Share News

భయం.. భయం

ABN , Publish Date - May 16 , 2024 | 01:05 AM

పోలింగ్‌ అనంతరం పల్నాడులో వైసీపీ మూకల దాడుల నేపథ్యంలో సామాన్య జనాలు భయం గుప్పిట్లో ఉన్నారు. జిల్లాలోని పలు పట్టణాలు, గ్రామాల్లో బుధవారం అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం నెలకొంది.

భయం.. భయం
నరసరావుపేటలోని గుంటూరు రోడ్డులో ఏర్పాటు చేసిన ఇనుప కంచె

జిల్లాలో కొనసాగుతున్న 144 సెక్షన్‌

పట్టణాల్లో షాపులు మూయించిన పోలీసులు

మాచర్ల, కారంపూడిల్లో అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం

గృహ నిర్బంధంలో ఎమ్మెల్యేలు కాసు, పిన్నెల్లి, గోపిరెడ్డి

సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసు పికెట్లు

పోలింగ్‌ సంఘటనలపై 20 కేసులు నమోదు

మాచర్లటౌన్‌, కారంపూడి, రెంటచింతల, నరసరావుపేట, మే 15: పోలింగ్‌ అనంతరం పల్నాడులో వైసీపీ మూకల దాడుల నేపథ్యంలో సామాన్య జనాలు భయం గుప్పిట్లో ఉన్నారు. జిల్లాలోని పలు పట్టణాలు, గ్రామాల్లో బుధవారం అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. ఇళ్లలో నుంచి జనం బయటకు వచ్చేందుకు భయపడు తున్నారు. వందల సంఖ్యలో చేరిన రౌడీ మూకలు రాడ్లు, కర్రలతో సోమ, మంగళవారాల్లో పలు ప్రాంతాల్లో విధ్వంసాలకు దిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జిల్లా అంతటా 144 సెక్షన్‌ కొనసా గుతుండగా.. ఎక్కడికక్కడ పోలీసు పికెట్లు ఏర్పాటు చేశారు. అయినా ఎప్పుడు ఏమి జరుగుతుందోనని అటు మున్సిపల్‌ పట్టణాలతో పాటు వివిధ గ్రామాల్లో ప్రజలు ఆందోళనలో ఉన్నారు. మంగళవారం రాత్రి నుంచి కొనసా గుతున్న 144 సెక్షన్‌ను తదుపరి ఉత్తర్వులు విడుదల చేసే వరకు అమలుచేస్తామని పోలీ సుశాఖ ప్రకటించింది. మంగళ వారం రాత్రి నుంచి గుంటూరు రేంజ్‌ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి, పల్నాడు ఎస్పీ బిందుమాధవ్‌ మాచర్లలోనే మకాంవేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. నరసరావు పేటలోని గుంటూరు రోడ్డులో ఇనుప కంచెలను ఏర్పాటుచేసి రాకపోకలను నిలిపివేశారు. మాచర్ల, నరస రావుపేట, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, దాచేపల్లి, గురజాల పట్టణాల్లో దుకాణాలను పోలీసులు మూయించారు. 144వ సెక్షన్‌ అమల్లో ఉన్నంత వరకు దుకాణాలు తెరవవద్దని వ్యాపారులకు పోలీసులు సూచించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసు బలగాలు మోహరిం చాయి. ఎమ్మెల్యేలు కాసు మహేష్‌రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డిలను హౌస్‌ అరెస్టు చేశారు. మాచర్ల, గురజాల, నరసరావుపేట నియోజకవర్గాలపై పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారిం చారు. నరసరావుపేట, మాచర్ల నియోజకవర్గాల్లో పోలింగ్‌ సంఘట నలపై 20 కేసులు నమోదు చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసు అధికారులు, సిబ్బందిపై చర్యలకు ఉన్నతాధికా రులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు ఏడు గురిని గుర్తించినట్లు తెలిసింది.

అజ్ఞాతంలోకి ముఖ్య నేతలు ..

మంగళవారం వైసీపీ, టీడీపీ నేతల ఘర్షణలతో కారంపూడి భీతిల్లడంతో రాత్రి నుంచే 144 సెక్షన్‌ విధించారు. వ్యాపారులు దుకాణాలు మూసివేశారు. దీంతో బుధవారం వీధులు నిర్మానుష్యంగా మారాయి. పోలీసులు పట్టణానికి వచ్చి పోయే ప్రతి వాహనాన్ని తనిఖీ చేశారు. వైసీపీకి చెందిన సర్పంచ్‌ భర్త తేజానాయక్‌, వలంటీర్‌ ప్రసాద్‌, చికెన్‌కొట్టు రాము, వెల్డింగ్‌షాపు యాసిన్‌, టీడీపీ పట్టణ అధ్యక్షుడు కటికల బాలకృష్ణ, మైనార్టీ నేత రబ్బాన్‌ బాజి, షేక్‌నన్నేసా, సినిమాహాల్‌ ఆపరేటర్‌ పలిశెట్టి కొండ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చింతపల్లికి చెందిన నలుగురు టీడీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పటికీ వారిని ఎక్కడికి తరలించారో తెలియలేదు. మంగళవారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో ఒప్పిచర్లకు చెందిన వైసీపీ నేతలు పెద్దకాల్వదాటి వాహనాల్లో పారిపోయారు. సీఐ నారాయణస్వామిపై దాడి చేసిన వైసీపీ నేత కొమెర అంకారావుకోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈక్రమంలో ఇరుపార్టీల నేతలు పలువురు అజ్ఞాతంలోకివెళ్లిపోయారు.

