయింపు పొందిన లాంగ్వేజ్‌ సబ్జెక్టుతో కలిపి మార్కుల మెమోలో 5 సబ్జెక్టుల మార్కులు వుంటాయి. మినహాయింపు పొందిన సబ్జెక్టుకు సంబంధించి సర్టిఫికెట్‌లో ఇంటర్‌బోర్డు వారు ఎప్పటినుంచో ‘ఈ’ (ఎగ్జమ్షన్‌) అని మాత్రమే పేర్కొంటున్నారు. కానీ, ఐఐటీ మద్రాస్‌ డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ విభాగం వారు సత్యదేవ్‌ మెమోలో కేవలం నాలుగు సబ్జెక్టులు మాత్రమే వున్నాయని, గణితం-ఏ, బీలను ఒకే సబ్జెక్టుగా పరిగణిస్తున్నామని పేర్కొంటూ ఇంటర్మీడియట్‌ మెమోను తిరస్కరిస్తున్నామని సమాధానమిచ్చారు. దీనిపై సత్యదేవ్‌ ఐఐటీ మద్రాసు వారిని సంప్రదించగా, సెకెంట్‌ లాంగ్వేజ్‌ సబ్జెక్టుకు సంబంధించి సర్టిఫికెట్‌లో ‘ఈ’ స్థానంలో నిర్ధిష్ట సంఖ్యా విలువను కలిగివుంటేనే కళాశాలలో ప్రవేశానికి అవకాశం కల్పిస్తామని చెప్పారు. ఇంటర్‌ బోర్డు సర్టిఫికెట్‌ అప్‌లోడ్‌ విషయంలో ఎదురైన సమస్యను సత్యదేవ్‌ గత నెల 22వ తేదీన వాట్సాప్‌ ద్వారా మంత్రి నారా లోకేశ్‌కు తెలియజేశారు. వెంటనే స్పందించిన మంత్రి లోకేశ్‌ సత్యదేవ్‌, అతని తండ్రి జయరామ్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. దివ్యాంగ విద్యార్థులకు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇంటర్‌ బోర్డు అధికారులు వెంటనే స్పందించి మార్కుల మెమోలో ‘ఈ’ స్థానంలో కనిష్టంగా 35 మార్కులుగా పేర్కొంటూ మార్కుల మెమో జారీచేశారు. దీనికి సంబంధించి ఆగమేఘాలపై జీవోను కూడా విడుదల చేశారు. దీంతో పృథ్వీ సత్యదేవ్‌కు ఐఐటీ మద్రాసులో సీటు లభించింది. ఈ జీవోతో రాష్ట్రంలోని మొత్తం 25మంది దివ్యాంగ విద్యార్థులకు జాతీయస్థాయిలో పేరొందిన ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ ఐటీ విద్యాసంస్థల్లో సీట్లు లభించాయి. తమ భవిష్యత్తును కాపాడిన మంత్రి లోకేశ్‌కు సత్యదేవ్‌తోపాటు దివ్యాంగ విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం ఉండవల్లిలోని నివాసంలో మంత్రి లోకేశ్‌ దివ్యాంగ విద్యార్థులను కలిసి అభినందించనున్నారు.

సీట్లు పొందిన విద్యార్థులు వీరే..

మంత్రి నారా లోకేశ్‌ ప్రత్యేక చొరవతో జీవో విడుదల కావడంతో రాష్ట్రంలోని మొత్తం 25 మంది దివ్యాంగ విద్యార్థులకు జాతీయ స్థాయిలో పేరొందిన ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ ఐటీ విద్యాసంస్థల్లో సీట్లు సాధించారు. విజయవాడకు చెందిన పృథ్వీ సత్యదేవ్‌ ఐఐటీ మద్రాస్‌, నెల్లూరుకు చెందిన ఎన్‌.స్నేహిత ఐఐటీ కాన్పూర్‌, తిరుపతికి చెందిన ఎ.తేజిత చౌదరి ఐఐఐటీ, గౌహతి, నెల్లూరుకు చెందిన పీ.నిష్మిత ఎన్‌ఐటీ నాగపూర్‌, విజయవాడకు చెందిన సి.రఘునాథ్‌రెడ్డి ఐఐటీ కాలికట్‌, రాజమహేంద్రవరానికి చెందిన ఎం.మోహన్‌ నాగమణికంఠ ఎన్‌ఐటీ జలంధర్‌, పామర్రుకు చెందిన బి.విజయరాజు ఐఐటీ తిరుపతి, కర్నూలుకు చెందిన కే.ప్రశాంత్‌ ఎన్‌ఐటీ సిల్చార్‌, విజయవాడకు చెందిన జీ.కృష్ణసాయి సంతోష్‌ ఎన్‌ఐటీ సూరత్కల్‌, రాజమహేంద్రవరానికి చెందిన జీ.వంశీకృష్ణ ఎన్‌ఐటీ వరంగల్‌, కర్నూలుకు చెందిన వి.వేదచరణ్‌రెడ్డి ఐఐటీ మద్రాసు, నెల్లూరుకు చెందిన నాయుడు రక్షిత్‌ ఎన్‌ఐటీ నాగాలాండ్‌, పెనమలూరుకు చెందిన ఈ.మహిధర్‌రెడ్డి ఐఐటీ ఇండోర్‌, అనంతపురంకు చెందిన డి.మోక్షశ్రీ ఎన్‌ఐటీ నాగాలాండ్‌, రాజమహేంద్రవరంకు చెందిన పీ.దినేష్‌ ఎన్‌ఐటీ కురుక్షేత్ర, బి.కోటకు చెందిన జే.మనోజ్‌కుమార్‌ ఐఐటీ గోవా, నందిగామకు చెందిన సీహెచ్‌ శివరామ్‌ ఐఐటీ అగర్తల, విజయవాడకు చెందిన బి.అభిజిత్‌ ఎన్‌ఐటీ అరుణాచల్‌ప్రదేశ్‌, కాకినాడకు చెందిన జీ.రాణి ఐఐటీ ఖరగ్‌పూర్‌, గుంటూరుకు చెందిన కే.గోకుల్‌సాయి ఎన్‌ఐటీ తాడేపల్లి గూడెం, విజయవాడకు చెందిన ఎం.అభిలాష్‌ ఐఐటీ తిరుపతి, గుంటూరుకు చెందిన ఎం.అర్జున్‌కుమార్‌ సెకెండ్‌ రౌండ్‌కు దరఖాస్తు, తాళ్లవలసకు చెందిన ఆర్‌ఎస్‌ భరద్వాజ ఎన్‌ఐటీ సిల్చార్‌, ఎనికేపాడుకు చెందిన జీ.రేష్మిత ఐఐటీ తిరుపతిలో సీట్లు పొందగలిగారు.

