Share News

పక్కరాష్ట్ర గూండాలతో పిన్నెల్లి దౌర్జన్యకాండ

ABN , Publish Date - May 15 , 2024 | 12:19 AM

పక్క రాష్ట్రం నుంచి గూండాలను పిలిపించి మాచర్లలో పిన్నెల్లి సోదరులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నా రని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

పక్కరాష్ట్ర గూండాలతో పిన్నెల్లి దౌర్జన్యకాండ

గుంటూరు, మే 14(ఆంధ్రజ్యోతి): పక్క రాష్ట్రం నుంచి గూండాలను పిలిపించి మాచర్లలో పిన్నెల్లి సోదరులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నా రని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ జిల్లా కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాచర్ల నియోజకవర్గం అంతా భయానక వాతావరణం నెలకొని వుందని, మాచర్లలో పిన్నెల్లి సోదరులు పక్క రాష్ట్రం నుంచి గూండాలను పిలిపించి దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు. పోలీసులకు పక్కాగా సమాచారం ఇచ్చినా నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించడం సిగ్గుచేటని విమర్శించారు. కారంపూడి దాడులపై పల్నాడు ఎస్పీకి ముందుగానే సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ కారణంగానే మూడు గంటల పాటు కారంపూడిలో వైసీపీ మూకలు విధ్వంసం సృష్టించాయన్నారు. కారంపూడి తర్వాత దుర్గి మండలంలో దాడులు చేశారని, కనపడిన వారందరిపై దాడులు చేస్తున్నారని, షాపులు, ఇళ్ళు ధ్వంసం చేస్తున్నారని చెప్పారు. పిన్నెల్లి సోదరులు సమాజంలో తిరగటానికి అనర్హులని, జగనరెడ్డి ఇలాంటి అరాచకవాదుల్ని ప్రోత్సహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఇప్పటికీ అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారని, పిన్నెల్లి సోదరులను ఎందుకు కట్టడి చేయటం లేదని విమర్శించారు. వారిని గృహ నిర్బంధం చేసి ఫోన్లు స్వాధీనం చేసుకోవాలని డిమాండ్‌ చేశారు. మాచర్లలో అరాచకం రాజ్యమేలుతోందని, మాచర్ల టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డిపై వైసీపీ దాడి చేసే అవకాశం ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం ఆధీనంలో ఏపీ పోలీసులు ఎందుకు పని చేయటం లేదని ఆయన నిలదీశారు. పోలీసులు ఇంకా వైసీపీ మత్తులోనే ఉన్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో టీడీపీ నగర అధ్యక్షుడు డేగల ప్రభాకర్‌, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు చిట్టాబత్తిన చిట్టిబాబు, కనపర్తి శ్రీనివాసరావు, మద్దిరాల ఇమ్మానుయేల్‌, కసుకుర్తి హనుమంతరావు, కార్పొరేటర్‌ వేములపల్లి శ్రీరాంప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 15 , 2024 | 12:20 AM