హ్యాపీనెస్టు భారం.. రూ.164.5 కోట్లు
ABN , Publish Date - Jul 08 , 2024 | 12:24 AM
హ్యాపీనెస్టు.. భారతదేశపు మొదటి గ్లోబల్ సిటీ ఆఫ్ ది ఫ్యూచర్‌గా ఉండేది. అమరావతి రాజధాని ప్రాంతంలో నివాసం ఉండేవారికి స్వచ్ఛమైన ఆనందాన్ని వెదజల్లేలా.. ఆధునికంగా.. పచ్చదనంతో అభివృద్ధి చేయాలని ఈ హ్యాపీనెస్టు ప్రాజెక్టును అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు రూపొందించారు. ఈ ప్రాజెక్టు రాష్ట్ర ప్రజలతో పాటు జాతికి గర్వకారణంగా ఉంటుందని అప్పటి పాలకులతో పాటు ప్రజలు కూడా భావించారు. దీంతో 12 టవర్లలో నిర్మాణం తలపెట్టిన ఈ హ్యాపీనెస్టు ప్రాజెక్టులోని 1200 ఫ్లాట్స్ కోసం అడ్వాన్స్‌లు చెల్లించి మరీ ముందస్తుగా బుకింగ్ చేసుకున్నారు. అయితే 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం.. జగన్ ముఖ్యమంత్రి కావడంతో ఈ హ్యాపీనెస్టు ప్రాజెక్టుకు శాపమైంది. ఐదేళ్లు దీని గురించి వైసీపీ పాలకులు పట్టించుకోలేదు. దీంతో తమ డిపాజిట్లును వెనక్కు ఇచ్చేయాలని పలువురు సీఆర్‌డీఏని కోరడంతో 2022లో పిల్లిమొగ్గలేసి సాగదీస్తూ వచ్చింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం.. అమరావతి రూపశిల్పి చంద్రబాబు ముఖ్యమంత్రి కావడంతో హ్యాపీనెస్టు ప్రాజెక్టు తిరిగి పట్టాలెక్కుతుందని పలువురు భావిస్తున్నారు. అయితే వైసీపీ ఐదేళ్ల పాలన కారణంగా ఈ ప్రాజెక్టుతో సీఆర్‌డీఏకు రూ.164.5 కోట్ల భారం మోయాల్సి వచ్చింది. ప్రాజెక్టు నిర్మాణం జరిగే కొద్దీ ఎస్‌వోఆర్ పెరిగే అవకాశం ఉండటంతో నష్టం కూడా పెరగనున్నది.

గుంటూరు, జూలై 7 (ఆంధ్రజ్యోతి): ఐకానిక్ సిటీగా అమరావతిని రూపొందించాలన్న నాటి పాలకుల ఆలోచనల నుంచి హ్యాపీనెస్టు ప్రాజెక్టు పుట్టింది. ఆధునికత.. లగ్జరీ.. సంప్రదాయాలు.. స్మార్ట్ లైఫ్‌స్టైల్‌ను మిళితం చేస్తూ ప్రపంచ స్థాయి వాతావరణాన్ని అందుబాటులోకి తెస్తూ.. 80 శాతానికిపైగా భూమిని సుందరమైన ప్రకృతి దృశ్యం చేరువ చేస్తూ హ్యాపీనెస్ట్ ప్రాజెక్టును సీఆర్‌డీఏ అమరావతి రాజధానిలోని నేలపాడు గ్రామంలో ప్రతిపాదించింది. అందులో నివాసం ఉండేందుకు ఫ్లాట్ల బుకింగ్ కోసం ప్రపంచవ్యాప్తంగా పలువురు పోటీ పడ్డారు. అయితే హ్యాపీనెస్టు ప్రాజెక్టుపై వైసీపీ పాలకులు కత్తిదూశారు. ఈ ప్రాజెక్టు గురించి టీడీపీ ప్రభుత్వ హయాంలో సర్వత్రా చర్చ జరిగింది. 12 టవర్లలో నిర్మాణం తలపెట్టిన 1200 ఫ్లాట్స్‌కు రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాలు, దేశాల్లో ఉన్న తెలుగువారి నుంచి కూడా విపరీతమైన స్పందన లభించింది. ఆన్‌లైన్‌లో బుకింగ్స్ ప్రారంభించగానే హాట్‌కేక్‌ల్లా బుకింగ్ అయ్యాయి. అడ్వాన్స్‌లు చెల్లించి మరీ ముందస్తుగా బుకింగ్ చేసుకున్నారు. ఆ ప్రాజెక్టు పూర్తి అయి ఉంటే ఈ పాటికే ఆ ఒక్క హ్యాపీనెస్టులోకే 1200 కుటుంబాలు వచ్చి నివాసం ఉండేవే. అయితే వైసీపీ ప్రభుత్వం తన ఐదేళ్ల పాలనలో హ్యాపీనెస్టుని పక్కన పెట్టేసింది. దీంతో ఇప్పుడు ఆ ప్రాజెక్టు నిర్మాణ ఖర్చు గణనీయంగా పెరిగింది. 2024-25 ఎస్‌వోర్ ప్రకారం దాదాపుగా రూ.885 కోట్లను వెచ్చించాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. ఇది ప్రాజెక్టు ప్రారంభంలో వేసిన అంచనా విలువ రూ.720.5 కోట్లతో పోల్చితే దాదాపుగా రూ.164.5 కోట్లు అదనం. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఏపీసీఆర్‌డీఏ భరించాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది.
