Share News

లీకులతో తాగునీరు వృథా

ABN , Publish Date - May 27 , 2024 | 12:45 AM

తాగునీరు సక్రమంగా అందక అనేక మంది ఇబ్బందులు పడుతుంటే.. ఉన్న నీటిని సక్రమంగా సరఫరా చేయక అధికారులు వృథా చేస్తున్నారు. నీటి పారుదల వ్యవస్థ సక్రమంగా లేక పోవడంతో లీకులతో నీరంతా వృథా అవుతున్నా అధికారులకు పట్టడంలేదనేందుకు ఆదివారం స్థానిక సంజీవయ్యనగర్‌ గేట్‌ వద్ద లీకును చూస్తే అర్థమవుతోంది.

లీకులతో తాగునీరు వృథా
తాత్కాలిక మరమ్మతులు అంటూ వాల్‌పై పెట్టిన బండరాయి

తాత్కాలిక మరమ్మతులని రాళ్లు పెట్టిన అధికారులు

రెండు రోజులుగా పట్టించుకోని ఇంజనీరింగ్‌ యంత్రాంగం

గుంటూరు(కార్పొరేషన్‌), మే 26: తాగునీరు సక్రమంగా అందక అనేక మంది ఇబ్బందులు పడుతుంటే.. ఉన్న నీటిని సక్రమంగా సరఫరా చేయక అధికారులు వృథా చేస్తున్నారు. నీటి పారుదల వ్యవస్థ సక్రమంగా లేక పోవడంతో లీకులతో నీరంతా వృథా అవుతున్నా అధికారులకు పట్టడంలేదనేందుకు ఆదివారం స్థానిక సంజీవయ్యనగర్‌ గేట్‌ వద్ద లీకును చూస్తే అర్థమవుతోంది. నగరపాలక సంస్థ ఇంజనీరింగ్‌ అధికారుల నిర్లక్ష్యానికి ఈ లీకు నిదర్శనంగా కనిపిస్తోందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందరికో దాహార్తి తీర్చాల్సిన నీటిని డ్రెయినేజి పాలు చేస్తున్నారు. ఈ లీకు గురించి ఎవరూ పట్టించుకోకపోతే మాకేం తెలియదు అన్నట్లుగా ఉండేవారేమో కానీ సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడం.. కమిషనర్‌ కీర్తి ఆదేశాలు జారీ చేసినా లీకులను అరికట్టేందుకు అధికారులు ప్రయత్నించలేదు. యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని కమిషనర్‌ ఆదేశించినా తాత్కాలికంగా మరమ్మతులు అంటూ లీక్‌ అవుతున్న పైప్‌లైన్‌ పై బండరాళ్లతో సరిపెట్టారు. అయినా పెద్దఎత్తున నీరు డ్రెయినేజిలో కలుస్తుంది. నగరంలోని హెచ్‌ఎల్‌ఆర్‌, శారదాకాలనీ రిజర్వాయర్లకు తాగునీటి సరఫరా చేసే ప్రధాన పైపులైనపై సంజీవయ్యనగర్‌ రైల్వే గేట్‌ వద్ద ఎయిర్‌ వాల్‌పై రెండు రోజుల క్రితం భారీ లీక్‌ ఏర్పడింది. ఇంజనీరింగ్‌ అధికారులు పట్టించుకోలేదు. ఆదివారం అక్కడ పిల్లలు జలకాలాటలు చేస్తుండగా కొందరు వీడియో తీసి సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేశారు. ఇది వైరల్‌గా మారింది. దీంతో కమిషనర్‌ లీకులకు మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అయితే మరమ్మతులు చేపట్టకుండా ఆ ప్రాంతంలోని బండరాయిని వాల్‌ లీకుపై పెట్టి వెళ్లారు. నీటి వృథాను మాత్రం అరికట్టలేకపోయారు.

Updated Date - May 27 , 2024 | 12:45 AM