Share News

అమరావతితో ఉపాధికి చర్యలు

ABN , Publish Date - Jul 28 , 2024 | 12:42 AM

ఇక్కడి నిరుద్యోగ యువత వేరే ప్రాంతాలకు రూ.15 వేల వేతనానికి వెళ్లి అక్కడ అనేక ఇబ్బందులు పడుతున్నారు.

అమరావతితో ఉపాధికి చర్యలు
కలెక్టర్‌ నాగలక్ష్మి

గుంటూరు, జూలై 27 (ఆంధ్రజ్యోతి): ఇక్కడి నిరుద్యోగ యువత వేరే ప్రాంతాలకు రూ.15 వేల వేతనానికి వెళ్లి అక్కడ అనేక ఇబ్బందులు పడుతున్నారు. సంపాదించినది ఆహారం, వసతికే ఎక్కువగా ఖర్చు అవుతున్నది. ఇక్కడ వృత్తి నైపుణ్యంలో శిక్షణ పొంది వేరే చోట ఉద్యోగాలు చేస్తోన్న వారి అభిప్రాయాలను సేకరించాం. ఆ జీతమేదో ఇక్కడే వచ్చేలా చూస్తే తాము సొంత జిల్లాల్లోనే పని చేసుకుంటామని చెబుతున్నారు. మనకు అమరావతి రాజధానిలో వచ్చే ఉపాధి అవకాశాలు తప్ప ఇతర ప్రాంతాల్లో అంతగా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో రాజధానిలో ఉద్యోగ కల్పనకు సంబంధించి వచ్చే ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోకూడదు. ఆ దిశగా యువతకు శిక్షణ ఇచ్చి సిద్ధం చేసేందుకు కార్యచరణ ప్రణాళిక రూపొందిస్తున్నాం.. అని కలెక్టర్‌ ఎస్‌ నాగలక్ష్మి చెప్పారు. శనివారం ఆమె ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. ఆమె మాటల్లోనే..

బిల్డర్లతో మాట్లాడుతున్నాం

జిల్లాలో ఇప్పటికే కొంతమంది బిల్డర్లను పిలిపించి మాట్లాడాం. వారికి ఏ రంగంలో నైపుణ్యం కలిగిన యువతీ, యువకులు అవసరమో తెలుసుకున్నాం. ఆయా రంగాలపై చదువు పూర్తి చేసుకున్న వారికి శిక్షణ ఇప్పించేందుకు కార్యక్రమాలు రూపొందించాల్సిందిగా స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సంస్థ అధికారులను ఆదేశించాం. మరికొద్ది రోజుల్లో అమరావతి రాజధానిలో నిర్మాణాలు ప్రారంభం అవుతాయి. అప్పుడు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పుష్కలంగా అందుబాటులోకి వస్తాయి. వాటిని అందిపుచ్చుకునేందుకు యువతను సిద్ధం చేస్తున్నాం.

ఇండస్ట్రియల్‌ పార్కు ఏర్పాటు..

జిల్లాలోని యువతకు ఉపాధి నిమిత్తం పారిశ్రామికవాడ(ఇండస్ట్రియల్‌ పార్కు)ని ఏర్పాటు చేయడానికి ఉన్న అవకాశాలను ఆలోచిస్తున్నాం. కనీసం 20 ఎకరాల భూమి అయినా కావాలి. ఇందుకోసం అసైన్డ్‌భూములను పరిశీలిస్తున్నాం. మరోవైపు భూమి విలువ ఎక్కువగా ఉన్నందున అంత పెద్దమొత్తం పెట్టి కొనుగోలు చేసి పార్కుని ఏర్పాటు చేయడం ఏపీఐఐసీకి సాధ్యపడదు. పరిశ్రమల ఏర్పాటుని ప్రోత్సహించేందుకు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న 162 క్లెయిమ్‌లకు రూ.8.44 కోట్లు మంజూరు చేశాం.

ఇసుకపై పర్యవేక్షణ

ఇసుక సరఫరాకు సంబంధించి నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. సమస్యలపై స్వీకరించేందుకు కంట్రోల్‌ రూం ఏర్పాటు చేసినా స్పందించడం లేదు. తాళ్లాయపాలెంలో స్టాక్‌యార్డు వద్ద రోడ్డు సమస్య ఉన్నది. దానిని సత్వరమే పరిష్కరించాల్సిందిగా ఆర్‌డీవోకు ఆదేశాలు ఇచ్చాం. లింగాయపాలెంతో పాటు ఇతర చోట్ల కూడా లారీలు సీరియల్‌ నెంబరులో కాకుండా ఎలా పడితే అలా స్థానికత బలాన్ని ఉపయోగించి చేస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. ఈ విషయంలో కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించాం. చిర్రావూరు, ప్రాతూరులో రాత్రి వేళ ఇసుక తవ్వకాలపై చర్యలు చేపట్టేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తాం.

రోడ్లు, బ్రిడ్జీలు పూర్తికి చర్యలు

వివిధ ప్రాంతాల నుంచి నగరంలోకి రోడ్ల కనెక్టివిటీ చక్కగా ఉండేలా చర్యలు చేపడుతున్నాం. రైల్వే ఓవర్‌ బ్రిడ్జీలు, అండర్‌ బ్రిడ్జీలు రైల్వే శాఖనే పూర్తి చేసేలా కేంద్రానికి నివేదించాల్సిందిగా ప్రజాప్రతినిధులకు కోరుతున్నాం.

వర్షాలపై అప్రమత్తం

వర్షాలు కురుస్తూ నదులు, చెరువుల్లోకి కొత్త నీరు వస్తున్నందున సీజనల్‌ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. దీంతో నీటిని మరింతగా శుద్ధి చేయాలని మున్సిపల్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులను ఆదేశించాం. ఆస్పత్రుల్లో చికిత్సల కోసం వస్తున్న వారి వివరాలను ఎప్పటికప్పుడు సేకరిస్తున్నాం. డయేరియా ప్రబలినట్లుగా ఎక్కడా బయటపడలేదు.

నకిలీ విత్తనాలపై దృష్టి

వ్యవసాయ పనులు ప్రారంభమైనందున మార్కెట్‌లో ఎక్కడా నకిలీ విత్తనాలు రైతులకు విక్రయం జరగకుండా చూస్తున్నాం. వ్యవసాయ అధికారులతో తనిఖీలు చేయిస్తున్నాం. ఇప్పటివరకు రైతుల నుంచి ఫిర్యాదులు రాలేదు. బయో పురుగుమందులను అరికట్టే విషయంలో నిబంధనలు అస్పష్టంగా ఉన్నాయి. దీనిపై ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది.

Updated Date - Jul 28 , 2024 | 12:42 AM