మెసేజ్‌ చేసిన అరగంటలోనే స్పందించారు

ఐఐటీ, మద్రాసు అధికారులు సీటు తిరస్కరించాక ఏం చేయాలో పాలుపోలేదు. మంత్రి నారా లోకేశ్‌కు వాట్సాప్‌ మెసేజ్‌ చేశాను. అరగంటలోనే ఆయన స్పందించారు. మా సమస్య పరిష్కారమయ్యే వరకు పేషీ అధికారులను నిరంతరం ఫాలోఅప్‌ చేస్తూనే వున్నారు. సీటుపై ఆశలు వదులుకున్న సమయంలో మంత్రి లోకేశ్‌ భగవంతుడిలా వచ్చి అండగా నిలిచారు.

- ఎం.పృథ్వీ సత్యదేవ్‌, విజయవాడ

భవిష్యత్తుకు భరోసా ఏర్పడింది

కౌన్సెలింగ్‌ అధికారులు మా మెమోలు తిరస్కరించిన తరువాత భవిష్యత్తు ముగి సిపోయిందని భావించాం. మంత్రి లోకేశ్‌ దృష్టికి సమస్యను తీసుకువెళ్లినప్పుడు నేనున్నాననే భరోసా కల్పించి అండగా ని లిచారు. నిరంతరం అధికారులతో మాట్లాడి జీవో విడుదల చేయించడం ద్వారా మళ్లీ మా భవిష్యత్తుపై ఆశలు చిగురిం చేలా చేశారు. నాకు ఎన్‌ఐటీ, కాలికట్‌లో సీటు వచ్చింది.

- రఘునాథ్‌రెడ్డి, కడప

రాజకీయ నేతలపై గౌరవం పెరిగింది

తమ సమస్యను తన సమస్యగా భావించి మంత్రి లోకేశ్‌ తీసుకున్న చొరవను చూశాక రాజకీయ నాయకులపై గౌరవం పెరిగింది. తల్లిదండ్రులు నాకు జన్మనిస్తే లోకేశ్‌ నా జీవితంలో వెలుగులు నింపారు. జీవో ఇచ్చారని తెలియగానే ఉన్నత చదువులకు ఇక ఢోకా లేదనే నమ్మకం కలిగింది. కౌన్సెలింగ్‌ 3వ రౌండ్‌లోనే ఎంపికయ్యాను. బీటెక్‌ తరువాత ఎంటెక్‌ పూర్తిచేసి పేరున్న సంస్థలో ఉద్యోగం సాధించడమే నా లక్ష్యం.

- ఎన్‌.వెంకట స్నేహిత, నెల్లూరు

లోకేశ్‌ స్ఫూర్తితో ఉన్నతంగా ఎదుగుతా

మార్కుల జాబితాలో లోపాలపై అధికారులు అభ్యంతరం చెప్పాక మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురయ్యాం. సీటు క్యాన్సిల్‌ అవుతుందేమోనని డీలా పడ్డాం. మంత్రి లోకేశ్‌ చొరవ చూపి సమస్యను పరిష్కరించడంతో మాకు ధైర్యం వచ్చింది. సీటు వచ్చిందని తెలిశాక మా కుటుంబం మొత్తం ఆనందంలో మునిగిపోయారు. మంత్రి లోకేశ్‌ను స్పూర్తిగా తీసుకుని మంచి ఉద్యోగం సాధించి ప్రజలకు సేవ చేస్తాను.

- భరద్వాజనాయుడు, తాళ్లవలస- ఎన్‌.వెంకట స్నేహిత, నెల్లూరు

Updated Date - Jul 08 , 2024 | 12:46 AM