ప్రేక్షకులను ఆలోచింపజేస్తున్న నాటికలు
ABN , Publish Date - May 18 , 2024 | 01:35 AM
రూరల్ మండలం కొలకలూరులో ప్రదర్శిస్తున్న నాటికలు ప్రేక్షకులను ఆలోచింపజేస్తున్నాయి. కొలంకపురి, వైకే నాటక కళా పరిషత్‌ల ఆధ్వర్యంలో శుక్రవారం మూడు నాటికలు ప్రదర్శించారు.
తెనాలి అర్బన్, మే 17: రూరల్ మండలం కొలకలూరులో ప్రదర్శిస్తున్న నాటికలు ప్రేక్షకులను ఆలోచింపజేస్తున్నాయి. కొలంకపురి, వైకే నాటక కళా పరిషత్‌ల ఆధ్వర్యంలో శుక్రవారం మూడు నాటికలు ప్రదర్శించారు. నరసరావుపేటమిత్ర క్రియేషన్స్ కళాకారులు ప్రదర్శించిన నోట్ దిస్ పాయింట్ నాటికను గంథం నాగరాజు రచించగా షేక్ బాషా దర్శకత్వం వహించారు. సమాజంలో అనాథలు పెరగడానికి కారణాలు గుర్తించి వారిని ఆదుకోవాలని లేని పక్షంలో సమాజానికి పెనుముప్పు కావచ్చని సందేశాన్ని నాటిక అందించింది. కుటుంబ బంధాలను గుర్తుచేస్తూ మళ్లీ కలిసి జీవిద్దాం నాటిక సందేశం ఇచ్చింది. ఈ నాటికను కృష్ణ తెలుగు థియేటర్ ఆర్ట్స్ కళాకారులు ప్రదర్శించారు. శారదా ప్రసన్న రచించగా చంద్రశేఖర్ దర్శకత్వం వహించారు. శ్రీకాకుళం శర్వాణి గ్రామీణ గిరిజన సంఘం కళాకారులు ప్రదర్శించిన కొత్తపరిమళం నాటికకు కాండ్రేగుల శ్రీనివాసరావు రచించగా పట్నాయక్ దర్శకత్వం వహించారు. సరిహద్దు సమస్యలతో దేశాల మధ్య జరిగే యుద్ధం అనర్ధాలే మిగుల్చుతుందని విశ్వమంతా స్నేహం, శాంతి వెల్లివిరిస్తే అందమైన ప్రపంచం కళ్లముందు ఉంటుందని కళాకారులు చాటి చెప్పారు. రంగస్థల నటుడు రామకోటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సభలో డీఎస్ దీక్షిత్ పురస్కారాన్ని రంగస్థల నటుడు రవీంద్రారెడ్డికి ప్రదానం చేశారు. కళాపరిషత్ ప్రతినిధులు స్వామి, రమణ, విజయ్, హరిబాబు, సూర్యనారాయణ, సుభాని, సుబ్బారావు పర్యవేక్షించారు. కాట్రగడ్డ రామకృష్ణ, శరత్, వెంకయ్య, శంకర్, తిరుమల్లేశ్వరరావు, మల్లికార్జునరావు, మల్లేశ్వరరావు పాల్గొన్నారు.