Share News

ఎటు చూసినా వీళ్లే!

ABN , Publish Date - Mar 16 , 2024 | 12:21 AM

ఎటు చూడు వైసీపీ హోర్డింగ్స్‌.. కటౌట్లే.. ఏ ఫ్లెక్సీ చూసినా సిద్ధం సిద్ధం అంటున్నారు.. ఐదేళ్లలో అభివృద్ధి చేయడం చేతగాని వైసీపీ నాయకులు ఎన్నికల నియమావళికి కూతవేటు దూరంలో ఒక పక్క సిద్ధం అంటూ మరో పక్క నాకో కల ఉంది అంటూ ఓట్ల కో సం వల వేస్తున్నారు. అయితే ఓటర్లు ఒక్క చాన్స్‌ అంటే ఐదేళ్లు అవకాశం ఇచ్చాం.. మోసపోయాం.. సిద్ధం అంటే ఎలా ఇస్తాం.. అంటున్నారు.

ఎటు చూసినా వీళ్లే!
ఇది తగునా : రాజమహేంద్రవరం పుష్కరఘాట్‌ వద్ద శివరాత్రి రోజున రోడ్డు మధ్యన పెట్టిన ఫ్లెక్సీలు.. నాటి నుంచి ఇలాగే వదిలేశారు..

ఓటు అడిగే త్రోవ లేక.. ప్రచార యావ!?

రోడ్లు.. హోర్డింగ్‌లు.. ఇళ్లకూ వైసీపీ ఫ్లెక్సీలే

రద్దీ ప్రదేశాల్లో ఏర్పాటుతో ట్రాఫిక్‌ ఇబ్బందులు

బాబోయ్‌ చూడలేకపోతున్నామంటున్న జనం

బహిరంగ సభ మైదానాలపై ఖర్చీఫ్‌

కనీస అనుమతులు లేకుండానే ఏర్పాటు

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

ఎటు చూడు వైసీపీ హోర్డింగ్స్‌.. కటౌట్లే.. ఏ ఫ్లెక్సీ చూసినా సిద్ధం సిద్ధం అంటున్నారు.. ఐదేళ్లలో అభివృద్ధి చేయడం చేతగాని వైసీపీ నాయకులు ఎన్నికల నియమావళికి కూతవేటు దూరంలో ఒక పక్క సిద్ధం అంటూ మరో పక్క నాకో కల ఉంది అంటూ ఓట్ల కో సం వల వేస్తున్నారు. అయితే ఓటర్లు ఒక్క చాన్స్‌ అంటే ఐదేళ్లు అవకాశం ఇచ్చాం.. మోసపోయాం.. సిద్ధం అంటే ఎలా ఇస్తాం.. అంటున్నారు. జిల్లాలో ఏ నియోజకవర్గంలో చూసినా ఫ్లెక్సీలతో ఊదరగొట్టేస్తున్నారు. గుడి దగ్గర, బడి సమీపంలో, జంక్షన్ల నిండా, డివైడర్ల మధ్యలో స్తంభాలకు, బస్‌ షెల్టర్లకు.. ఎక్కడ చూసినా వైసీపీ బొమ్మలతో కూడిన పోస్టర్ల, తాత్కాలిక ద్వారాలతో నింపే స్తున్నారు. ప్రతిపక్షాల ప్రచారానికి చోటు లేకుండా చేయాలనే కుతంత్రాలతో కొందరు నాయకులు సభా మైదానాలు, హోర్డింగ్‌ లను రోజుల పాటు బుక్‌ చేసేసుకున్నారు. దీనికి తోడు మొబైల్‌ ప్రచార వాహనాలతో హోరెత్తిస్తున్నారు. రాజమహేంద్రవరం జిల్లా కేంద్రంలో ఎక్కడ చూసినా ఎంపీ భరత్‌రామ్‌ ఫ్లెక్సీలే దర్శనమిస్తు న్నాయి. వీటిపై ‘అభివృద్ధికి సిద్ధం’ అని ఉండడం చూస్తున్న జనం.. ఈ నాలుగేళ్ల పది నెలల్లో అభివృద్ధి చేయకుండా మళ్లీ ‘సిద్ధమే మిటి?’ అని ప్రశ్నిస్తున్నారు. అధికారం మాటున ఏర్పాటు చేస్తున్న ఈ ప్రచార బోర్డులకు వేటికీ అనుమతులు లేకపోవడం గమనార్హం.

