Share News

144 సెక్షన్‌.. ఇంకెన్ని రోజులు

ABN , Publish Date - May 19 , 2024 | 12:07 AM

పల్నాడులో పోలింగ్‌, తదుపరి జరగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో మంగళవారం జిల్లా అంతటా 144 సెక్షన్‌ విధించారు. అప్పటి నుంచి పట్టణాల్లో దుకాణాలను పోలీసులు తెరవనీయడంలేదు.

144 సెక్షన్‌.. ఇంకెన్ని రోజులు
నరసరావుపేటలో షాపులు మూయిస్తున్న పోలీసులు

ప్రజలు అవస్థలు.. వ్యాపారుల విలవిల

నరసరావుపేట, మే 18: పల్నాడులో పోలింగ్‌, తదుపరి జరగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో మంగళవారం జిల్లా అంతటా 144 సెక్షన్‌ విధించారు. అప్పటి నుంచి పట్టణాల్లో దుకాణాలను పోలీసులు తెరవనీయడంలేదు. 144 సెక్షన ఐదో రోజు శనివారం కూడా కొనసాగింది. గతంలో 144 సెక్షన్‌ సందర్భంగా దుకాణాలను మూయించిన దాఖలాలు లేవు. ఈ సారి అప్రకటిత కర్ఫ్యూని అమలు చేస్తుండటంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఇంకెన్ని రోజులు 144 సెక్షనను అమలు చేస్తారని అటు వ్యాపారులు ఇటు సామాన్య ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఐదు రోజులుగా దుకాణాల మూతతో వ్యాపారులు విలవిలాడుతున్నారు. రోజువారీ పనులకు వెళ్తే కానీ పూటగడవని కార్మిక కుటుంబాలను 144 సెక్షన్‌ తీవ్రంగా ఆర్థిక ఇబ్బందులకు గురిచేస్తుంది. 144 సెక్షన్‌ అంటే దుకాణాలు మూయాల్సిన అవసరం లేదు. ముగ్గురికి మించి ఒకే చోట గుమికూడ కూడదు. దీనిని వదిలేసి ఉదయం 9 గంటల కల్లా పోలీసులు బలవంతంగా దుకాణాలను మూయిస్తుండటంపై ఆయా వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యకతమవుతుంది. హింసాత్మక సంఘటనలు జరగకుండా నిరోధించడంలో విఫలమైన పోలీసులు జరిగిన తర్వాత సామాన్య ప్రజల జీవనానికి గండి కొడుతున్నారన్న మర్శలున్నాయి. నరసరావుపేట, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, మాచర్ల, దాచేపల్లి, గురజాలల్లో కఠినంగా 144 సెక్షన్‌ అమలు చేస్తున్నారు. అసలు అల్లర్లు జరగని చిలకలూరిపేటలో కూడా దుకాణాలను మూపివేయాలని పోలీసుల ఆదేశాలపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 144 సెక్షన్‌ తొలగించాలని, షాపులను తెరపించాలని, తమకు ఉపాధి కల్పించాలని పలువురు పోలీసు శాఖను కోరుతున్నారు.

Updated Date - May 19 , 2024 | 01:37 AM