Share News

గ్రామాల్లో.. కార్డెన్‌ సెర్చ్‌

ABN , Publish Date - May 20 , 2024 | 12:38 AM

పల్నాడు పోలింగ్‌ విధ్వంసాలపై ఒకవైపు సిట్‌ విచారణ జరుగుతుండగా మరోవైపు పోలీసులు తనిఖీలను కొనసాగిస్తున్నారు.

గ్రామాల్లో.. కార్డెన్‌ సెర్చ్‌
మాచర్ల మండలం కంభంపాడులో సోదాలు నిర్వహిస్తున్న పోలీసులు

మాచర్లటౌన్‌, రెంటచింతల, కారంపూడి, రాజుపాలెం, దుర్గి, బెల్లంకొండ, బొల్లాపల్లి, మే 19: పల్నాడు పోలింగ్‌ విధ్వంసాలపై ఒకవైపు సిట్‌ విచారణ జరుగుతుండగా మరోవైపు పోలీసులు తనిఖీలను కొనసాగిస్తున్నారు. గ్రామాల్లో కార్డెన్‌సెర్చ్‌ నిర్వహించి అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఒకేసారి పెద్దసంఖ్యలో పోలీసులు గ్రామంలోకి రావడంతో గ్రామస్తులు భయాందోళనలకు గురయ్యారు. గ్రామానికి నలువైపులా తనిఖీలు చేపట్టి గ్రామంలో ఉన్న వారిని బయటకు వెళ్లకుండా బయటవారిని గ్రామంలోకి రానివ్వకుండా కార్డెన్‌సెర్చ్‌ నిర్వహించారు. గృహాలు, శిథిలావస్థలో నిరుపయోగంగా ఉన్న గృహాలు, వాముల్లో, కొష్టాల్లో, పొదల్లో సోదాలు చేశారు. ఆదివారం తెల్లవారుజామున జరిపిన కార్డెన్‌సెర్చ్‌లో ఆధారాలు లేని ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనుమానిత ప్రాంతాల్లో నిఘాతో పాటు ఎక్కడికక్కడ పికెట్లలోనూ తనిఖీలు కొనసాగిస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో సమస్యాత్మక గ్రామాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆదివారం తెల్లవారుజామున ప్రత్యేక బలగాలతో మాచర్ల మండలం కంభంపాడులో కార్డెన్‌ సెర్చ్‌ నిర్వహించారు. మారణాయుధాలు, కర్రలు, రాడ్లు, కంకరరాళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టి సోదాలు చేశారు.

- కారంపూడి మండలం పేటసన్నిగండ్లలో సీఐ నారాయణస్వామి ఆధ్వర్యంలో పోలీసులు ఆదివారం కార్డెన్‌ సెర్చ్‌ జరిగింది. మండలంలోని ప్రతి గామాన్ని తనిఖీ చేస్తున్నామని, రికార్డులులేని రెండు బైకులను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. వైసీపీకి చెందిన ఇద్దరు, టీడీపీకి చెందిన ఒకరిని పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి వేర్వేరుగా విచారించి పంపారు.

- రెంటచింతలకు కేంద్ర బలగాలను రప్పించారు. ఇప్పటికే 151 మంది పోలీసులు, ఒక స్ర్టైకింగ్‌ ఫోర్స్‌ బలగాలు ఉన్నాయి. ఎన్నికల ఫలితాల వెల్లడి గడువు సమీపిస్తున్న తరుణంలో ఒక కంపెనీ కేంద్ర బలగాలైన సీఐఎస్‌ఎఫ్‌ ఆదివారం రాత్రి రెంటచింతలకు చేరుకుంది.

- రాజుపాలెం మండలం నెమలిపురి గ్రామంలో ఎస్‌ఐ షామీర్‌బాషా, సిబ్బంది కార్డెన్‌సెర్చ్‌ నిర్వహించారు. గ్రామంలోని ప్రతి ఇంటిని తనిఖీ చేశారు. ఎవరైనా గొడవలకు, దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ తెలిపారు.

- దుర్గి మండలం మించాలపాడులో ఆదివారం సుమారు 45 మంది పోలీసు బృందంతో డీఎస్పీ రామకృష్ణాచారి, ఇద్దరు సీఐలు, ఇద్దరు ఎస్‌ఐలు కార్డెన్‌ సెర్చ్‌ నిర్వహించారు. రికార్డు లేని 11 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ కోటయ్య తెలిపారు.

- బొల్లాపల్లి మండలం పేరూరుపాడు గ్రామంలో బందోబస్తు కొనసాగిస్తున్నారు. ఆదివారం రూరల్‌ సీఐ సుధాకర్‌, ఎస్‌ఐ చెన్నకేశవులు, ఈపూరు ఎస్‌ఐ ఫిరోజ్‌ల ఆధ్వర్యంలో గ్రామంలో కార్డెన్‌ సెర్చ్‌ నిర్వహించారు. గ్రామంలోని ప్రతి ఇంటిని జల్లెడ పట్టారు.

- బెల్లంకొండ మండలం నాగిరెడ్డిపాలెంలో ఆదివారం తెల్లవారుజామున రూరల్‌ సీఐ మంగారావు, ఎస్‌ఐ రాజేష్‌ పర్యవేక్షణలో 40 మంది పోలీసులు కార్డెన్‌ సెర్చ్‌ కార్యక్రమం నిర్వహించారు.

Updated Date - May 20 , 2024 | 12:38 AM