Share News

ఖరీఫ్‌ ప్లాన్‌.. రెడీ

ABN , Publish Date - May 31 , 2024 | 01:14 AM

జిల్లాలో ఖరీఫ్‌ సాగు ప్రణాళికను వ్యవసాయ శాఖ సిద్ధం చేసింది. పంటల సాగు లక్ష్యం 6.69 లక్షల ఎకరాలు. సాగుకు సాకులు అనే శీర్షికతో ఆంధ్రజ్యోతిలో వెలువడిన వార్తకు వ్యవసాయ శాఖ స్పందించింది.

ఖరీఫ్‌ ప్లాన్‌.. రెడీ

నరసరావుపేట, మే 30: జిల్లాలో ఖరీఫ్‌ సాగు ప్రణాళికను వ్యవసాయ శాఖ సిద్ధం చేసింది. పంటల సాగు లక్ష్యం 6.69 లక్షల ఎకరాలు. సాగుకు సాకులు అనే శీర్షికతో ఆంధ్రజ్యోతిలో వెలువడిన వార్తకు వ్యవసాయ శాఖ స్పందించింది. సాగు ప్రణాళికను ప్రకటించింది. విత్తన ప్రణాళికను వ్యవసాయ శాతం సిద్ధం చేసింది. ఆర్‌బీకేల నుంచి సబ్సిడీపై పచ్చిరొట్ట విత్తనాలు పంపిణీ చేపట్టారు. జిల్లాకు విత్తన పంపిణీకి కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటోంది. ప్రధాన పంటలు మిరప, పత్తి, వరి, కంది. ఈ పంటల సాగు అవసరమైన విత్తన సేకరణ చేపట్టారు. జిల్లాకు అవసరమైన ఎరువులు, విత్తనాలకు సంబంధించిన ప్రతిపాదనలు పంపినట్టు వ్యవసాయ శాఖ జేడీ ఐ.మురళి బుధవారం తెలిపారు.

ఫ గత ఏడాది తీవ్ర వర్షాభావం, సాగునీటి కరువుతో లక్షలాది ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేయలేక దారుణంగా నష్టపోయారు. వర్షాభావంతో పత్తి సాగు విస్తీర్ణం దారుణంగా పడిపోయింది. సాధారణ స్థాయిలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించిన నేపథ్యంలో పత్తి, కంది సాగుకు పొలాలను రైతులు సిద్ధం చేస్తున్నారు. మిరప విత్తనాలు 10 గ్రాముల ప్యాకెట్లు 18,80,500 లక్షలు అవసరం అవుతుందని అంచనా వేశారు. ఈ మేరకు కంపెనీలకు ఇండెంట్‌లు పంపారు. ఇప్పటికే ఆర్‌బీకేల ద్వారా మిరప విత్తనాలు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రైతులు రెండు రకాల మిరప విత్తనాలపై మొగ్గు చూపుతున్నారు. ఏ రకం విత్తనం సాగు చేసినా దిగుబడులు ఒకే రకంగా ఉంటాయన్న అంశంపై రైతులకు ఉద్యాన శాఖ అవగాహన కల్పిస్తోంది. పత్తి విత్తనాలు 475 గ్రాముల ప్యాకెట్‌లు 7,65,625 లక్షలు అవసరం ఉంది. ఈ మేరకు ఆయా కంపెనీలు విత్తనం సరఫరా చేసేందుకు అంగీకరిచాయి.

ఫ గత ఏడాది వరి సాగును రైతులు పూర్తిగా కోల్పోయారు. బావులు, బోర్లు, లిఫ్టుల కింద మాత్రమే వరిసాగు చేశారు. ఈ ఏడాది వర్షాలు ఆశాజనకంగా ఉంటాయి, జలాశయాలు నిండుతాయి, వరి సాగు చేయవచ్చన్న ఆశతో అన్నదాతలు ఉన్నారు. వరి సాగుకు వారు సమాయత్తమవుతున్నారు. దీంతో వరి సాగుకు అవసరమైన విత్తన సేకరణ జరుగుతోందని, ఏపీ సీడ్స్‌ ద్వారా కిలోకు రూ.5 సబ్సిడీపై వరి వంగడాలను రైతలకు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. వరి సాగుకు ముందుగా భూసారం పెంపొందించేందుకు పచ్చిరొట్ట సాగు చేయాలన్నారు. ఇందుకు కోసం జీలుగ, పెసర, జనుము విత్తనాలను 50 శాతం సబ్సిడీపై ఆర్‌బీకేల ద్వారా పంపిణీని ప్రారంభించామన్నారు. 6,235 క్వింటాళ్ళ పచ్చి రొట్ట విత్తన నిల్వలు సిద్ధం చేశారు.

