Share News

కందిపప్పు.. కోత

ABN , Publish Date - Jun 02 , 2024 | 12:35 AM

రేషన్‌ సరుకుల్లో కందిపప్పునకు కోతేశారు.. గోధుమ పిండి పంపిణీని మరిచారు. కొన్ని నెలలుగా రేషన్‌ అంటే బియ్యం మాత్రమే ఇస్తూ ప్రభుత్వం చేతులు దులుపుకుంటోంది. బహిరంగ మార్కెట్‌లో కందిపప్పు ధర విపరీతంగా పెరిగిపోయింది. ఆ భారం నుంచి తప్పించుకునే క్రమంలో రేషన్‌లో కందిపప్పును పక్కనపెట్టేశారు. రేషన్‌ సరుకుల కోత జాబితాలో గోధుమపిండి కూడా చేరిపోయింది. గతంలో బహిరంగ మార్కెట్‌లో ధరలు పెరిగితే వాటిని క్రమబద్ధీకరించే చర్యల్లో భాగంగా ప్రభుత్వం సబ్సిడీపై వాటిని రేషన్‌ స్టోర్లు, రైతుబజారుల ద్వారా పంపిణీ చేసేది. అయితే వైసీపీ ప్రభుత్వం ధరల క్రమబద్ధీకరణ అనే విషయాన్నే విస్మరించింది. పైగా రేషన్‌ సరుకుల్లో వాటికి కోత వేసి కార్డుదారుల బాధలను పట్టించుకోవడంలేదన్న విమర్శలున్నాయి. రేషన్‌ సరుకుల కోత, మరోవైపు ధరల భారంతో పేదలు ఇక్కట్లు పడుతున్నా అటు అధికారులు, ఇటు పాలకులకు పట్టడంలేదు.

కందిపప్పు.. కోత

(నరసరావుపేట, ఆంధ్రజ్యోతి)

గతంలో రేషన్‌ స్టోర్లు మిని మాల్స్‌గా ఉండేవి. సబ్సిడీపై బియ్యం, కందిపప్పు, గోధుమపిండి, పామాయిల్‌ తదితరాలను కార్డుదారులకు ప్రభుత్వం అందజేసేది. అయితే వైసీపీ ప్రభుత్వం పౌరసరఫరాల వ్యవస్థ ప్రక్షాళన అంటూ పేదల పొట్టకొట్టింది. వ్యవస్థ ప్రక్షాళన ఏమో కానీ తమకు అందే సరుకుల్లో కోత పడిందని తెల్లకార్డుదారులు వాపోతున్నారు. ఇంటి వద్దకు రేషన్‌ అని చెప్తూ ఓ వాహనం, దానికో డ్రైవర్‌, హెల్పర్‌ను నియమించి కేవలం ఒక్కో లబ్ధిదారుడికి ఐదు కేజీల బియ్యంతో సరిపుచ్చుతోంది. రేషన్‌ సరుకుల్లో కందిపప్పు, గోధుమ పిండి పంపిణీని నిలిపివేసింది. తెల్లకార్డుదారులకు ఐదు నెలలుగా ప్రభుత్వం కందిపప్పు పంపిణీపై మొండిచేయి చూపుతున్నది. బహిరంగ మార్కెట్‌లో కందిపప్పు కిలో ధర రూ.180 నుంచి రూ.190 వరకు ఉంది. మార్కెట్‌లో ధర పెరగడంతో ప్రభుత్వం రాయితీపై పంపిణీ చేసే కందిపప్పు కోసం కార్డుదారులు ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే రాయితీపై కందిపప్పు పంపిణీని పౌరసరఫరాల శాఖ పూర్తిగా విస్మరించింది. కందిపప్పు అడిగితే స్టాక్‌ లేదనే సమాధానంతో సరిపుచ్చుతున్నారు. ప్రభుత్వం కిలో కందిపప్పు రాయితీపై రూ.67కు ఇవ్వాల్సి ఉంది. ప్రైవేట్‌ మార్కెట్‌లో దాదాపు రూ.100 నుంచి రూ.110 వరకు అధికంగా ఉండటంతో కార్డుదారులు రాయితీ కందిపప్పు పంపిణీ చేయాలని కోరుతున్నా వీరి మొర ఆలకించే వారే కరువయ్యారు. కందిపప్పు ధర మార్కెట్‌లో పెరగడంతో ఆ భారం తప్పించుకునేందుకే సరఫరాను నిలిపివేసిందన్న విమర్శలున్నాయి. బహిరంగ మార్కెట్‌లో కిలో గోధుమ పిండి ధర రూ.45 నుంచి రూ.50 వరకు ఉంది ప్రభుత్వం రాయితీపై కిలో రూ.16కు అందిస్తోంది. దీంతో కార్డుదారులు గోధుమ పిండి తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. గోధుమ పిండి సరఫరాను కూడా నిలిపివేసింది. కందిపప్పుతో పాటు నిత్యావసర సరుకుల ధరలు పెరగడంతో పేదలపై ఆర్థిక భారం పడుతుంది. పల్నాడు, బాపట్ల, గుంటూరు జిల్లాల్లో కందిపప్పు పంపిణీని ప్రభుత్వం దాదాపుగా నిలిపివేసింది.

- పల్నాడు జిల్లాలో 6,45,110 తెల్లకార్డులు ఉన్నాయి. ఒక్కొక్క కార్డుదారుడికి కిలో కందిపప్పు అందజేయాలి. మేలో ఎన్నికలు ఉండటంతో 48.21 శాతం కార్డుదారులకు 2,85,104 ప్యాకెట్ల కందిపప్పును పంపిణీ చేశారు. ఎన్నికలు పూర్తవడంతో జూన్‌లో కార్డుదారులకు మొండిచేయి చూపనుంది. గోఽధుమ పిండి గత నెలలో 10.87 శాతం కార్డులకు పంపిణీ చేశారు. ఈ నెలలో 1.17 శాతం కార్డులకు సరఫరా చేయనున్నారు.

- బాపట్ల జిల్లాలో 4,86,029 తెల్లకార్డులు ఉన్నాయి. ఈ నెలలో 0.03 శాతం కార్డుదారులకు మాత్రమే కందిపప్పు సరఫరా చేశారు. గోధుమ పిండి గత నెలలో 12.85 శాతం కార్డులకు ఈ నెలలో 1.12 శాతం కార్డులకు సరఫరా చేశారు.

- గుంటూరు జిల్లాలో 5,99,511 తెల్లకార్డులు ఉన్నాయి. మే నెలలో 16,634 ప్యాకెట్ల కందిపప్పు పంపిణీ చేశారు. గోధుమ పిండి గత నెలలో 9.73 శాతం కార్డులకు పంపిణీ చేయగా ఈ నెలలో 1.52 శాతం కార్డులకు పంపిణీ చేయనున్నారు.

Updated Date - Jun 02 , 2024 | 12:35 AM