Share News

ఫుల్లుగా.. తాగేశారు

ABN , Publish Date - May 19 , 2024 | 12:46 AM

గతంలో ఏ ఎన్నికల్లో లేని రీతిలో ఈ పర్యాయం మద్యం ఏరులై పారింది. నోటిఫికేషన్‌ వెలువడిన నాటి నుంచే ఓటర్లను మత్తులో ముంచే ప్రయత్నం చేశారు. తమ పాలనతో ప్రజలు అన్ని రకాలుగా విసుగు చెందారని ముందుగానే గుర్తించిన వైసీపీ అభ్యర్థులు ఓటర్లకు అవేవీ గుర్తుండకుండా చేసేందుకు ప్రయత్నించినప్పటికీ మత్తు దిగగానే వారు తమ ప్రతాపం చూపించారు.

ఫుల్లుగా.. తాగేశారు

గుంటూరు, మే 16(ఆంధ్రజ్యోతి): గతంలో ఏ ఎన్నికల్లో లేని రీతిలో ఈ పర్యాయం మద్యం ఏరులై పారింది. నోటిఫికేషన్‌ వెలువడిన నాటి నుంచే ఓటర్లను మత్తులో ముంచే ప్రయత్నం చేశారు. తమ పాలనతో ప్రజలు అన్ని రకాలుగా విసుగు చెందారని ముందుగానే గుర్తించిన వైసీపీ అభ్యర్థులు ఓటర్లకు అవేవీ గుర్తుండకుండా చేసేందుకు ప్రయత్నించినప్పటికీ మత్తు దిగగానే వారు తమ ప్రతాపం చూపించారు. ఈ ఐదేళ్ళలో మద్యం వ్యాపారాన్ని సైతం ప్రభుత్వం పేరుతో వైసీపీ పాలకులు తమ హస్తగతం చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో మద్యం దుకాణాల మధ్య పోటీ లేకపోవటంతో పాలకుల ఇష్టారాజ్యం అయిపోయింది. జె బ్రాండ్‌గా ప్రజలు పిలుచుకునే నాసిరకం మద్యంను మాత్రమే షాపుల్లో ఉంచి అమ్మించారు. వాటికి కూడా అధిక ధరలు పెట్టి పేదలను దోచుకున్నారు. కేవలం నగదుతోనే అమ్మకాలు జరిపించి లాభాల లెక్కలను గోల్‌మాల్‌ చేసి ఎన్నికల ఫండ్‌కు వాటిని మరలించినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఇలా పేదల నుంచి దోచుకున్న సొమ్ముతోనే తిరిగి మద్యం రూపంలో వారికే ఇచ్చి ఎన్నికల్లో లబ్ధి పొందాలని వైసీపీ అధిష్టానం పన్నిన కుయుక్తులు పారలేదు. ఎన్నికలకు రెండు, మూడు నెలలు ముందు కూడా నాసిరకం మద్యం సీసాలతోనే షాపులను నింపిన వైసీపీ ప్రభుత్వం హఠాత్తుగా ఓటర్లపై ప్రేమ చూపుతూ మంచిరకం మద్యం కూడా వైన్‌షాపుల్లో ఉండేలా చూశారు. దీనికి కూడా ప్రధాన కారణం టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తన ఎన్నికల ప్రచార సభల్లో జె బ్రాండ్‌ పేరుతో పేదలను దోచుకోవటమే కాకుండా వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని, సీఎం జగన్‌పై ఆగ్రహం వెలిబుచ్చుతూ తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మంచి మద్యాన్ని మాత్రమే అమ్మిస్తామనే చెపటంతో ఎన్నికల సమయంలో ఓటర్లను మభ్య పెట్టేందుకు కొద్దిరోజుల పాటు మురిపించారు. కాగా ఎన్నికల జాతర ప్రారంభమై ముగిసిన 56 రోజుల్లో ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో రూ.235.31 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు అధికారులు రికార్డుల్లో చూపారు. వాస్తవానికి ఇందులో 10 శాతం కూడా ప్రజలు నేరుగా కొనుక్కొని తాగింది ఉండదు. మిగతా అంతా కూడా ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు ముఖ్యంగా వైసీపీ క్యాండెట్స్‌ కొనుగోలు చేసి పంపిణీ చేసేందేనని చెప్పుకోవచ్చు. గత్యంతరం లేక టీడీపీ అభ్యర్ధులు కూడా తాము మద్యం పంపిణీ చేసేందుకు కొనుగోలు చేయాలని ప్రయత్నించినప్పటికీ సింహబాగం తమ పార్టీ అభ్యర్థులకే దక్కేలా వైసీపీ పెద్దలు అధికార దర్పంతో చేశారు. దీంతో ప్రతిపక్షంలో ఉన్న కూటమి అభ్యర్థులు తమకు అనుకూలంగా ఉండే బార్‌ యజమానుల నుంచి అధిక ధరలు చెల్లించి మద్యం కొనుగోలు చేయాల్సి వచ్చింది. నోటిఫికేషన్‌ వెలువడిన మార్చి 16 నుంచి ఈనెల 11వ తేదీ వరకు (పోలింగ్‌ తేదీకి రెండు రోజులు ముందు షాపులు మూసివేశారు) 2,60,200 కేసులు లిక్కర్‌ అమ్మకాలు జరిగాయి. అంటే బ్రాందీ, విస్కీ వంటి మద్యం, బీరు అమ్మకాలు 76,100 కేసులు అమ్మారు. ఇదంతా అధికారుల లెక్కల్లో ఉండే మద్యం అమ్మకాల చలామణీ మాత్రమే ఇక ఏపీలో కంటే పొరుగు రాష్ట్రాల్లో మద్యం చౌకగా లభిస్తుండటంతో పోటీలో ఉన్న అభ్యర్థులు ఆ రాష్ట్రాల నుంచి లారీల్లో తమ తమ నియోజకవర్గాలకు తరలింప చేసుకొని గడ్డివాముల్లో నిల్వ చేసి విడతల వారీగా ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు పంపిణీ చేశారు. దీని విలువ అంచనాకు అందనప్పటికీ కోట్లల్లోనే ఉంటుందని చెప్పవచ్చు. విశేషమేమిటంటే ప్రభుత్వం ఎన్నికల నియమావళి ప్రకారం 11వ తేదీనే దుకాణాలను మూయించి సీల్‌ వేసినప్పటికీ అప్పటికే తమ తమ స్థావరాల్లో రహస్యంగా ఉంచిన మద్యాన్ని సాధారణ రోజుల్లో కంటే ఎక్కువగా పారేలా చేశారు.

Updated Date - May 19 , 2024 | 01:33 AM