Share News

వైసీపీ ఎంపీ వంగా గీత నిలదీత

ABN , Publish Date - Mar 11 , 2024 | 12:26 AM

గ్రామంలో అనేక సమస్యలు ఉన్నా అధికారులు సొంత పనులు చేసుకోవడం తప్ప ప్రజా సమస్యలను పట్టించుకోవడం మానేశారని, సమస్యలు పరిష్కరించిన తర్వాతే గ్రామంలో పర్యటించాలని దళిత హక్కుల పోరాట సమితి జిల్లా కన్వీనర్‌ సాకా రామకృష్ణ ఆదివారం ఎంపీ వంగా గీతను అడ్డుకున్నారు.

వైసీపీ ఎంపీ వంగా గీత నిలదీత

కొత్తపల్లి, మార్చి 10: గ్రామంలో అనేక సమస్యలు ఉన్నా అధికారులు సొంత పనులు చేసుకోవడం తప్ప ప్రజా సమస్యలను పట్టించుకోవడం మానేశారని, సమస్యలు పరిష్కరించిన తర్వాతే గ్రామంలో పర్యటించాలని దళిత హక్కుల పోరాట సమితి జిల్లా కన్వీనర్‌ సాకా రామకృష్ణ ఆదివారం ఎంపీ వంగా గీతను అడ్డుకున్నారు. కొత్తపల్లి మండలం కొమరగిరి శివారు ఆనందపురంలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనేందుకు కాకినాడ ఎంపీ, పిఠాపురం వైసీపీ ఇన్‌చార్జి వంగా గీత విచ్చేశారు. ఈ సందర్భంగా గ్రామంలోకి వచ్చిన ఎంపీని రామకృష్ణ అడ్డుకున్నారు. గ్రామంలో అనేక సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించడంలో అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు విఫలమయ్యారని రామకృష్ణ అన్నారు. శ్మశాన వాటిక అభివృద్ధి, విద్యుత్‌, రోడ్డు, ఇళ్ల స్థలాలు తదితర సమస్యలను ఎంపీకి వివరించారు. గ్రామస్థుల సమస్యల పరిష్కారంలో భాగంగా రెండు రోజుల్లో పనులు ప్రారంభిస్తామని ఎంపీ గీత హామీ ఇవ్వడంతో కార్యక్రమం కొనసాగించారు.

Updated Date - Mar 11 , 2024 | 12:26 AM