ప్రవేశాలకు.. ప్రతిబంధకాలు
ABN , Publish Date - Jun 23 , 2024 | 12:20 AM
డిగ్రీ కళాశాలలు పలు కోర్సులతో వేలసంఖ్యలో విద్యార్థులతో కళకళలాడేవి. ఇంజనీరింగ్ తదితర ఎన్నో కోర్సులు వచ్చినా డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు డిమాండ్ తగ్గేది కాదు. సామాజిక చైతన్య కేంద్రాలుగా డిగ్రీ కళాశాలలు విలసిల్లేవి. విద్యావేత్తలు, ప్రభుత్వాలు కూడా డిగ్రీ కళాశాలలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చేవి. అయితే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తీసుకున్న అసంబద్ధ నిర్ణయాలు డిగ్రీ కళాశాలల పాలిట శాపాల్లా మారాయి.
గుంటూరు(విద్య), జూన్ 22: డిగ్రీ కళాశాలలు పలు కోర్సులతో వేలసంఖ్యలో విద్యార్థులతో కళకళలాడేవి. ఇంజనీరింగ్ తదితర ఎన్నో కోర్సులు వచ్చినా డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు డిమాండ్ తగ్గేది కాదు. సామాజిక చైతన్య కేంద్రాలుగా డిగ్రీ కళాశాలలు విలసిల్లేవి. విద్యావేత్తలు, ప్రభుత్వాలు కూడా డిగ్రీ కళాశాలలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చేవి. అయితే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తీసుకున్న అసంబద్ధ నిర్ణయాలు డిగ్రీ కళాశాలల పాలిట శాపాల్లా మారాయి. ఒకప్పుడు ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఫలానా కాలేజీలో డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్లు పొందడం అంటే ఓ ఘనతగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భావించేవారు. అయితే వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కారణంగా విద్యార్థుల ప్రవేశాలు సరిగా లేక ఆయా కళాశాలలు ధైన్యస్థితికి చేరాయి. వందేళ్ల చరిత్ర ఉన్న పలు డిగ్రీ కళాశాలల్లో గతంలో బీఎస్సీ, బీకాం, బీఏ, బీబీఏ, బీసీఏ వంటి డిగ్రీ కోర్సులకు ఎంతో డిమాండ్ ఉండేది. ఫలితంగా విద్యార్థులతో కళకళలాడిన డిగ్రీ కళాశాలలు నేడు విద్యార్థుల లేక వెలవెలపోతున్నాయి. గత వైసీపీ ప్రభుత్వ అసంబద్ధ నిర్ణయాలు, జాతీయ విద్యా విధానం పేరుతో తీసుకువచ్చిన అనేక సంస్కరణలు డిగ్రీ కళాశాలలకు గుదిబండగా మారడంతో ఈ దుస్థితి నెలకొందని అధ్యాపకులు వాపోతున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో మూడు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, 20 వరకు ఎయిడెడ్ డిగ్రీ కళాశాలలు ఉండగా అరకొర అడ్మిషన్లతో నెట్టుకువస్తున్నాయి. డిగ్రీ అడ్మిషన్లకు సంబంధించి నోటిషికేషన్ ఇవ్వడంలో కూడా ప్రభుత్వం తాత్సారం చేస్తోంది. దీంతో ఎక్కడా చేరలేకపోయిన వారు, సప్లమెంటరీ విద్యార్థులు మాత్రమే డిగ్రీ కళాశాలల్లో చేరుతున్నారు. మెరిట్ విద్యార్థులు ఇతర వర్సిటీలకు తరలిపోతున్నారు. గతంలో ఒక్కో కళాశాలలో సగటున వెయ్యి నుంచి 2 వేల మంది విద్యార్థులు ఉండేవారు. గతంలో ఇంటర్ ఫలితాలు రాగానే డిగ్రీ అడ్మిషన్లు ప్రారంభమయ్యేవి. అయితే రెండేళ్ల నుంచి వైసీపీ ప్రభుత్వం ఆన్‌లైన్ అడ్మిషన్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇది గందరగోళంగా మారడంతో విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. ఆ నోటిఫికేషన్ కూడా ఎప్పుడు వస్తుందో తెలియక గ్రామీణ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఇంటర్ సప్లిమెంటరీలో పాస్ అయిన వారికి అనేక కళాశాలల్లో సీట్లు రావడం లేదు. డిగ్రీ కోర్సులకు ప్రభుత్వం సగటున రూ.12 వేల నుంచి రూ.18 వేల వరకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇస్తోండగా అది ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. అనేక మంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ సక్రమంగా చెల్లించడం లేదు. దీంతో చివరి రెండు, మూడు సంవత్సరాల్లో విద్యార్థులు భారీ సంఖ్యలో డ్రాపవుట్స్ అవుతున్నారు. ఒకప్పుడు విద్యార్థినులతో కళకళాడిన గుంటూరులోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో సైతం అడ్మిషన్లకు ఇక్కట్లు వస్తున్నాయి. ఈ ఏడాదిలో ఇంటర్ ఫలితాలు విడుదలై రెండు నెలలు గడుస్తున్నా ఇంకా డిగ్రీ కళాశాలల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ రాలేదు. ఈ ఏడాది ఆన్‌లైన్‌లోనా లేక ఆఫ్‌లైన్‌లో అడ్మిషన్లు చేస్తారో తెలియక విద్యార్థులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.
