సమష్ఠి కృషితో సార్వత్రిక ఎన్నికల ప్రశాంతం
ABN , Publish Date - Jun 07 , 2024 | 01:11 AM
ఉద్యోగుల సమష్ఠి కృషి, జిల్లా ప్రజలు అందించిన సంపూర్ణ సహకారంతో బాపట్ల జిల్లాలో సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పి.రంజిత్‌బాషా తెలిపారు.

బాపట్ల, జూన్ 6 : ఉద్యోగుల సమష్ఠి కృషి, జిల్లా ప్రజలు అందించిన సంపూర్ణ సహకారంతో బాపట్ల జిల్లాలో సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పి.రంజిత్‌బాషా తెలిపారు. కలెక్టరేట్‌లో గురువారం ఎస్పీ వకుల్ జిందాల్‌తో కలిసి ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 6 అసెంబ్లీ నియోజకవర్గాలకు, ఒక పార్లమెంట్‌కు మే 13న పోలింగ్ దగ్గర నుంచి జూన్ 4న కౌంటింగ్ ప్రక్రియ వరకు ఎటువంటి ఆటంకాలు లేకుండా సజావుగా, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించామన్నారు. మార్చి 16న ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి జిల్లాలో ఎన్నికల కోడ్ అమలుకు పటిష్ఠమైన చర్యలు తీసుకున్నామన్నారు. ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా 85 సంవత్సరాలు పైబడిన వృద్దులకు, దివ్యాంగులకు హోమ్‌ఓటింగ్ నిర్వహించామన్నారు. తదుపరి ఎన్నికలలో పాల్గొనే సిబ్బందికి, సర్వీస్ ఓటర్లకు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ నిర్వహించామన్నారు. అనంతరం ప్రధాన ఘట్టమైన పోలింగ్‌ను ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించామన్నారు. జిల్లాలో ఎక్కడ రీపోలింగ్ అవసరం లేకుండా విజయవంతంగా పోలింగ్ ప్రకియ పూర్తి చేశామన్నారు. చివరిగా కౌంటింగ్‌కు విస్తృత ఏర్పాట్లు చేసి విజయవంతంగా పూర్తి చేశామన్నారు. దీనికి సహకరించిన పోలీసు అధికారులకు, ప్రభుత్వ ఉద్యోగులకు, పాత్రికేయులకు కృతజ్ఞతలు తెలిపారు. ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ కలెక్టర్ సంపూర్ణ సహకారంతో పోలీసుశాఖలోని హోమ్‌గార్డు స్థాయి ఉద్యోగి నుంచి ఏఎస్పీ వరకు అందరి సమష్ఠి కృషితో జిల్లాలో ఎన్నికల ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా పూర్తి చేశామన్నారు.