Share News

అల్లర్ల వెనుక వైసీపీ

ABN , Publish Date - May 20 , 2024 | 12:40 AM

రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న అల్లర్లు వెనుక వైసీ ప పాత్ర ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ వ్యాఖ్యానించారు.

అల్లర్ల వెనుక వైసీపీ
మాట్లాడుతున్న కే నారాయణ, పాల్గొన్న ముప్పాళ్ల తదితరులు

గుంటూరు(తూర్పు), మే19: రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న అల్లర్లు వెనుక వైసీ ప పాత్ర ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ వ్యాఖ్యానించారు. ఆదివారం, గుంటూరు కొత్తపేట మల్లయ్య లింగం భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓటమిని ఊహించి వైసీపీ నాయకులు ఈ దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా మారిపోయారన్నారు. రాష్ట్రంలో ఏర్పాటు చేసిన సిట్‌తో ఎటువంటి ఉపయోగం ఉండదన్నారు. ఫలితాలు వరకు విచారణ సాగదీసి, గెలిచిన పార్టీ చెప్పినట్టు నివేదికను రూపొందిస్తారని విమర్శించారు. కేవలం జగన్‌ వైఫల్యాల వల్లనే కూటమి అధికారంలోకి వస్తుందే తప్ప బీజేపీ వల్ల కాదన్నారు. ప్రజావేదిక కూల్చివేతతో పాటు అనేక ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో జగన్‌ ఓటమి పాలవుతున్నాడన్నారు. టిడ్కో ఇళ్లు పంపిణీ చేయకపోవడం దారుణమన్నారు. ఎదురుకాళ్లతో పుట్టాడేమో.. అందుకే జగన్‌ రివర్స్‌ పాలన చేశాడని ఘాటుగా విమర్శించారు. యువత, మహిళలు, ఉద్యోగులు వెనుక ఉండటంతో చంద్రబాబు అధికారంలోకి వస్తున్నాడని స్పష్టం చేశారు. అలాగే కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని జోస్యం చెప్పారు.

సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ కౌంటింగ్‌ ప్రకియకు ముందే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డిని అ పదవి నుంచి తొలగించాలన్నారు. లేదంటే ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేస్తాడని ఆరోపించారు. వైసీపీ నాయకులు పిన్నెల్లి సోదరుల వల్లే పల్నాడులో అశాంతి నెలకొన్నదన్నారు. తక్షణమే పిన్నెల్లి సోదరులను అదుపులోకి తీసుకోవాలన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ సమర్ధంగా పనిచేయాలన్నారు. జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్‌ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో సహకరించిన ప్రజలకు, ఇండియా కూటమి కార్యకార్తలకు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో కోటా మాల్యాద్రి. మేడా హనుమంతురావు, నాసర్‌జీ, వలి, అకిటి అరుణ్‌ కుమార్‌, రావుల అంజిబాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 20 , 2024 | 12:40 AM