ఐదేళ్లుగా దోపిడీదారుల చేతిలో పొన్నూరు నియోజకవర్గం బందీ
ABN , Publish Date - May 12 , 2024 | 01:27 AM
గడిచిన ఐదేళ్లుగా పొన్నూరు నియోజకవర్గం దోపిడీదారుల చేతిలో బందీగా మారిందని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ధూళిపాళ్ళ నరేంద్రకుమార్ ఆరోపించారు.

కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ధూళిపాళ్ళ నరేంద్రకుమార్
పొన్నూరు టౌన్, మే 11: గడిచిన ఐదేళ్లుగా పొన్నూరు నియోజకవర్గం దోపిడీదారుల చేతిలో బందీగా మారిందని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ధూళిపాళ్ళ నరేంద్రకుమార్ ఆరోపించారు. శనివారం టీడీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో నరేంద్ర కుమార్ మాట్లాడుతూ 2024 ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ దశ, దిశ మార్చనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ఐదేళ్లుగా జగన్ విధ్వంసంతో పాటు దోపిడీ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు ఓట్ల రూపంలో ఉద్యమించనున్నట్లు చెప్పారు. కూటమి పార్టీలు త్వరలోనే కొత్త ప్రభుత్వంగా రాబోతున్నారని స్పష్టమైందన్నారు. అధికారాన్ని ఉపయోగించుకుని కొంతమంది చీఫ్ సెక్రటరీ లాంటి అధికారులు ప్రజలను ఇబ్బంది పెట్టాలని చూశారని ఆరోపించారు. 1.5లక్షల మంది ఉద్యోగులు ఉన్నప్పటికీ ఇంటింటికి పింఛను ఇవ్వకుండా వృద్ధులను తీవ్రంగా ఇబ్బంది పెట్టారని ఆరోపించారు. ప్రజలు జగన్ రెడ్డిని ఇంటికి పంపించటానికి సంసిద్ధమయ్యారని పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయాలతో బడుగులు సంక్షేమ పథకాలు అందని అనాథలుగా మారిపోయారన్నారు. పొన్నూరు నియోజకవర్గం ఐదేళ్లుగా దోపిడీదారుల చేతిలో బందీగా మారిందని ధ్వజమెత్తారు. నియోజకవర్గంలో ప్రజలకు అవసరమైన రహదారులు, తాగునీరు వంటి మౌలిక వసతులు కూడా పాలకులు కల్పించలేకపోయారని ఆరోపించారు. పొన్నూరుకు కొత్తగా కరకట్ట కమల్ హాసన్‌కు మించిన నటుడు వచ్చాడని అంబటి మురళీని ఉద్దేశించి ఎద్దేవా చేశారు. ఇష్టారీతిగా మాట్లాడుతున్న అంబటి మురళి భాగోతాలను ప్రజలముందు ఉంచామన్నారు. సత్తెనపల్లిలో రాజ్యాంగేతర శక్తిగా మారి కొండలు, గుట్టలు కనుమరుగు చేశారని ఆరోపించారు. రూ.2.60 కోట్ల డ్వాక్రా మహిళల రుణాలను తీసుకున్నట్లు అంబటి మురళి అఫిడవిట్ స్పష్టం చేస్తుందన్నారు. సత్తెనపల్లిలో ఓ డాక్టర్ భార్యను లైంగికంగా వేధించి చెరబట్టారని మీడియాలో వచ్చిన కథనాలను ప్రదర్శించామన్నారు. ప్రజల ముందు ఉంచిన తమ ఆరోపణలకు ఒక్క దానికి కూడా అంబటి మురళి ఎందుకు నోరు విప్పలేదని నరేంద్ర కుమార్ ప్రశ్నించారు. అంబటి మురళి భజరంగ్ ఫౌండేషన్‌లో ఆయన పెట్టుబడి లక్ష మాత్రమేనని ఎందుకు చెప్పటం లేదని ప్రశ్నించారు. కరోనా సమయంలో భజరంగ్ ఫౌండేషన్‌లో ఉన్న గ్రీన్ ప్రాజెక్ట్స్‌కు సబంధించిన మార్వాడి మరణించాడని ఆ తర్వాత ఆ ప్రాజెక్టును అంబటి మురళి కబ్జాచేసారని ఆరోపించారు. అంబటి మురళి తన కుటుంబం గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. కుటుంబాలనే చూడని వాడు ప్రజల భాగోగులు ఏంచూస్తాడని నిలదీశారు. ప్రజలు తెలియజేసిన ప్రతి సమస్య గురించి నివేదికలు రూపొందించుకుని మ్యానిఫెస్టో రూపంలో సమస్యల పరిష్కారానికి కృషి చేయనున్నట్లు చెప్పారు. సమావేశంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
మామిళ్లపల్లిలో నరేంద్ర ప్రచారం
పొన్నూరు టౌన్, మే 11: మే 13వ తేదీ వచ్చే ఓట్ల సునామీతో జూన్ 4న కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడుతుందని టీడీపీ అభ్యర్థి ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ స్పష్టం చేశారు. శనివారం చివరి రోజు మండల పరిధిలోని మామిళ్లపల్లిలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ సుడిగాలి పర్యటన చేశారు. గ్రామంలో రోడ్ షోతో పాటు ఇంటింటికి వెళ్లి ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి నరేంద్రకుమార్ మాట్లాడుతూ మామిళ్లపల్లి గ్రామంతో ధూళిపాళ్ళ కుటుంబానికి విడదీయరాని అనుబంధం ఉందన్నారు. కులమత రాజకీయాలకు అతీతంగా గ్రామాన్ని అభివృద్ధి చేశామని గుర్తుచేశారు. గ్రామంలో ప్రధాన రహదారి నిర్మాణంతోపాటు, మురుగు కాల్వల నిర్మాణాని టీడీపీ హయాంలో చేపట్టినట్లు చెప్పారు. తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల అభ్యునతికి పాటుపడే పార్టీగా పేర్కొన్నారు. బీసీలు అభ్యున్నతి కోసం గత తెలుగుదేశం ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషిచేసినట్లు చెప్పారు. వైసీపీ పాలనలో అన్నివర్గాలు నిరాదరణకు గురయ్యారని ఆరోపించారు. వివక్షతకు తావులేకుండా ప్రజా సంక్షేమం జరగాలంటే కూటమి అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో జనసేన సమన్వయకకర్త వడ్రాణం మార్కండేయ బాబుతో కలిసి పలు గృహాలకు వెళ్లి పరామర్శించారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.