Share News

ఇక్కడ ఎన్నికలు అక్కడ సందడి

ABN , Publish Date - Apr 30 , 2024 | 03:40 AM

గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎంపీ ఎన్నికల కంటే ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల హీటు అధికంగా ఉంది. ఎవరి నోట విన్నా ఏపీ ఎన్నికల గురించే చర్చ..! ఏపీలో ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు సైతం హైదరాబాద్‌లో ఉపాధి పొందుతున్న వారి ఓట్లపై గురిపెట్టారు.

ఇక్కడ ఎన్నికలు  అక్కడ సందడి

గ్రేటర్‌లో ఏపీ ఎన్నికల విందులు, భేటీలు

నియోజకవర్గాల వారీగా ఆత్మీయ సమ్మేళనాలు

ఫంక్షన్‌ హాల్స్‌, కన్వెన్షన్‌ సెంటర్లలో నిర్వహణ

అభ్యర్థుల తరఫున రంగంలోకి ప్రత్యేక టీమ్‌లు

ఉపాధి పొందుతున్న ఓటర్లకు సమాచారం

చార్జీలు చెల్లిస్తాం ఓటేసేందుకు రావాలని వేడుకోలు

తమను గెలిపించాలని అభ్యర్థుల విజ్ఞప్తులు

ఆ తర్వాత పసందైన విందు భోజనాలు

హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎంపీ ఎన్నికల కంటే ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల హీటు అధికంగా ఉంది. ఎవరి నోట విన్నా ఏపీ ఎన్నికల గురించే చర్చ..! ఏపీలో ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు సైతం హైదరాబాద్‌లో ఉపాధి పొందుతున్న వారి ఓట్లపై గురిపెట్టారు.

ఏపీలోని పలు నియోజకవర్గాల్లో గెలుపోటములను నిర్ణయించే ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

అభ్యర్థులు తమ తమ నియోజకవర్గ ఓటర్లతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. వారిని కలుసుకొని యోగక్షేమాలు తెలుసుకోవడంతో పాటు అక్కడే పసందైన విందు భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు.

తమకు ఓటు వేయాలని వేడుకుంటున్నారు. దీనికోసం గ్రేటర్‌లో ప్రత్యేకంగా ఏపీకి చెందిన అభ్యర్థుల టీమ్‌లు రంగంలోకి దిగాయి.

గెలుపోటములు నిర్ణయించే ఓట్లు..

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాలకు చెందినవారు పెద్దఎత్తున ఉపాధి పొందుతున్నారు. వారిలో చాలా వరకు తమ సొంత గ్రామాల్లోనే ఓట్లున్నాయి. ఇలాంటి ఓటర్లు ఏపీలోని వివిధ నియోజకవర్గాల వారీగా సుమారు 10వేల నుంచి 60వేల ఓట్ల వరకు ఉన్నట్టు తెలిసింది.

ఆ ఓట్లు కొన్ని నియోజకవర్గాల్లో గెలుపోటములను కూడా నిర్ణయిస్తాయి. అందుకే ఇక్కడ ఉపాధి పొందుతున్న ఏపీ ఓటర్లను గుర్తించి వారిని ఓటేసేందుకు తీసుకొచ్చే విధంగా అభ్యర్థులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం ప్రత్యేక టీమ్‌లు ఏర్పాటు చేసుకున్నారు. ఆయా టీమ్‌లు నగరంలో ఉంటున్న ఓటర్లను గుర్తించి వారి మొబైల్‌ నంబర్లు సేకరిస్తున్నారు.

ఆ తర్వాత ఫోన్‌ కాల్స్‌, వాట్సాప్‌ సందేశాల ద్వారా నగరంలోని కన్వెన్షన్‌ సెంటర్లు, ఫంక్షన్స్‌ హాల్స్‌, వివిధ హోటళ్లలో సమావేశాలు నిర్వహిస్తున్నట్టు సమాచారమిస్తున్నారు.

లోకేషన్‌ షేర్‌ చేయడంతోపాటు, క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసుకుని ఫలానా చోటుకి రావాలంటూ సూచిస్తున్నారు. వివిధ నియోజకవర్గాల వారీగా ఓటర్లతో వచ్చే ఆదివారం సమావేశాలు నిర్వహించడానికి ఇప్పటికే పలు ఫంక్షన్‌ హాల్స్‌, హోటల్స్‌ను బుకింగ్‌ చేసుకున్నట్టు తెలిసింది.

పసందుగా ఆత్మీయ సమావేశాలు

ఏపీలోని రాజానగరం నియోజకవర్గానికి చెందిన ఓటర్లకు గత ఆదివారం రాత్రి మియాపూర్‌లోని సత్యసాయి కన్వెన్షన్‌ సెంటర్‌లో ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి టీడీపీ, జనసేన పార్టీల నేతలు హాజరై కూటమికి ఓటు వేసి గెలిపించాలంటూ ఓటర్లను కోరారు.

ఈ సమావేశంలో పెద్దఎత్తున యువత పాల్గొనడం జనసేన అభ్యర్థికి ఎనలేని ఉత్సహాన్నిచ్చిన్నట్టు తెలిసింది. సమావేశం అనంతరం ఆయన అందరికీ విందు ఏర్పాటు చేసిన్నట్టు సమాచారం.

అనంతపురం జిల్లాకు చెందిన వైసీపీ అభ్యర్థి కూడా నగరంలో నివాసముండే తన నియోజకవర్గ ఓటర్లకు ప్రముఖ హోటల్‌లో ఆదివారం రాత్రి ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. రూ.4వేల విలువైన ఫుల్‌ బాటిల్‌ మద్యాన్ని కూడా అందించినట్టు తెలిసింది.

శని, ఆదివారాలు నగరంలోని పలు హోటల్స్‌, కన్వెన్షన్‌ సెంటర్లు మొత్తం ఏపీ ఓటర్లతో కిటకిటలాడనున్నాయి.

ఈ సందర్భంగా ఓటేసేందుకు వచ్చే ఓటర్లకు రాను, పోను బస్‌ చార్జీలు అందిస్తామని, అవసరమైతే వాహనాలు కూడా ఏర్పాటు చేస్తామని అభ్యర్థులు చెబుతున్నారు. తమను ఓటేసి గెలిపించాలని ప్రాధేయపడుతున్నారు.

Updated Date - Apr 30 , 2024 | 03:45 AM