Share News

డ్రోన్‌ నిఘా నీడలో మాచర్ల

ABN , Publish Date - Jun 04 , 2024 | 12:12 AM

సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌ రోజైన మంగళవారం మాచర్ల నియోజకవర్గంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా డ్రోన్‌ కెమెరాతో మాచర్ల పట్టణాన్ని జల్లెడ పట్టనున్నారు.

 డ్రోన్‌ నిఘా నీడలో మాచర్ల
సిద్ధంగా ఉన్న డ్రోన్‌ను పరిశీలిస్తున్న పోలీసులు

మాచర్ల రూరల్‌, జూన్‌ 3: సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌ రోజైన మంగళవారం మాచర్ల నియోజకవర్గంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా డ్రోన్‌ కెమెరాతో మాచర్ల పట్టణాన్ని జల్లెడ పట్టనున్నారు. పట్టణ పరిఽధిలో ఏ మూలన ఏం జరిగినా పసిగట్టేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 80 మీటర్ల ఎత్తులో ఈ డ్రోన్‌లో తిరుగుతూ ఫోటోలు, వీడియోలు తీస్తూ ఎప్పటికప్పుడు సమాచారం అందించనుంది. సోమవారం పట్టణంలోని సెయింట్‌ ఆన్స్‌ ఇంగ్లీష్‌ మీడియం స్కూల్‌లో పట్టణ సీఐ బొప్పన బ్రహ్మయ్య ఆధ్వర్యాన డ్రోన్‌ ట్రయిల్‌ రన్‌ నిర్వహించారు. అలాగే పట్టణంలో వజ్ర వాహనం సిద్ధంగా ఉంచారు. ఊహించని పరిణామాలు జరిగి అదుపు చేయాల్సి వస్తే వజ్ర వాహనం ద్వారా స్పోక్‌ గన్స్‌, రబ్బర్‌ బుల్లెట్లు, వీడియోగ్రఫీ ద్వారా చర్యలు చేపట్టనున్నారు. అలాగే ఆక్టోపస్‌, సీఆర్‌పీఎఫ్‌, స్పెషల్‌ పార్టీ, సివిల్‌ పోలీసు బలగాలు సుమారు 1000 మంది దాకా అందుబాటులో ఉన్నాయి. ఒక ఏఎస్సీస్థాయి అధికారితోపాటు నలుగురు డీఎస్పీలు, పది మంది సీఐలు, 20 మంది ఎస్‌ఐలు నిరంతరం నిఘా పర్యవేక్షించనున్నారు.

కారంపూడి: కారంపూడి పట్టణమంతా సీసీ కెమెరా నిఘాలో ఉందని ఎస్‌ఐ అమీర్‌ అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ కౌంటింగ్‌ రోజైన మంగళవారం ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 144 సెక్షన్‌తోపాటు 30 యాక్ట్‌ అమలు చేస్తున్నామన్నారు. నలుగురు అంతకంటే ఎక్కువగా గుమికూడవద్దన్నారు. సోమవారం రాత్రి నుంచి మంగళవారం రాత్రి వరకు కారంపూడి పట్టణంలో రెస్టారెంట్లు, హోటళ్లు, లాడ్జీలు మూసివేయాలన్నారు. పట్టణంలో బహిరంగ భోజనాలు, సంబరాలు చేయకూడదన్నారు. లాడ్జిల్లో, కల్యాణ మండపాల్లో వేరే ప్రాంతాలకు చెందిన వ్యక్తులు ఉండకూడదన్నారు. రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం, బాణాసంచా కాల్చడం చేయవద్దన్నారు. నిబంధనలు పాటించకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Updated Date - Jun 04 , 2024 | 12:12 AM