నూతన విద్యా విధానంతో గందరగోళం
డిగ్రీలో నూతన విద్యావిధానం ప్రకారం మేజర్ మైనర్ కోర్సులంటూ ప్రవేశ పెట్టారు. ఉదాహరణకు బీఎస్సీ(గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ) తీసుకుంటే ఇందులో గణితం మేజర్ సబ్జెక్టుగా ఫిజిక్స్, కెమిస్ట్రీ మైనర్ సబ్జెక్టులుగా ప్రాధాన్యం లేని విధంగా ఉంటున్నాయి. మూడేళ్లలో గణితానికే అధిక ప్రాధాన్యం ఇస్తూ మైనర్ సబ్జెక్టుల గురించి పట్టించుకోవడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. ఫలితంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు భారీగా గండికొట్టినట్లు అవుతుందని అధ్యాపకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాతపద్ధతిలో మూడు సబ్జెక్టులకు సమప్రాధాన్యం, సమానమైన మార్కులు ఉండేవి కొత్త విధానంలో అటువంటి పరిస్థితి లేదు.
జీవో 77తో పీజీ కోర్సులకు చెక్
డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఎక్కువ మంది పీజీ కోర్సుల వైపు దృష్టిసారిస్తారు. అయితే గత ప్రభుత్వం జీవో 77 తీసుకువచ్చి పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వడం లేదు. గతంలో పీజీ విద్యార్థులకు రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు రీయింబర్స్‌మెంట్ చెల్లించేవారు. జగన్ ప్రభుత్వం పీజీ కోర్సులకు రీయింబర్స్‌మెంట్ కట్ చేసింది. ఫలితంగా డిగ్రీ చదివిన అనేక మంది పీజీ కోర్సుల్లో చేరడం లేదు. కొద్దిగా డబ్బున్న కుటుంబాల విద్యార్థులకు మాత్రమే ప్రస్తుతం ఫీజీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
త్వరలో లోకేశ్‌తో ఆక్టా భేటీ
ఉమ్మడి జిల్లాలో ఇటీవల ఆక్టా(అఫ్లియేటెడ్ కాలేజేస్ టీచర్స్ అసోసియేషన్) నాయకులు త్వరలో విద్యామంత్రి లోకేశ్‌తో భేటీ కావాలని నిర్ణయించారు. డిగ్రీ కళాశాలల్లో ఆన్‌లైన్ అడ్మిషన్లు, జీవో 77, మేజర్, మైనర్ కోర్సులు గురించి యువగళం పాదయాత్రలో లోకేశ్‌కు సంఘ నాయకులు వివరించారు. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం గతంలో తమకు హామీ ఇచ్చిన లోకేశ్ విద్యాశాఖ మంత్రి కావడంతో ఆయన ఆయా అంశాలపై సానుకూలంగా స్పందిస్తారని, సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉందని ఆక్టా నాయకులు, ఏసీ కళాశాల ప్రిన్సిపాల్ కొమ్మాలపాటి మోజేస్ ఆశాభావం వ్యక్తం చేశారు.