Share News

Oath ceremony CM CBN : ప్రమాణ స్వీకారానికి సర్వం సిద్ధం

ABN , Publish Date - Jun 12 , 2024 | 03:09 AM

ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారానికి సర్వం సిద్ధమైంది. మరికొద్ది గంటల్లోనే ఆరంభం కానున్న ప్రమాణ స్వీకార వేడుక కోసం కృష్ణాజిల్లా గన్నవరంలోని కేసరపల్లి గ్రామం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఇరవై ఎకరాల ప్రాంగణంలో మూడు ...

Oath ceremony CM CBN : ప్రమాణ స్వీకారానికి సర్వం సిద్ధం

సర్వాంగ సుందరంగా కేసరపల్లి ముస్తాబు

20 ఎకరాల్లో జర్మనీ హ్యాంగర్స్‌ టెంట్లు నిర్మాణం

50 వేలమంది ఆహ్వానితుల కోసం 36 గ్యాలరీలు

మరో 50 వేల మంది ప్రజలు, కార్యకర్తల రాక

రాజధానిలో భూములిచ్చిన రైతులకోసం గ్యాలరీ

భారీగా విచ్చేసిన విదేశీ, జాతీయ అతిథులు

విజయవాడలోని హోటళ్లన్నీ కిటకిట

విజయవాడ, జూన్‌ 11 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారానికి సర్వం సిద్ధమైంది. మరికొద్ది గంటల్లోనే ఆరంభం కానున్న ప్రమాణ స్వీకార వేడుక కోసం కృష్ణాజిల్లా గన్నవరంలోని కేసరపల్లి గ్రామం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఇరవై ఎకరాల ప్రాంగణంలో మూడు అత్యంత భారీ జర్మనీ హ్యాంగర్స్‌ టెంట్లను ఏర్పాటు చేశారు. అరలక్ష మంది వరకు ప్రత్యేక ఆహ్వానితులు, వీవీఐపీలు, వీఐపీలకు ప్రత్యేకంగా పాసులు జారీచేశారు. మరో అర లక్ష మంది పార్టీ కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చే అవకాశం ఉండటం వల్ల ప్రాంగణంలోనూ, ఎన్‌హెచ్‌ - 65 వెంబడి భారీ ఎల్‌ఈడీ స్ర్కీన్లను ఏర్పాటు చేశారు. ఒక రోజు ముందుగానే సభాస్థలిలో ప్రమాణ స్వీకారోత్సవ ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈ కార్యక్రమానికి విదేశీ,జాతీయస్థాయి అతిథులు తరలి వస్తున్నారు. దాదాపుగా ఆహూతులంతా మంగళవారం రాత్రికి విజయవాడ చేరుకున్నారు. దీంతో ఇక్కడి హోటళ్లన్నీ అతిథులతో కిటకిటలాడుతున్నాయి. ఇక ఏర్పాట్ల విషయానికి వస్తే... ప్రమాణ స్వీకార వేదికపై 60 మంది వరకు కూర్చునే విధంగా ఏర్పాటుచేశారు. దానికి కుడివైపున మ్యూజిక్‌ బ్యాండ్‌కు ఒక వేదిక, ఎడమ వైపున సాంస్కృతిక కార్యక్రమాల కోసం మరో వేదికను ఏర్పాటు చేశారు. ప్రత్యేక ఆహ్వానితుల కోసం వేదిక వెనుక భాగంలో గ్రీన్‌ రూమ్స్‌ ఏర్పాటు చేశారు. వాటిని ఎవరెవరి కోసం ఏర్పాటు చేశారో వారంతా కేసరపల్లి - వెంకట నరసింహాపురం రోడ్డు మీదుగా వేదిక వెనుక ప్రాంతం నుంచి ఇక్కడికి చేరుకుంటారు. ప్రధానమంత్రి మోదీ కోసం ప్రత్యేకంగా వేదికకు అత్యంత సమీపంలో గ్రీన్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు. ప్రధాని మోదీతో పాటు, హోంమంత్రి అమిత్‌షా, నడ్డా , ఇతర కేంద్ర మంత్రులు కూడా ఈ గ్రీన్‌ రూమ్‌కు చేరుకుంటారు. ప్రధాని గ్రీన్‌ రూమ్‌కు వెనుకభాగంలో పీఎంవో సిబ్బంది కోసం మరో రూమ్‌ను ఏర్పాటు చేశారు. గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ కోసం ఒక గ్రీన్‌ రూమ్‌ను ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి కోసం ప్రత్యేకంగా గ్రీన్‌ రూమ్‌ను ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి గ్రీన్‌ రూమ్‌ పక్కనే వీవీఐపీల కోసం ఇంకో గ్రీన్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు.


