విధుల భారం
ABN , Publish Date - May 17 , 2024 | 12:32 AM
ఎన్నికల విధుల్లో పాల్గొన్న సిబ్బందికి ఈసారి అధికారులు చుక్కలు చూపించారు. ఉమ్మడి జిల్లాలోని 17 అసెంబ్లీ, మూడు పార్లమెంట్ నియోజకవర్గాల ఎన్నికల కోసం దాదాపు 15 వేల మందికిపైగా సిబ్బందికి ఎన్నికల సంఘం విధులు కేటాయించింది. ఇందులో టీచర్లు, లెక్చరర్లుకు పీవో, అసిస్టెంట్ పీవో విధులు కేటాయించగా, ఇతర సిబ్బందికి వోపీవో బాధ్యతలు అప్పగించారు. ఇక ఏఎన్‌ఎంలు, అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు, పారిశుధ్య సిబ్బంది, ఆశావర్కర్లతో పాటు అనేక మందిని రిజర్వు సిబ్బందికి విధులు కేటాయించారు.
విధుల బడలికతోనే ఎన్నికల సిబ్బంది
36 గంటలపాటు నిర్విరామంగా విధులు
చెల్లింపుల్లో పక్షపాత వైఖరి
గుంటూరు(విద్య),మే16: ఎన్నికల విధుల్లో పాల్గొన్న సిబ్బందికి ఈసారి అధికారులు చుక్కలు చూపించారు. ఉమ్మడి జిల్లాలోని 17 అసెంబ్లీ, మూడు పార్లమెంట్ నియోజకవర్గాల ఎన్నికల కోసం దాదాపు 15 వేల మందికిపైగా సిబ్బందికి ఎన్నికల సంఘం విధులు కేటాయించింది. ఇందులో టీచర్లు, లెక్చరర్లుకు పీవో, అసిస్టెంట్ పీవో విధులు కేటాయించగా, ఇతర సిబ్బందికి వోపీవో బాధ్యతలు అప్పగించారు. ఇక ఏఎన్‌ఎంలు, అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు, పారిశుధ్య సిబ్బంది, ఆశావర్కర్లతో పాటు అనేక మందిని రిజర్వు సిబ్బందికి విధులు కేటాయించారు. ఈనెల 13న జరిగి ఎన్నికల ఒకరోజు ముందే పంపిణీ కేంద్రాల నుంచి ఈవీఎంలు, ఇతర సామగ్రి తీసుకుని తమకు కేటాయించిన బూత్‌లకు సిబ్బంది వెళ్ళారు. అప్పటి నుంచి వారు తీవ్రస్థాయిలో ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. కొన్నిచోట్ల పోలింగ్ రాత్రి వరకు కొనసాగింది. సామగ్రిని తిరిగి స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించడానికి 13వ తేదీ అర్ధరాత్రి వరకు పట్టింది. ఇక ఎన్నికల చెల్లింపులు ఇతర లాంఛనాలు పూర్తయ్యేసరికి 14వ తేదీ ఉదయం అయింది. అంటే దాదాపు 36 గంటల పాటు ఎన్నికల విధుల్లో సిబ్బంది పాల్గొన్నారు. దీంతో వయసు ఎక్కువ ఉన్న సిబ్బంది అనేక మంది తీవ్ర ఒత్తిడికి, బడలికకు గురయ్యారు. అనేక మందికి ఆరోగ్య సమస్యలు ఉండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పోలింగ్‌లో పాల్గొన్న సిబ్బంది కనీస మౌలిక వసతులు కల్పిచ లేదనే ఆరోపణలు ఉన్నాయి. అనేక ప్రాంతాల్లో మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొ న్నారు.
