మందకొడిగా.. ఖరీఫ్ సాగు
ABN , Publish Date - Jul 28 , 2024 | 12:40 AM
ఖరీఫ్ సీజన్‌లో నాట్లు మందకొడిగా కొనసాగుతున్నాయి. కృష్ణా పశ్చిమ డెల్టా, గుంటూరు ఛానల్‌లో కాల్వలకు నీటి విడుదలలో కొంత ఆలస్యం కావడం, ఇప్పుడిప్పుడే వర్షాలు పుష్కలంగా కురుస్తుండటంతో రైతులు విత్తనాలు నాటేందుకు ఉపక్రమిస్తున్నారు.

గుంటూరు, జూలై 27 (ఆంధ్రజ్యోతి): ఖరీఫ్ సీజన్‌లో నాట్లు మందకొడిగా కొనసాగుతున్నాయి. కృష్ణా పశ్చిమ డెల్టా, గుంటూరు ఛానల్‌లో కాల్వలకు నీటి విడుదలలో కొంత ఆలస్యం కావడం, ఇప్పుడిప్పుడే వర్షాలు పుష్కలంగా కురుస్తుండటంతో రైతులు విత్తనాలు నాటేందుకు ఉపక్రమిస్తున్నారు. పట్టిసీమ ద్వారా డెల్టాకు అవసరమైన సాగునీటిని అందించడం జరుగుతుందని అధికారులు రైతులకు భరోసా కల్పిస్తున్నారు. మరోవైపు బ్యాంకర్ల సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ ఏడాది వ్యవసాయ రుణాలు పుష్కలంగా ఇవ్వాలని కోరిన దృష్ట్యా వచ్చే నెల రెండో వారం ముగిసేనాటికి నాట్లు దాదాపుగా 90 శాతం వరకు పూర్తి అవుతాయని భావిస్తున్నారు. జిల్లాలో అన్ని పంటలు కలిపి 1,25,914 హెక్టార్లలో ఖరీఫ్ సీజన్‌లో రైతులు సాగు చేస్తుంటారు. ఇప్పటివరకు 46,402 హెక్టార్లలో నాట్లు పూర్తి అయినట్లు మండల వ్యవసాయ శాఖ అధికారుల నుంచి జిల్లా వ్యవసాయ శాఖకు గణాంకాలు చేరాయి. వీటిల్లో ఎక్కువగా వరి నాట్లే ఉన్నాయి. గతంలో వలే నారుమడులు పెట్టుకోవడాన్ని రైతులు మానేసి నేరుగా విత్తనాలు నాటే పద్ధతికి మారిపోయారు. ఈ కారణంగా 29,336 హెక్టార్లలో వరినాట్లు పూర్తి అయ్యాయి. ఇంకా 35 వేల హెక్టార్లలో వరినాట్లు వేయాల్సి ఉన్నది. జిల్లాలో పంటల సాగులో రెండో స్థానంలో నిలిచే పత్తి సాధారణ విస్తీర్ణం 26,982 హెక్టార్లు కాగా ఇప్పటివరకు 10,057 హెక్టార్లలో నాట్లు పూర్తి చేశారు. మిర్చి విషయంలోనే తాత్సారం జరుగుతున్నది. మిర్చి విత్తనాలు కొనుగోలు చేసి నర్సరీల్లో మొక్కలు పెంచి వాటిని తీసుకొచ్చి నాటాల్సి ఉన్నది. ఇందుకోసం 20 రోజుల నుంచి నెల వరకు సమయం పడుతుంది. 20,625 హెక్టార్లలో మిర్చి సాగు ఏటా జరుగుతుంటుంది. ఇప్పటివరకు 29 హెక్టార్లలో మాత్రమే నాట్లు పూర్తి అయ్యాయి. పసుపు విషయానికి వస్తే 1,671 హెక్టార్లకు 923 హెక్టార్లలో నాట్లు వేశారు. జూట్, సోయాబీన్, పశుగ్రాసం, కూరగాయలు, ఇతర పంటలు, టమాటాలు కూడా 50 శాతం లోపే నాట్లు వేశారు.
అధిక వర్షపాతం నమోదు
వాతావరణాన్ని పరిగణనలోకి తీసుకుంటే జూన్, జూలై నెలల్లో ఇప్పటివరకు సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైంది. కృష్ణానదికి ఎగువ ప్రాజెక్టుల నుంచి వరద రావడం లేదు. కేవలం స్థానికంగా కురిసిన వర్షంతో చిన్న వాగుల నుంచి వరద వస్తున్నది. అయితే ప్రభుత్వం ముందుచూపుతో వృథాగా సముద్రంలో కలిసిపోతున్న గోదావరి వరదనీటిని పట్టిసీమ ద్వారా ఇక్కడికి తరలిస్తున్నది. ఈ నెల 10 నుంచి కాల్వలకు నీటి విడుదలను కొనసాగిస్తున్నారు. అయితే మెయిన్ కెనాల్ సామర్థ్యం 8,162 క్యూసెక్కులు కాగా ప్రస్తుతానికి 300 క్యూసెక్కులు మాత్రమే విడుదల చేస్తున్నారు. గుంటూరు ఛానల్‌కు ఇంకా నీటిని విడుదల చేయడాన్ని ప్రారంభించలేదు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందున రైతుల నుంచి సాగునీటి కోసం పెద్దగా డిమాండ్ లేకపోవడంతో తక్కువగానే నీటిని విడుదల చేస్తున్నారు. కాగా వరి సాగు చేపట్టిన రైతుల్లో ఎక్కువమంది బీపీటీ-5204కే మొగ్గు చూపారు. మొత్తం 29,336 హెక్టార్లలో ఈ వెరైటీని 28,047 హెక్టార్లలో వేశారు. ఇతర వెరైటీలైన బీపీటీ-2846, 2782, ఎంటీయూ 1224, 1262, 1061, ఆర్‌ఎన్‌ఆర్ ఎం-7, సీఆర్ 1009, జేజీల్ 1798ని తక్కువ విస్తీర్ణంలోనే సాగు చేపట్టారు. నీటి లభ్యత ఎక్కువగా ఉండే తెనాలిలో 5,800, దుగ్గిరాలలో 4,460, కొల్లిపరలో 5,310, కాకుమానులో 3,416 హెక్టార్లలో నాట్లు పడినట్లు జిల్లా వ్యవసాయ అధికారి నున్నా వెంకటేశ్వర్లు తెలిపారు.