చంద్రబాబు ఆమోదం.. జగన్ ద్రోహం
అమరావతి రాజధాని నగరానికి గత సీఎం జగన్ చేసిన ద్రోహం అంతా ఇంతా కాదు. రాజధానికే కాకుండా ఇక్కడ నివాసం ఉండాలని ఆలోచన చేసిన వారికి కూడా తీరని అన్యాయాన్నే చేశారు. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో రెసిడెన్షియల్ బిల్డింగ్స్ నిర్మాణంలో జోరు పెంచేందుకు ఏపీసీఆర్‌డీఏ హ్యాపీనెస్టు ప్రాజెక్టుని నిర్మాణం చేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి డీపీఆర్‌ని రూపొందించి ఆన్‌లైన్‌లో ఉంచింది. నేలపాడులోని 14.46 ఎకరాల విస్తీర్ణంలో సకల సదుపాయాలతో ఈ హ్యాపీనెస్టు ప్రాజెక్టుని ఒక రోల్‌మోడల్‌గా నిర్మించాలని భావించింది. 19 అంతస్తులతో ఒక్కో టవర్ నిర్మాణం చేయాలని నిర్ణయించింది. 1225, 1295 ఎస్‌ఎఫ్‌టీ విస్తీర్ణంలో 2 బీహెచ్‌కే ఫ్లాట్స్, 1510, 1590, 1630, 1710, 1870, 1980, 2120, 2245, 2640, 2750 ఎస్‌ఎఫ్‌టీలలో 3 బీహెచ్‌కే ఫ్లాట్స్‌ని నిర్మించేందుకు ప్లాన్ కూడా ఆమోదం లభించింది. ఇందులోనే ఎయిర్ కండీషన్డ్ జిమ్, క్రికెట్ ప్రాక్టీసు నెట్స్, స్కేటింగ్ రింగ్, రాక్ క్లయింబింగ్, ఏసీ మల్టీపర్పస్ హాల్, పార్టీ లాన్, లాంజ్, సెలూన్, ఏరోబిక్స్ హాల్, బ్యాడ్మింటన్ కోర్టులు, యోగా రూం, స్క్వాష్ కోర్టు, స్విమ్మింగ్ పూల్, టేబుల్ టెన్నిస్, క్లినిక్, ఫార్మసి డెస్కు, యాంపిథియేటర్, ధాన్యం వనం, జాగింగ్, రన్నింగ్ ట్రాక్, ఏటీఎంలు, బిజినెస్ సెంటర్‌లు, సూపర్ మార్కెట్‌లు వంటి సకల సదుపాయాలను నిర్మించేందుకు ప్లాన్స్ ఆమోదం పొందాయి. ఈ కారణంగానే 1200 ఫ్లాట్స్‌లో 1,187 ఇట్టే బుకింగ్ అయిపోయాయి. దీని నిర్మాణం పూర్తి అయితే సీఆర్‌డీఏకి రూ.57.37 కోట్ల లాభం కూడా వస్తుందని అప్పట్లో అంచనా వేశారు. ఈ ప్రాజెక్టుకి సంబంధించి ఏజెన్సీని కూడా అప్పట్లో సీఆర్‌డీఏ ఖరారు చేసింది. అయితే గత వైసీపీ ప్రభుత్వం వస్తూనే టెండర్లు రద్దు చేసింది. దాంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. ఈ క్రమంలో ఫ్లాట్స్ బుకింగ్ చేసుకున్న చాలామంది తమ డిపాజిట్లు వెనక్కు ఇచ్చేయాలని సీఆర్‌డీఏని కోరారు. దాంతో వైసీపీ ప్రభుత్వ హయాంలో 2022లో సీఆర్‌డీఏ తాను హ్యాపీనెస్టుని నిర్మిస్తానని పిల్లిమొగ్గలేసింది. ఏజెన్సీని కూడా ఖరారు చేయనున్నట్లు ప్రకటించింది. అయితే అది ఎంతమాత్రం కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు దీనిపై ప్రభుత్వం రూ.164.5 కోట్ల భారం మోయాల్సిన పరిస్థితి. ప్రాజెక్టు నిర్మాణం జరిగే కొద్దీ ఎస్‌వోఆర్ పెరిగే అవకాశం ఉండటంతో నష్టం కూడా పెరుగుతుంది.