Share News

Budget 2024: ఏపీ ప్రజల ఆశలపై కేంద్ర ప్రభుత్వం నీళ్లు చల్లింది

ABN , Publish Date - Feb 01 , 2024 | 03:27 PM

ఏపీ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం నిరాశ మిగిల్చిందని, వారి ఆశలపై నీళ్లు చల్లిందని సీడబ్ల్యూసీ సభ్యుడు గిడుగు రుద్రరాజు మండిపడ్డారు. కార్పొరేట్లకు మేలు చేకూర్చేలా కేంద్రం కార్పొరేట్ ట్యాక్స్‌ను తగ్గించిందని ఆరోపించారు. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ గురువారం మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన అనంతరం ఆయన ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.

Budget 2024: ఏపీ ప్రజల ఆశలపై కేంద్ర ప్రభుత్వం నీళ్లు చల్లింది

ఏపీ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం నిరాశ మిగిల్చిందని, వారి ఆశలపై నీళ్లు చల్లిందని సీడబ్ల్యూసీ సభ్యుడు గిడుగు రుద్రరాజు మండిపడ్డారు. కార్పొరేట్లకు మేలు చేకూర్చేలా కేంద్రం కార్పొరేట్ ట్యాక్స్‌ను తగ్గించిందని ఆరోపించారు. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ గురువారం మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన అనంతరం ఆయన ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రత్యేక హోదా, విభజన హామీలు, దుగరాజపట్నం పోర్టు, పోలవరం ప్రాజెక్ట్‌ను కేంద్రం పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజభన హామీలను అమలు చేయడంతో పాటు పోలవరం ప్రాజెక్టుకు తగిన నిధులు ఇవ్వాలని, అలాగే నిర్వాసితులకు నష్టపరిహారంగా పునరావాసం కల్పించాలని పీసీసీ లేఖ రాసినా.. ప్రభుత్వం నుంచి స్పందన రాలేదని ధ్వజమెత్తారు. హోంశాఖ, ఆర్థిక శాఖ మంత్రులకు కూడా లేఖ రాశామని, వారి నుంచి కూడా స్పందన లేదని చెప్పారు.


ఎన్డీఏ ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోదీ తిరుపతికి వచ్చినప్పుడు.. ఏపీకి తప్పకుండా ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారని, కానీ అది నెరవేర్చలేదని గిడుగు రుద్రరాజు విమర్శించారు. అసలు రాష్ట్ర విభజనకు బీజం వేసిందే బీజేపీ అని విరుచుకుపడ్డారు. విభజన చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపైనే ఉందని, కానీ కేంద్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదని నిప్పులు చెరిగారు. కార్పొరేట్లకు దేశాన్ని దోచిపెట్టేలా కేంద్రం వ్యవహరిస్తోందని ఆరోపణలు గుప్పించారు. ఏపీకి కేంద్రం చేస్తున్న నష్టాన్ని పీసీసీ షర్మిల నేతృత్వంలో ఏపీ కాంగ్రెస్ నేతలు జాతీయ నాయకులకు వివరిస్తామని తెలిపారు. శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలుస్తామన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల కోసం కాంగ్రెస్ పార్టీ తన పోరాటం కొనసాగిస్తూనే ఉంటుందని గిడుగు రుద్రరాజు చెప్పుకొచ్చారు.

Updated Date - Feb 01 , 2024 | 03:27 PM