ఫ ఎరువులు 3.17 లక్షల మెట్రిక్‌ టన్నులు అవసరం ఉందని అంచానా వేశారు. ఈ మేరకు ప్రతిపాదనలు పంపారు. యూరియా 1,02,096 మెట్రిక్‌ టన్నులు, డీఏపీ 38,234, కాంప్లెక్స్‌ 1,61,784, ఎంవోపీ 9,617, ఎస్‌ఎస్‌పీ 5,316 మెట్రిక్‌ టన్నుల ఎరువులు నెలలవారీగా డిమాండ్‌ అంచనాతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఎరువులను ఆర్‌బీకేల ద్వారా 75 వేల మెట్రిక్‌ టన్నులు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఫ జిల్లాలో నికర సాగు భూమి 7,69,125 ఎకరాలు ఉంది. 4,04,599 లక్షల కమతాలు ఉన్నాయని, 90 శాతం మంది చిన్న, సన్నకారు రైతులు ఉన్నారు. సాగర్‌ కాలువల కింద సూమరు ఐదు లక్షల ఎకరాలు, చెరువులు, బోర్ల కింద 1,25,000 ఎకరాల్లో పంటలు సాగు చేస్తారు. జిల్లా సాధారణ సాగు విస్తీర్ణం 6,20,875 ఎకరాలు కాగా 6,99,300 ఎకరాల్లో పంటల సాగు లక్ష్యంగా వ్యవసాయ శాఖ ప్రతిపాదించింది. గత ఖరీఫ్‌లో 2,26,6981 ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. పత్తి 1,22,500 ఎకరాల్లో, మిరప 1,88,005 ఎకరాలు, వరి 1,06,250 ఎకరాలు, కంది 53,125 ఎకరాల్లో సాగు అవుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది.

ఫ జిల్లా సగటు వర్షపాతం 775.5 మిమీ, 62 శాతం నైరుతి రుతుపవనాలు, 27 శాతం ఈశాన్య రుతుపవనాల ద్వారా వర్షపాతం నమోదు అవుతుందన్నారు. నాణ్యమైన విత్త్తనాలు, ఎరువులు రైతులకు పంపిణీ చేసే కార్యక్రమంలో భాగంగా వీటి నాణ్యతా ప్రమాణాలను పరీక్షించేందుకు జిల్లాలో 7 అగ్రిల్యాబ్‌లు ఏర్పాటు చేశారు. వీటిలో పరీక్షలు నిర్వహిస్తారు. ఈ క్రాప్‌ నమోదు తప్పనిసరి, లేకుంటే రైతులు ప్రభుత్వ పథకాలను కోల్పోతారు. ప్రతి ఆర్‌బీకేల పరిధిలో క్రాప్‌ బుకింగ్‌ నిర్వహిస్తారు. పంటల బీమా, సున్నా వడ్డీ, ఇన్‌పుట్‌ సబ్సిడీ వంటి పథకాలు అమలు కావాలంటే ఈ క్రాప్‌ నమోదు తప్పనిసరి. ఈ ఖరీఫ్‌లో 55 వేలమంది కౌలు రైతులకు కార్డుల పంపిణీ లక్ష్యంగా నిర్ణయించామన్నారు.

కాల్‌ సెంటర్‌ ఏర్పాటు...

వ్యవసాయ జేడీ కార్యాలయంలో కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేశామన్నారు. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు పంపిణీలో అవకతవకలు, కల్తీలు, నకిలీలు, బ్లాక్‌ మార్కెట్‌ అంశాలు ఎవరి దృష్టికి వచ్చినా నేరుగా 8331056905కు కాల్‌ చేసి తెలియజేయవచ్చు. నకిలీలు, బ్లాక్‌ మార్కెట్‌ను అరికట్టేందుకు జిల్లా టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశామని జేడీ ఐ.మురళి తెలిపారు. గ్రామ స్ధాయిలోనే వీఆర్‌వో, కార్యదర్శి, సచివాలయ ఉద్యోగితో కమిటీలు నెలకొల్పామన్నారు. మండల, డివిజన్‌ స్థాయిలో కూడా ఈ కమిటీలు పనిచేస్తాయన్నారు. నిరంతర తనిఖీలు జరుగుతాయని, దీనిలో భాగంగానే విత్తనాలకు సంబంధించి 1400 శ్యాంపిల్‌, 1250 ఎరువులు, 1000 పరుగుమందుల శ్యాంపిల్స్‌ తీయనున్నట్టు తెలిపారు. రైతలు విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు కొనుగోలు చేసే సమయంలో బిల్లు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. రైతులు కొనుగోలు చేసిన వాటిలో అవి నాసిరకం అని అనుమానం ఉంటే నేరుగా ప్రతి నియోజకవర్గంలో ఉన్న అగ్రిల్యాబ్‌లో పరీక్ష చేయించాలని సూచించారు. కల్తీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు నిరోధించండంతో పాటు బ్లాక్‌ మార్కెట్‌ను అరికట్టేందుకు పూర్తిస్థాయి చర్యలు చేపట్టామన్నారు. పంటల సాగులో సాంకేతికను జోడించేందుకు ఈ దిశగా రైతులను ఛైతన్య పరిచేందుకు వారికి శిక్షణా తరగతులను నిర్వహించనున్నట్టు జేడీ ఐ.మురళి తెలిపారు. సాగులో మెళకువలను తెలియజేయడం ద్వారా పంట ఉత్పత్తి పెంచే అవకాశం ఉంటుందని చెప్పారు.

Updated Date - May 31 , 2024 | 01:14 AM