Share News

పక్కాగా.. లెక్కింపు

ABN , Publish Date - May 22 , 2024 | 12:43 AM

రిటర్నింగ్‌, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులు ఎన్నికల కమిషన్‌ నియమ నిబంధనలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి ఎం.వేణుగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు.

పక్కాగా.. లెక్కింపు
సమావేశంలో పాల్గొన్న కలెక్టర్‌, జేసీ, కమిషనర్‌ తదితరులు

గుంటూరు, మే 21(ఆంధ్రజ్యోతి): రిటర్నింగ్‌, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులు ఎన్నికల కమిషన్‌ నియమ నిబంధనలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి ఎం.వేణుగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్‌ శంకరన్‌ సమావేశ మందిరంలో మంగళవారం ఉదయం ఆర్‌ఓలు, ఏఆర్‌ఓలు, నోడల్‌ అధికారులతో ఎన్నికల కౌంటింగ్‌, పోస్టల్‌ బ్యాలెట్‌, ఈవీఎంలపై శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ముందుగా పోస్టల్‌ బ్యాలెట్స్‌, సర్వీస్‌ ఓట్లు లెక్కించడం జరుగుతుందని, ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాల ప్రకారం పోస్టల్‌ బ్యాలెట్‌ ప్రీ కౌంటింగ్‌లో వ్యాలిడ్‌, ఇన్‌వ్యాలిడ్‌ ఓట్లు ఎలా వేరు చేయాలో వివరించారు. లెక్కింపునకు సంబంధించిన సూచనలు ఆర్‌ఓలు, ఏఆర్‌ఓలు అందరూ తప్పక చదవాలన్నారు.

సంయుక్త కలెక్టర్‌ గణియా రాజకుమారి మాట్లాడుతూ ఆర్‌ఓలు, ఏఆర్‌ఓలు పూర్తి బాధ్యత కలిగి ఉండాలన్నారు. గుంటూరు పార్లమెంట్‌, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు నేపధ్యంలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో మూడంచల పోలీసు భద్రత వున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరికీ ఐడి కార్డులు ఉండాలన్నారు. ఏఎన్‌యులో ఏ నియోజకవర్గానికి ఎలా వెళ్లాలో తెలిపే సైన్‌ బోర్డులు ఏర్పాటు చేయాలని, కౌంటింగ్‌ హాల్‌ దగ్గర రిసెప్షన్‌ కౌంటర్‌, హెల్ప్‌డెస్క్‌ ఏర్పాటు చేయాలన్నారు. కౌంటింగ్‌ సిబ్బందికి, హమాలీలకు పార్లమెంట్‌, అసెంబ్లీ కౌంటింగ్‌ హాళ్లకు ఏ రూట్‌లో వెళ్లాలో హెల్ప్‌ డెస్క్‌ల ద్వారా తెలియజేయాలన్నారు. సెల్‌ఫోన్లకు కౌంటింగ్‌హాల్‌లో అనుమతి లేనందున ఉద్యోగులకు, కౌంటింగ్‌ ఏజెంట్లకు, అభ్యర్థులకు సెల్‌ఫోన్ల డిపాజిట్‌ కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. రిజర్వ్‌ టీంలకు ప్రత్యేక హాల్‌ ఏర్పాటు చేయాలన్నారు. కౌంటింగ్‌ ఏజెంట్లకు జాతీయ, రాష్ట్ర, ఇండిపెండెంట్‌ల వారీగా సీట్లు ఏర్పాటు చేయాలన్నారు. లెక్కింపునకు 14 టేబుల్స్‌ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. విద్యుత్‌ అంతరాయం లేకుండా జనరేటర్లు ఏర్పాటు చేయాలన్నారు. మొదటి ర్యాండమైజేషన్‌ నిర్వహించి కౌంటింగ్‌ సిబ్బందికి ఈ నెల 25, 26 తేదీలలో కలక్టరేట్‌లో మొదటి శిక్షణ కార్యక్రమాలు, రెండవ ర్యాండమైజేషన్‌ నిర్వహించి జూన్‌ 3వ తేదీన ఏఎన్‌యూలో రెండవ శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుందన్నారు. మూడవ ర్యాండమైజేషన్‌ నిర్వహించి సిబ్బందికి కౌంటింగ్‌ విధులు కేటాయించడం జరుగుతుందన్నారు. ఎన్నికల పరిశీలకులు సంతకం చేసిన తదుపరి మాత్రమే రౌండ్‌ల వారీగా ఫలితాలు వెల్లడించాల్సి ఉంటుందన్నారు. అనంతరం సర్వీస్‌ ఓటర్లు ఎలక్ర్టోనికల్లీ ట్రాన్స్మిటెడ్‌ పోస్టల్‌ బ్యాలెట్‌ సిస్టమ్‌(ఈటీపిబిఎస్‌) ప్రీ కౌంటింగ్‌పై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్‌ కీర్తి చేకూరి, తెనాలి సబ్‌ కలెక్టర్‌ ప్రఖార్‌ జైన్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌(ట్రైనీ) పవార్‌ స్వప్నిల్‌ జగన్నాధ్‌, డిఆర్‌ఓ పెద్ది రోజా, డిప్యూటీ కలెక్టర్‌ స్వాతి, ఆర్డీవో శ్రీకర్‌, డీఆర్డీయే పీడీ హరిహరనాథ్‌, గుంటూరు పార్లమెంట్‌ నియోజకవర్గ సహాయక రిటర్నింగ్‌ అధికారి భీమారావు, నగరపాలక సంస్థ అదనపు కమిషనర్‌ రాజ్యలక్ష్మి, ఆర్‌వోలు, ఏఆర్‌ఓలు పాల్గొన్నారు.

Updated Date - May 22 , 2024 | 12:43 AM