Share News

పట్టాలు తప్పిన గూడ్స్‌

ABN , Publish Date - May 27 , 2024 | 12:13 AM

నడికుడి - మిర్యాలగూడ మధ్య విష్ణుపురం రైల్వేస్టేషన్‌ యార్డులో ఆటోమొబైల్‌ పరికరాలతో ఉన్న గూడ్స్‌(ఎన్‌ఎంజీ) ఆదివారం మధ్యాహ్నం పట్టాలు తప్పడంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం వాటిల్లింది. గూడ్స్‌ రైలు లూప్‌లైన్‌లో ప్రయాణిస్తుండటం వల్ల వేగం తక్కువగా ఉండటంతో లోకో పైలట్‌ వెంటనే గమనించి ఎమర్జన్సీ బ్రేకులు వేసి నిలిపేశారు.

పట్టాలు తప్పిన గూడ్స్‌
విష్ణుపురం సమీపంలో పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు

పిడుగురాళ్ల/గుంటూరు, మే 26 (ఆంధ్రజ్యోతి): నడికుడి - మిర్యాలగూడ మధ్య విష్ణుపురం రైల్వేస్టేషన్‌ యార్డులో ఆటోమొబైల్‌ పరికరాలతో ఉన్న గూడ్స్‌(ఎన్‌ఎంజీ) ఆదివారం మధ్యాహ్నం పట్టాలు తప్పడంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం వాటిల్లింది. గూడ్స్‌ రైలు లూప్‌లైన్‌లో ప్రయాణిస్తుండటం వల్ల వేగం తక్కువగా ఉండటంతో లోకో పైలట్‌ వెంటనే గమనించి ఎమర్జన్సీ బ్రేకులు వేసి నిలిపేశారు. లేకుంటే మరిన్ని బోగీలు పట్టాలు తప్పి ఉండేవే. ఈ విషయం తెలియగానే సికింద్రాబాద్‌ నుంచి తిరువనంతపురానికి బయలుదేరి మార్గమధ్యలోకి వచ్చేసిన శబరి ఎక్స్‌ప్రెస్‌ని మిర్యాల గూడలో నిలిపేశారు. అలానే విశాఖపట్టణం నుంచి లింగంపల్లికి వెళు తున్న జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ని పిడుగురాళ్లలో నిలిపారు. నరసపూర్‌ - నాగర్‌సోల్‌ షిర్డీ ఎక్స్‌ప్రెస్‌ని గుంటూరులోనే నిలిపేశారు. పట్టాలు తప్పిన బోగీలు రీరైల్‌మెంట్‌ చేశామని, కొద్దిసేపట్లోనే రూట్‌కి ఫిట్‌నెస్‌ ఇస్తారని ఆపరేటింగ్‌ వర్గాలు పేర్కొంటూ రైళ్లను ముందుకు నడి పాయి. ఆ తర్వాత జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ని నడికుడిలో, నాగర్‌సోల్‌ ఎక్స్‌ప్రెస్‌ని పిడుగురాళ్ల, సికింద్రాబాద్‌ - రేపల్లె ఎక్స్‌ప్రెస్‌ని కాసేపు నల్గొండ, ఆ తర్వాత మిర్యాలగూడలో నిలిపేశారు. ఫిట్‌నెస్‌ రావడం ఆలస్యం అయ్యే అవకాశం ఉండటంతో ముందుజాగ్రత్తగా సికింద్రా బాద్‌ - హౌరా ఫలక్‌నామా, సికింద్రాబాద్‌ - భువనేశ్వర్‌ విశాఖ ఎక్స్‌ప్రెస్‌ని దారి మళ్లించి పగడిపల్లి మీదగా విజయవాడకు తీసు కొచ్చి అక్కడి నుంచి రెగ్యులర్‌ రూట్‌లో నడుపుతామని రైల్వే శాఖ ప్రకటన జారీ చేసింది. విజయవాడ - లింగంపల్లి ఇంటర్‌సిటీ ఎక్స్‌ ప్రెస్‌ని విజయవాడలోనే గంట ఆలస్యంగా స్టార్ట్‌ చేశారు. వికారబాద్‌ - గుంటూరు పల్నాడు ఎక్స్‌ప్రెస్‌ని సికింద్రాబాద్‌లో సుమారు గంట పాటు క్రమబద్ధీకరించారు. హైదరాబాద్‌ - చెన్నై సెంట్రల్‌ ఎక్స్‌ప్రెస్‌ని గంట ఆలస్యంగా రీషెడ్యూల్‌ చేశారు. ఈరోడ్‌ - నాందేడ్‌ స్పెషల్‌ ట్రైన్‌ని కూడా గుంటూరులో క్రమబద్ధీకరించారు.

ప్రయాణికుల ఆగ్రహం

ఆదివారం మధ్యాహ్నం గూడ్స్‌ ప్రమాదం జరగడంతో నడికుడి మార్గంలో రైళ్ల రాకపోకలను ఎక్కడికక్కడ నిలిపేశారు. అసలే వేసవి పైగా రోహిణికార్తె కావడంతో ఎండ వేడిమి, వాతావరణంలో ఉక్కపోతని తట్టుకోలేక ఆయా రైళ్లలో ప్రయాణిస్తున్న వారు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. శబరి ఎక్స్‌ప్రెస్‌ని సుమారు నాలుగు గంటల పాటు మిర్యాలగూడ రైల్వేస్టేషన్‌లో నిలిపివేశారు. దీంతో ఏసీ బోగీలకు ఉన్న బ్యాటరీల్లో ఛార్జింగ్‌ డౌన్‌ అయి ఎయిర్‌ కండీషనింగ్‌ పని చేయడం తగ్గిపోయింది. ఉక్కపోతతో అల్లాడిపోయిన ప్రయాణికులు ఆందోళనకు దిగడంతో రైలుని కొండ్రపోలు తీసుకొచ్చి నిలిపారు. గంట, అరగంటలో రూట్‌ క్లియర్‌ అవుతుందని రైల్వే ఆపరేటింగ్‌ వర్గాలు ఏమార్చాయి. 11 గంటల ఆలస్యంగా నడుస్తున్న సంత్రగచి - సికింద్రాబాద్‌ స్పెషల్‌ ట్రైన్‌ గూడ్స్‌ పట్టాలు తప్పడం వల్ల మరింత ఆలస్యమయ్యే పరిస్థితి ఉత్పన్నమైంది. నరసపూర్‌ - లింగంపల్లి నరసపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ని గంట ఆలస్యంగా రీషెడ్యూల్‌ చేశారు.

రాత్రి 7.30 గంటలకు ఫిట్‌నెస్‌ జారీ

పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలుని తిరిగి పట్టాల మీదకు తీసుకొచ్చి ముందుకు తీసుకెళ్లిన అనంతరం రైల్వే మెకా నికల్‌ వర్గాలు ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించాయి. అన్ని సరి చూసుకుని వేగపరిమితిని అమలు చేసి రూట్‌ కి ఫిట్‌నెస్‌ జారీ చేశాయి. దాంతో రాత్రి 7.30 గంటల తర్వాత తొలుత శబరి ఎక్స్‌ప్రెస్‌ బయలుదేరి వచ్చింది. అలానే నడికుడి వైపు నుంచి జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ వెళ్లింది. ఆ తర్వాత నెమ్మదిగా ఒక్కో రైలుకి క్లియరెన్స్‌ ఇచ్చి పంపారు.

Updated Date - May 27 , 2024 | 12:13 AM