Share News

ఓట్ల లెక్కింపునకు పటిష్ట ఏర్పాట్లు

ABN , Publish Date - May 20 , 2024 | 12:30 AM

ఓట్ల లెక్కింపునకు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ పి.రంజిత్‌బాషా, ఎస్పీ వకుల్‌ జిందాల్‌ తెలిపారు. కౌంటింగ్‌ సెంటర్లలో ఏర్పాట్లకు సంబంధించి ఆదివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో అధికారులకు వారు పలుసూచనలు చేశారు.

ఓట్ల లెక్కింపునకు పటిష్ట ఏర్పాట్లు
ఆర్‌వోలు, డీఎస్పీలతో వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్న ఎస్పీ వకుల్‌ జిందాల్‌

బాపట్ల, మే 19: ఓట్ల లెక్కింపునకు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ పి.రంజిత్‌బాషా, ఎస్పీ వకుల్‌ జిందాల్‌ తెలిపారు. కౌంటింగ్‌ సెంటర్లలో ఏర్పాట్లకు సంబంధించి ఆదివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో అధికారులకు వారు పలుసూచనలు చేశారు. అభ్యర్థులు, ఏజెంట్లు, కౌంటింగ్‌ సిబ్బంది తప్పనిసరిగా నిబంధనలు పాటించాలన్నారు. కౌంటింగ్‌ రోజు 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందన్నారు. జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ కౌంటింగ్‌ రోజు బాపట్ల ఇంజనీరింగ్‌ కళాశాల కాంపౌండ్‌ నుంచి 100 మీటర్ల బయట బారీకేడ్‌లు ఏర్పాటు చేయాలని, వాహనాల్ని లోపలికి అనుమతించరాదన్నారు. ప్రధాన ద్వారం వద్ద అభ్యర్థులను, కౌంటింగ్‌ ఏజెంట్లను, కౌంటింగ్‌ సిబ్బందిని క్షుణ్ణంగా తనిఖీ చేసి లోనికి అనుమతించాలన్నారు. ఆర్‌వోలు ముందుగానే ఏజెంట్లకు, అభ్యర్థులకు గుర్తింపుకార్డులు మంజూరు చేయాలన్నారు. ప్రతి నియోజకవర్గ కౌంటింగ్‌లో సంబంధిత ఆర్‌వోనే ఇన్‌చార్జిగా వ్యవహరిస్తారని తెలిపారు. కౌంటింగ్‌ సెంటర్ల బయట మూడంచల భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. ఎన్నికల అనంతరం జరుగుతున్న పరిణామాలపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. ఇప్పటికే పలు ఘటనలపై కేసులు నమోదు చేసి అరెస్టు చేసినట్లు తెలిపారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా బైండోవర్‌ చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నందున జూన్‌ 6 వరకు ఎటువంటి ర్యాలీలు, ఊరేగింపులు, బాణాసంచా కాల్చడం నిషేధమని తెలిపారు. పెట్రోల్‌ బంకుల యాజమాన్యాలు లూజుగా క్యాన్లు, బాటిళ్లలో విక్రయాలు చేయరాదని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఏఎస్పీ విఠలేశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 20 , 2024 | 12:30 AM