ఎందుకీ చిన్నెలు..

జిల్లా వ్యాప్తంగా తరచుగా సభలు ఏర్పాటు చేసుకునే మైదా నాలను వైసీపీ నాయకులు 20 రోజుల వరకూ మందస్తుగా వివిధ పేర్లతో చేబట్టారని తెలుస్తోంది. అలాగే ప్రైవేటు వారి చేతుల్లో ఉండే హోర్డింగులను భయాన చెరబట్టారని సమాచారం. దీంతో ఎక్కడ హోర్డింగులు చూసినా వైసీపీ ఫ్లెక్సీలే కనిపిస్తున్నాయి. రాజమహేంద్రవరం సిటీ పరిధిలోని హోర్డింగులను నెల రోజులకు వైసీపీ నేత తన గుప్పిట్లో బంధించేశారని సమాచారం. అలాగే సిటీలో సభలకు అనుకూలంగా ఉండే సుబ్రహ్మణ్య మైదానాన్ని 20 రోజుల పాటు బుక్‌ చేసుకున్నారని తెలుస్తోంది. దీంతో మైదా నంలో వైసీపీ కటౌట్లను, ఫెక్సీలను తొలగించకుండా రోజూ అలాగే ఉంచుతున్నారు.వైసీపీ నాయకులు ఇష్టానుసారం ఫెక్సీలు, హోర్డిం గులు, బోర్డులు, పోస్టర్లు పెడుతుండడం అటు అధికారులకూ చిరాకు రప్పిస్తోందని అంటున్నారు. అధికార పార్టీ కావడం, వారు అడ్డమైన మార్గాల్లో వెళతారనే అనుభవం ఉండడంతో వెనకడుగు వేస్తున్నారు.ఎన్నికల నోటిఫికేషన్‌ ప్రకటించిన మరుక్షణమే కటౌట్లు దించేయడానికి, హోర్డింగులపై ఫెక్లీలు తొలగించ డానికి అధికా రులు ‘సిద్ధం’గా ఉన్నారని చెబుతున్నారు.సిబ్బందికి ఈ మేరకు అధికారులు మౌఖిక ఆదేశాలూ జారీ చేశారట. దీంతో నోటిఫికేషన్‌ వచ్చీ రావడంతో ఫ్లెక్సీలను తొలగించే పని పెద్ద ఎత్తున చేపట్టనున్నారు. పర్యా వర ణానికి హానికరమైన ఈ ఫెక్సీలను ఏ విధంగా ధ్వంసం చేస్తారోనని పర్యావరణవేత్తలు ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉండగా గతేడాది మే నెలలో జరిగిన మహానాడులోనూ వైసీపీ నాయకులు ఇలాగే అడ్డుతగిలారు..నాడు జనం వైసీపీ అడ్డంకులను అధిగ మిం చి మహానాడు విజయవంతం చేశారు. ఎన్నికల వేళ ఇబ్బం దు లు పెడుతున్నారు. టీడీపీ ఫ్లెక్సీలు చించివేసి.. హోర్డింగ్‌లు అద్దెకు ఇవ్వ కుండా చేస్తున్నారు. దీంతో ఎన్నికల్లో కూడా తమదే విజయమని టీడీపీ నాయకులు అంటున్నారు.

హద్దులే లేని ప్రచార పిచ్చి..

