Share News

జగన్‌.. దమ్ముంటే మాచర్లకు రా..

ABN , Publish Date - Jul 06 , 2024 | 12:53 AM

‘పులివెందుల ఎమ్మెల్యే జగన్‌మోహన్‌రెడ్డి దమ్ముంటే మాచర్లకు రా.. వస్తే మీ సుద్ధపూస ఉంగరాల బ్రదర్స్‌, గుడుంబా శంకర్‌లు మాచర్లలో చెరబట్టిన అక్రమాలు, అన్యాయాలు ఆధారాలతో సహా చూపిస్తా..’ అంటూ మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి పులివెందుల ఎమ్మెల్యే జగన్‌మోహన్‌రెడ్డికి సవాల్‌ విసిరారు.

జగన్‌.. దమ్ముంటే మాచర్లకు రా..
విలేకరులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి

నీ సుద్ధపూస అక్రమాలు ఆధారాలతో చూపిస్తా...

నీతో నీతులు చెప్పించుకునే స్థితిలో లేము

అక్రమాలు చేస్తే విచారణ ఎదుర్కోవాల్సిందే..

మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి

మాచర్లటౌన్‌, జూలై 5: ‘పులివెందుల ఎమ్మెల్యే జగన్‌మోహన్‌రెడ్డి దమ్ముంటే మాచర్లకు రా.. వస్తే మీ సుద్ధపూస ఉంగరాల బ్రదర్స్‌, గుడుంబా శంకర్‌లు మాచర్లలో చెరబట్టిన అక్రమాలు, అన్యాయాలు ఆధారాలతో సహా చూపిస్తా..’ అంటూ మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి పులివెందుల ఎమ్మెల్యే జగన్‌మోహన్‌రెడ్డికి సవాల్‌ విసిరారు. శుక్రవారం పట్టణంలోని నెహ్రూనగర్‌ టీడీపీ కార్యాలయం లో ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాలపై దాడులు జరుగుతున్న సమయంలో సిక్కటి చిరునవ్వు చిందించిన జగన్‌మోహన్‌రెడ్డి తన దోపిడి ముఠాలో సభ్యుడికి, కబ్జా కోరుకు అన్యాయం జరిగిందంటూ బయటకు వచ్చి మాట్లాడడం సిగ్గు చేటన్నారు. జగన్‌తో నీతులు చెప్పించుకునే స్థితిలో టీడీపీ నేతలు, కార్యకర్తలు లేరన్నారు. ప్రజలకు మంచి చేసినా తాము ఓడిపోయామని చెప్పడం జగన్‌ దివాలాకోరుతనానికి నిదర్శనమన్నారు. ఏ వర్గానికి న్యాయం చేశాడో చెప్పాలన్నారు. యువతను గంజాయికి బానిసను చేసి గంజాయి వ్యాపారం చేసి వైసీపీ నేతలు కోట్లు గడించారన్నారు. అమరావతిపై కక్ష కట్టి భవన నిర్మాణ రంగంపై ఆధారపడి జీవిస్తున్న అనేక మంది బడుగు, బలహీన వర్గాల వారి పొట్టగొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. తన స్వప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి దివాలా తీయించిన ఘనత జగన్‌మోహన్‌రెడ్దిదే అన్నారు. రాష్ట్రాన్ని లక్షల కోట్ల అప్పుల పాలుచేసి అగాదం సృష్టించారని విమర్శించారు. ప్రజాధనంతో నిర్మించిన ప్రజావేదికను కూల్చి సైకో ఆనందం పొందిన జగన్‌ మా పార్టీ ఆఫీసులను ధ్వంసం చేసి దాడులు చేసిన వారిపై కేసులు పెడితే నేటి వరకు చర్యలు లేవన్నారు. వీటిపై సమగ్ర విచారణ చేపడతామన్నారు. పాత కేసులన్నీ తిరగతొడతామని, వైసీపీ అవినీతి అక్రమాలకు, కబ్జాలకు తొత్తులుగా ఉన్న అధికారులు విచారణ ఎదుర్కొనక తప్పదన్నారు. జగన్‌ ఉడత ఊపులకు టీడీపీ భయపడదన్నారు. రాష్ట్ర ఖజానాను దోచుకున్న వారు ఏ స్థాయిలో ఉన్నా, ఎంతటి వారైనా వారికి సహకరించిన వారు సైతం జైలుకు వెళ్లక తప్పదన్నారు. సమావేశంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు కొమెర దుర్గారావు, ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు సాతులూరు కుమార్‌, బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు మున్నా రాంబాబు, కౌన్సిలర్‌ మదార్‌సాహెబ్‌, మద్దిగపు చిన వెంకట్రామిరెడ్డి, నేరేటి వీరాస్వామి, గూండాల శ్రీనివాస్‌ యాదవ్‌, యెనుముల కేశవరెడ్డి, యేచూరి సురేష్‌, మంజుల అంజి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 06 , 2024 | 12:53 AM