12 హెలిప్యాడ్‌లు సిద్ధం

తరలివచ్చిన ప్రజలు ప్రమాణ స్వీకారాన్ని వీక్షించటానికి వీలుగా ప్రాంగణంలో ఎల్‌ఈడీ స్ర్కీన్లు ఏర్పాటు చేశారు. ప్రమాణ స్వీకారానికి వచ్చే ప్రత్యేక అతిథులు, జాతీయ పారిశ్రామికవేత్తలు, దౌత్యవేత్తలు తదితరులు ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లలో తరలిరానున్నారు. ప్రత్యేక హెలికాప్టర్లలో వచ్చే వారి కోసం విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో మొత్తం 12 హెలిప్యాడ్‌లను సిద్ధం చే శారు. విజయవాడ ఎయిర్‌పోర్టు రన్‌వే మీద అన్ని సందర్భాలలో ల్యాండింగ్‌ చేయటం వీలు పడదు. కాబట్టి .. ప్రత్యామ్నాయ హెలిప్యాడ్‌లను సిద్ధం చేశారు. జ్యూవెల్‌ కౌంటీ సమీపంలోని ఎలైట్‌ విస్తాలో ఎంపీలు, ఎంఎల్‌ఏలు, ఎమ్మెల్సీల కుటుంబ సభ్యులకు పార్కింగ్‌ ప్లేస్‌ కేటాయించారు. ఇక్కడి నుంచి వీరందరినీ అమరావతి ఏసీ బస్సులలో సభా ప్రాంగణానికి తరలిస్తారు. కేసరపల్లి విల్లా సమీపంలో వీవీఐపీల కోసం పార్కింగ్‌ ప్లేస్‌ ఏర్పాటు చేశారు. వీఐపీల కోసం వెటర్నరీ కాలేజీలో పార్కింగ్‌ ఏర్పాట్లు చేపట్టారు. ఇతరులకు సంబంధించి మేధా ఐటీ టవర్‌ రోడ్డు వెంబడి ఖాళీ స్థలాన్ని కేటాయించారు. ఎమ్మెల్యేలు, వారి కుటుంబ సభ్యులకు కేటాయించిన పార్కింగ్‌లో వాహనాలు నిలిపి అక్కడి నుంచి బస్సులలో సభా వేధిక వద్దకు తీసుకువస్తారు. ప్రతి జిల్లాలో చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమం లైవ్‌ టెలికాస్ట్‌ అయ్యే విధంగా ఏర్పాటు చేస్తున్నారు.

గ్యాలరీలు..

ప్రమాణ స్వీకార వేదికకు అభిముఖంగా ఏర్పాటు చేసిన మూడు జర్మనీ హ్యాంగర్స్‌ టెంట్లలో ప్రత్యేక ఆహ్వానితులు, ఎంవీఐపీలు, వీవీఐపీలు, వీఐపీల కోసం మొత్తంగా 36 గ్యాలరీలు ఏర్పాటు చేశారు.

గ్యాలరీ - 1 : జాతీయ మీడియా సభ్యులు 250 మందికి, జాతీయ స్థాయి పారిశ్రామికవేత్తలు 400 మంది.

గ్యాలరీ - 2 : పార్లమెంట్‌ సభ్యులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల కోసం 650 సీటింగ్‌ సామర్ధ్యంతో ఏర్పాటు.

గ్యాలరీ - 3 : చంద్రబాబు కుటుంబ సభ్యుల కోసం 300 మందికి సరిపడా ఏర్పాటు.

గ్యాలరీ - 4 : పవన్‌ కల్యాణ్‌ కుటుంబ సభ్యుల కోసం 300 మందికి సరిపడా నిర్మాణం

గ్యాలరీ - 5 : అమరావతి రాజధాని నిర్మాణానికి సహకరించిన దాతలు 300 మంది.

గ్యాలరీ - 6 : న్యాయమూర్తులు, అఖిల భారత సర్వీసు అధికారులు, దౌత్యవేత్తలతో కలిపి 250 మంది..

గ్యాలరీ - 7 : పారిశ్రామికవేత్తల కోసం 200 మందికి సరిపడా ఏర్పాటు.

గ్యాలరీ - 8 : స్థానిక మీడియాకు చెందిన 250 మంది.

ఇంకా... ఒక్కో గ్యాలరీకి వెయ్యి మంది పట్టేలా వీవీఐపీల కోసం ఆరు గ్యాలరీలు, గ్యాలరీకి వెయ్యి మంది చొప్పున వీఐపీల కోసం 24 గ్యాలరీలను కేటాయించారు.

Updated Date - Jun 12 , 2024 | 03:44 AM