కొవ్వూరు,నిడదవోలు, గోపాలపురం, రాజానగ రం, అనపర్తి, రాజమహేంద్రవరం రూరల్‌లో చిన్న చిన్న రోడ్లను కూడా వైసీపీ పోస్టర్లతో నింపేశారు. ప్రచార యావ బాగా తలకెక్కిన వైసీపీ నాయకులకు ప్రజల ఇబ్బందులు పట్టడంలేదు.జిల్లా కేంద్రమైన రాజమహేంద్ర వరంలోని గోదావరిగట్టు, పుష్కరఘాట్‌ తదితర ప్రాంతాల్లో సాధారణంగా ట్రాఫిక్‌ ఎక్కువగా ఉంటుంది. సాయం త్రం వేళల్లో ఇక్కడ ట్రాఫిక్‌ నియంత్రించడంలో పోలీసులు నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటారు. వాహనదారులు నరకం చూస్తూ ఉంటారు. ఈ ఇక్కట్లు కూడా వైసీపీ నాయకులకు కనిపించడం లేదు. పుష్కర్‌ఘాట్‌, గోదావరి గట్టుపైన ఉమామార్కండేయ స్వామి దేవాలయం వద్ద వైసీపీ నాయకులు తాత్కాలిక ద్వారాలు ఏర్పాటు చేశారు. ఈ ద్వారాలతో ఆ ప్రాంతాలు మరింత ఇరుకుగా మారిపోవడంతో ట్రాఫిక్‌కి తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. డివైడర్ల మధ్య, రోడ్ల పక్కన కరెంటు స్తంభాలను వైసీపీ ఫ్లెక్సీలతో నింపేశారు. ఇక సులభ్‌ కాంప్లెక్సులు ఒకటే మిగిలి ఉన్నాయని జనం ఎద్దేవా చేస్తుండడం గమనార్హం. కటౌట్లకు, ఫెక్సీల ఏర్పా టుకు అనుమతుల్లేకపోయినా అధికారులు నోరెత్తలేని పరిస్థితి.

అభివృద్ధి చేతకాక..

జగన్‌ కల్లబొల్లి మాటలను నమ్మి జనం అధికార పీఠం ఎక్కించి నాలుగేళ్ల పది నెలలైంది. ఇప్పటి వరకూ చేసిన అభివృద్ధి గురించి వైసీపీ నాయకులు స్పష్టంగా చెప్పలేని పరిస్థితి. పంచాయతీలకు వచ్చిన కేంద్ర నిధులతో చేసిన పనులనూ వైసీపీ పాలకుల ఖాతా లో వేసుకున్నారు.ఆ నిధులతో కొనుగోలు చేసిన వాటర్‌ ట్యాంకర్లపై కూడా వైసీపీ నాయకులు బొమ్మల ప్రదర్శన చేశారు. ఏ నియో జకవర్గంలోనూ చెప్పుకోదగిన పనులు జరగలేదనేది వాస్తవంగా కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో ఆర్భాటాలు తప్ప చిత్తశుద్ధి లేదని జనం విమర్శిస్తున్నారు. ఇన్నాళ్లలో కుడి చేతితో పంచేసి ఎడమ చేతితో పిండేయడం తప్ప ఏ వర్గాలకూ వైసీపీ ప్రభుత్వం చేసిన మేలు లేదు. రోడ్లు, డ్రైన్లు, వీధి దీపాలు, మంచినీటి సదుపా యం వంటివేమీ పట్టించుకోలేదు. గోదావరి నది పక్కనే ఉన్నా ఈ నాటికీ నీటి కోసం కటకటలాడే ప్రాంతాలు రాజమహేంద్రవరం చుట్టుపక్కల గగ్గోలు పెడుతున్నాయి. ఈ నాలుగేళ్ల పది నెలలూ ప్రధాన సమస్యలను ‘గాలి’కి వదిలేయడంతో ఇప్పుడు ప్రజల వద్దకు ఓటు కోసం ఎలా వెళ్లాలో ముఖం చెల్లని వైపీపీ నాయ కులు చీరల పంపిణీ, ఫ్లెక్సీలతో అవాస్తవ ప్రచారాలనే నమ్ముకోక తప్పని పరిస్థితి వచ్చింది.

Updated Date - Mar 16 , 2024 | 12:21 AM