గుంటూరులోని ఏసీ కళాశాలలో రిజర్వు సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రానికి ఆదివారం గుంటూరు నగరంతోపాటు జిల్లాలో బాపట్ల, పొన్నూరు, తాడికొండ తదితర ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో రిజర్వు సిబ్బందిని ఆర్వో రప్పించారు. టీచర్లతోపాటు అంగన్‌వాడీ టీచర్లు, ఇతర శాఖల సిబ్బంది ఉన్నారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో అరకొరగా భోజనం పెట్టి వారి పట్టించుకోవడం మరిచిపోయారు. దాదాపు 400 మందికిపైగా ఉన్న రిజర్వు సిబ్బంది సాయంత్రం వరకు కనీసం మంచినీరు కూడా లేకుండా కేంద్రంలో ఎదురు చూడాల్సి వచ్చింది. అనేక కేంద్రాల్లో సాయం త్రం 5 గంటలకే రిజర్వు సిబ్బందిని ఇంటికి పంపి మరుసటిరోజు అవసరాన్ని బట్టి విధులు కేటాయిస్తాని చెప్పారు. అయితే ఏసీ కళాశాలలో మాత్రం రాత్రి 8 గంటలైనా సిబ్బంది డ్యూటీలు కేటాయించ లేదు. తీరా రాత్రి 8.30 వచ్చిన ఎన్నికల అఽధికారులు మీరు ఇప్పుడు ఇంటివెళ్ళి మరలా ఉదయం 6 గంటల కల్లా రావాలని హుకుం జారీ చేశారని సిబ్బంది వాపోయారు. దీంతో సిబ్బంది తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేశారు.
సార్వత్రిక ఎన్నికల విధుల్లో పాల్గొన్న సిబ్బందికి చెల్లించే రెమ్యూనరేషన్ చెల్లింపులో తీవ్రస్థాయిలో తేడాలు ఉంటున్నాయని సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఒక నియోజక వర్గంలో సిబ్బందికి చెల్లించిన రెమ్యూరేషన్‌లో మరో నియోజక వర్గంలో సిబ్బందికి చెల్లించిన రెమ్యూరేషన్‌లో తేడాలపై తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజక వర్గాల్లో పీవో, పీఈవోలకు రూ.2050, వోపీవో లకు రూ.750 చెల్లించారు. అదే విధంగా తాడికొండ, పొన్నూరు, పత్తిపాడు, తెనాలి నియోజక వర్గాల్లో పాల్గొన్న పీవో, ఏపీవోలకు రూ.1750, వోపివోలకు రూ.500 చెల్లించారు. దీంతో పీవో, ఏపీవో స్థాయిలో చెల్లింపుల విషయంలో రూ.300, వోపీవో స్థాయిలో చెల్లింపుల విషయంలో రూ.250 వరకు తేడాలు ఉన్నాయని ఎన్ని కల విధుల్లో పాల్గొన్న సిబ్బంది వాపోతున్నారు. ఉమ్మడి జిల్లాలో అనేక నియోజక వర్గాల్లో ఇదే విధంగా తేడాలు ఉన్నాయని ఎన్నికల సిబ్బంది వాపోతున్నారు.
తీవ్ర ఒత్తిడిలో విధుల్లో పాల్గొన్నా...
ఎన్నికల విధుల్లో పాల్గొన్న సిబ్బంది పోలింగ్‌కు ఒకరోజు ముందే కేంద్రాలకు చేరుకున్నారు. పోలింగ్ ముగిసిన తరువాత ఎన్నికల సమాగ్రి స్టాంగ్ రూమ్‌లో అప్పగించే వరకు విధుల్లో కొనసాగారు. దీంతో ప్రతిస్థాయిలోనూ తీవ్ర ఒత్తిడితో పని చేశామని చెబుతున్నారు. తీరా తాము పడిన శ్రమకు ప్రతిఫలం లేకుండా ప్రభుత్వం వ్యవహారిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు. జిల్లాలో దాదాపు 15 వేల మందికి పైగా సిబ్బంది నేరుగా ఎన్నికల విధుల్లో పాల్గొనగా, పరోక్షంగా మరో 5వేల మంది విధుల్లో పాల్గొన్నారని ఉపాధ్యాయ సంఘాల నాయకులు చెబుతున్నారు. ఇలా చిత్తశుద్దితో విధులు నిర్వర్తించిన వారిపట్ల పక్షపాత వైఖరి తగదని, అందరికి ఒకే స్థాయిలో చెల్లంపులు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.