Share News

ఛలో మాచర్ల.. హై అలర్ట్‌

ABN , Publish Date - May 24 , 2024 | 12:21 AM

వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టుపై వస్తోన్న కథనాలు.. టీడీపీ ఛలో మాచర్ల నేపథ్యంలో గురువారం పోలీసులు అప్రమత్తమయ్యారు. పోలింగ్‌ రోజు, మరుసటి రోజు మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ మూకల దాడిలో గాయపడిన టీడీపీ నేతల పరామర్శ కోసం గురువారం టీడీపీ ఛలో మాచర్లకు పిలుపిచ్చింది. దీంతో ఉమ్మడి గుంటూరు జిల్లావ్యాప్తంగా పోలీసులు అప్రమత్తమయ్యారు.

ఛలో మాచర్ల.. హై అలర్ట్‌
మాచర్లలో వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులు

144 సెక్షన కొనసాగింపు.. అదుపులో టీడీపీ నేతలు

పరారీలో ఉన్న ఎమ్మెల్యే పిన్నెల్లి కోసం ఎనిమిది బృందాల గాలింపు

పిన్నెల్లి లొంగిపోతారని ప్రచారం.. నరసరావుపేటలో పోలీసుల పహారా

మాచర్ల టౌన, మాచర్ల రూరల్‌, రెంటచింతల, కారంపూడి, దాచేపల్లి, పిడుగురాళ్ల, నరసరావుపేట లీగల్‌, సత్తెనపల్లి, గుంటూరు, మే 23: వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టుపై వస్తోన్న కథనాలు.. టీడీపీ ఛలో మాచర్ల నేపథ్యంలో గురువారం పోలీసులు అప్రమత్తమయ్యారు. పోలింగ్‌ రోజు, మరుసటి రోజు మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ మూకల దాడిలో గాయపడిన టీడీపీ నేతల పరామర్శ కోసం గురువారం టీడీపీ ఛలో మాచర్లకు పిలుపిచ్చింది. దీంతో ఉమ్మడి గుంటూరు జిల్లావ్యాప్తంగా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎక్కడికక్కడ టీడీపీ నేతలు మాచర్లకు రాకుండా నిర్బంధించారు. మాచర్లలో 144 సెక్షన కొనసాగించారు. పట్టణంలో పోలీసులు సీఐ బొప్పన బ్రహ్మయ్య, ట్రైనీ డీఎస్పీ జగదీష్‌ ఆధ్వర్యాన కవాతు నిర్వహించారు. ఛలో మాచర్ల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా దుకాణాలను మూసివేయించారు. రాయవరం జంక్షన, కొత్తపల్లి జంక్షన, రింగురోడ్డు, నెహ్రూనగర్‌, మున్సిపల్‌ కార్యాలయం వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. రెంటచింతల మండల పరిధిలోని పలు గ్రామాలకు సీఆర్‌పీఎఫ్‌ బలగాలు రంగ ప్రవేశం చేశాయి. 11 గ్రామాలతో పాటు తుమృకోటకు శివారు గ్రామమైన కొత్తగంగరాజు పల్లెలో పర్యటించి ఫ్లాగ్‌మార్చ్‌ నిర్వహించారు. కారంపూడిలో 144 సెక్షన కొనసాగుతోంది. పోలీసులు ముందుజాగ్రత్తగా తనిఖీలు చేపట్టారు. దుకాణాలు మూతపడ్డాయి. దీంతో నిత్యం రద్దీగా ఉండే బస్టాండ్‌ సెంటర్‌, నాగులేటి వంతెన తదితర ప్రాంతాలు జనసంచారం లేక నిర్మానుష్యంగా మారాయి. గురజాలలో చెక్‌పోస్టులను ఏర్పాటు చేసిన పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహించారు.