సంయమనంతో వ్యవహరించాలి : ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి

ప్రజలంతా సంయమనంతో వ్యవహరించాలని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించవద్దని ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి కోరారు. బుధవారం ఆయన రెంటచింతలను సందర్శించారు. ముందుజాగ్రత్త చర్యగా దుకాణాలను మూసివేయించారు. విధి నిర్వహణలో ఉన్న సీఆర్పీఎఫ్‌ సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రజలు పుకార్లను నమ్మవద్దని, తమకు తెలిసిన సమాచారాన్ని పోలీసులకు చెప్పాలన్నారు. సంఘ విద్రోహ శక్తులను చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఐజీ వెంట ఏఎస్పీ రమణమూర్తి తదితరులు ఉన్నారు.

పోలీసు వలయంలో మాచర్ల ..

మాచర్ల నియోజకవర్గంలో మంగళవారం జరిగిన ఘటనల నేపథ్యంలో పోలీసులు హైఅల్టర్‌ ప్రకటించారు. మంగళవారం రాత్రి నుంచి పోలీసులు పట్టణాన్ని చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు. పట్టణంలో 800 మంది ఆర్‌పీఎఫ్‌, సీఎస్‌ఎఫ్‌, ఎస్‌పీఎఫ్‌, ఏపీఎస్పీ, సివిల్‌ పోలీసులు మొహరించారు. అల్లరి మూకలను కట్టడి చేసేందుకు అదనపు పోలీసు బలగాలను రప్పించారు. పట్టణంలో నెహ్రూనగర్‌, బస్టాండ్‌ సెంటర్‌, పార్కు సెంటర్‌, పురపాలక సంఘం కార్యాలయ ప్రధాన రహదారి, రింగురోడ్లలో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి వచ్చి పోయే వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ముఖ్య నేతల గృహాల వద్ద పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్నారు. అనుమానం ఉన్న గృహాల్లో పోలీసులు తనిఖీ చేపట్టారు. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నివాసం సమీపంలోని ప్రతి గృహాన్ని జల్లెడ పట్టగా గాజు సీసాలు, ఖాళీ బీరు బాటిళ్లు, రాడ్లు, కర్రలు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి, ఎస్పీ బిందుమాధవ్‌, ఏఎస్పీ నాగేశ్వరరావు, గురజాల డీఎస్పీ పల్లపురాజు, ట్రైనీ డీఎస్పీ జగదీష్‌, సీఐలు భక్తవత్సలరెడ్డి, కిష్టయ్య, సింగయ్య, సురేష్‌, బ్రహ్మయ్య, నారాయణస్వామితోపాటు మరో ఆరుగురు సీఐలు, 25 మంది ఎస్‌లు శాంతి భద్రతలను పర్యవేక్షణలో ఉన్నారు.

పోలీసు పికెట్లు.. కేసులు

నకరికల్లు మండలంలో ఎన్నికలరోజు అల్లర్లు జరిగిన రూపెన గుంట్ల, చీమలమర్రి గ్రామాలతో పాటు సమస్యాత్మక గ్రామాలైన కుంకలగుంట, చేజర్ల గ్రామాల్లో స్పెషల్‌ ఫోర్స్‌తో పికెట్‌ ఏర్పాటు చేశారు. 26 మందిపై కేసులు నమోదు చేసినట్టు సత్తెనపల్లి రూరల్‌ సీఐ రాంబాబు తెలిపారు. వినుకొండ నియోజకవర్గంలో నూజెండ్లలో జరిగిన ఘర్షణలను నివారించేందుకు రెండో రోజు బుధవారం పోలీసు పికెట్లును కొనసాగించారు. మంగళవారం జరిగిన దాడులకు సంబంధించి 70 మందిపై కేసులు నమోదు చేసినట్టు ఎస్‌ఐ లక్ష్మీనారాయణరెడ్డి తెలిపారు. ఇరు వర్గాలకు చెందిన నాయకులకు పోలీసు స్టేషన్‌లో కౌన్సెలింగ్‌ నిర్వహించారు.

Updated Date - May 16 , 2024 | 01:05 AM