నోటీసులు.. నిర్బంధాలు

పల్నాడులో నెలకొన్న పరిస్థితుల రీత్యా ఎవరూ అటు వెళ్లడానికి వీల్లేదని పోలీసు అధికారులు బుధవారమే హెచ్చరికలు జారీ చేశారు. టీడీపీ నేతలు తలపెట్టిన ఛలో మాచర్ల కార్యక్రమాన్ని పోలీసులు ఉమ్మడి గుంటూరు జిల్లావ్యాప్తంగా ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. టీడీపీ ముఖ్య గురువారం మాచర్ల తరలివెళ్తారనుకున్న టీడీపీ నేతలకు నోటీసులు అందజేశారు. అయినా ముందుజాగ్రత్తగా ఎక్కడికక్కడ నేతలను అదుపులోకి తీసుకున్నారు. మరికొన్ని దగ్గర్ల హౌస్‌అరెస్టులు చేశారు. పోలింగ్‌ అనంతరం నుంచి గుంటూరులో గృహ నిర్బంధంలో ఉన్న మాచర్ల కూటమి అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి ఇంటి వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎన్నికల సందర్భంగా పల్నాడులో చలరేగిన ఘటనలపై టీడీపీ ఏర్పాటు చేసిన కమిటీలో సభ్యులుగా ఉన్న మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఇంటి వద్ద పోలీసులు మోహరించారు. గుంటూరులోని ఆయనకు నోటీసులు అందజేశారు. దీనిపై ఆనందబాబు సీరియస్‌ అయ్యారు. పాల్వాయి గేటు బాధితుడు శేషగిరికి తోడుగా నిలిచిన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావుపై కూడా పోలీసులు దృష్టి సారించారు. గురువారం ఉదయం ఆయన ఇంటి వద్ద పోలీసులు మోహరించి ఆయన ఎటూ వెళ్లకుండా నిర్బంధించారు. అయితే పోలీసుల కన్నుగప్పి ఆయన ఆనందబాబు ఇంటికి చేరుకున్నారు. ఆనందబాబు నిర్బంధించారన్న సమాచారంతో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి చిట్టాబత్తిన చిట్టిబాబు, జడ్పీ మాజీ వైస్‌ చైర్మన వడ్లమూడి పూర్ణచంద్రరావు, నేతలు యాగంటి దుర్గారావు, పాటిబండ్ల బలరాం కోటపాటి రాంబాబు ఆయనింటి వద్దకు చేరుకుని పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో మాచర్లలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు కొమెర దుర్గారావు, తెలుగు యువత జిల్లా కార్యదర్శి కొమెర శివ, బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు మున్నా రాంబాబు, మంజుల అంజి, కంభంపాటి దానంబాబులను పోలీసులు అదుపులోకి తీసుకుని పట్టణ పోలీస్‌స్టేషనకు తరలించారు. పిడుగురాళ్ల పట్టణ, రూరల్‌ పరిధిలో 25 మందికి పైగా నేతలకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. దాచేపల్లి మండలం కేశానుపల్లికి చెందిన నెల్లూరి శ్రీనివాసరావు, టీడీపీ మండల యూత అధ్యక్షుడు షేక్‌ నాయబ్‌ అబ్దుల్లా తదితరులను పోలీసులు హౌస్‌ అరెస్టు చేశారు. గురజాలలో ఎనిమిది మందికి నోటీసులు, ఆరుగురిని హౌస్‌ అరెస్ట్‌ చేసినట్లు సీఐ బాలకృష్ణ తెలిపారు.

ప్రజాస్వామ్యంపై పిన్నెల్లికి గౌరవం లేదు : జూలకంటి

చట్టం, ప్రజాస్వామ్యంపై మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి గౌరవం లేదని జూలకంటి బ్రహ్మారెడ్డి విమర్శించారు. గంటలో మాచర్ల వస్తానన్న ఆయన.. ఇప్పుడెక్కడ దాక్కున్నారని ఎద్దేవా చేశారు. ఆయన పరారీ వెనక సజ్జల వంటి పెద్దల సహకారం ఉందని ఆరోపించారు. పోలీసులు కూడా ఆయన పరారీకి అన్నివిధాలా సహకరించారన్నారు. పాల్వాయి, కేపీగూడెం, మాచర్ల దాడులపై నామమాత్రపు సెక్షన్లతో కేసులేంటని ప్రశ్నించారు. కేపీగూడెంలో టీడీపీ ఏజెంట్లుగా కూర్చున్న గిరిజనుల్ని కొట్టారని తెలిపారు. గాయపడిన వారిని పరామర్శించేందుకు వెళ్తుంటే పోలీసులు తనను అడ్డుకున్నారని మండిపడ్డారు. అతి త్వరలోనే మాచర్ల వెళ్లి బాధితులను కలిసి న్యాయం చేస్తామన్నారు.

పోలింగ్‌ అల్లర్ల కేసుల్లో 67 మంది అరెస్టు : ఎస్పీ

పోలింగ్‌, ఆ తర్వాత జరిగిన అల్లర్ల కేసుల్లో గురువారం 67 మందిని అరెస్టు చేసినట్టు ఎస్పీ మల్లికాగార్గ్‌ గురువారం తెలిపారు. సిట్‌ కేసుల్లో 13 మందిని. ఇతర కేసుల్లో 54 మందిని అరెస్టు చేశామన్నారు. ఎన్నికల నేరాల్లో 9 మందికి 41 నోటీస్‌ ఇచ్చామన్నారు. నరసరావుపేట సబ్‌ డివిజన్లో ఒకరు, సత్తెనపల్లి సబ్‌ డివిజన్లో 46, గురజాల సబ్‌ డివిజన్లో 27 మందిని బైండోవర్‌ చేసినట్లు చెప్పారు. నరసరావుపేట సబ్‌ డివిజన్లో ఐదుగురిపై రౌడీషీట్స్‌ ఓపెన్‌ చేశామన్నారు. బైండోవర్‌ను ఉల్లంఘించిన ఐదుగురికి నోటీసులు ఇచ్చామన్నారు. 102 సీఆర్‌పీసీ కింద కేసు నమోదు చేసి ఓ వాహనాన్ని సీజ్‌ చేసినట్లు తెలిపారు.

Updated Date - May 24 , 2024 | 12:21 AM